రూ.1.23 కోట్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-11-29T07:05:23+05:30 IST

ప్రజాపంపిణీ పథకం బియ్యం దారి మళ్లింపులో భారీ దోపిడీ బయటపడింది.

రూ.1.23 కోట్ల రేషన్‌ బియ్యం పట్టివేత

తోటపేటలో విజిలెన్స్‌ దాడులు 

194.750 టన్నుల బియ్యం స్వాధీనం 

ద్రాక్షారామ, నవంబరు 28 : ప్రజాపంపిణీ పథకం బియ్యం దారి మళ్లింపులో భారీ దోపిడీ బయటపడింది. రామచంద్రపురం మండలం తోటపేటలో సాయిమణికంఠ ట్రేడర్స్‌ మిల్లుపై శనివారం విజిలెన్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో 194.750 టన్నుల పీడీఎస్‌ బియ్యం పట్టుబడింది. బియ్యం విలువ రూ.1,23,12,750గా తేల్చారు. జిల్లా విజిలెన్స్‌ అధికారులకు అందిన సమాచారం మేరకు ఎస్పీ రవిప్రకాష్‌, డీఎస్పీ ముత్యాలనాయుడు, తహశీల్దార్‌ విజయకుమార్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం తోటపేటలో సాయిమణికంఠ ట్రేడర్స్‌పై దాడులు చేసింది. మిల్లులో ప్రవేశించిన విజిలెన్స్‌ అధికారులు అక్కడ ఉన్న బియ్యం స్టాకు చూసి విస్తుపోయారు. టన్నుల కొద్దీ పీడీఎస్‌ బియ్యం బస్తాలు అధికారులు గుర్తించారు. ఏపీ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ముద్రణ సంచులతో ఉన్న బస్తా లు భారీగా ఉండడంతో అధికారులు కంగుతిన్నారు. దీంతో పరిసర మండలాల ఎంఎస్‌వోలను రప్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు స్టాకు లెక్కించారు.  సివిల్స్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ముద్రణ సంచులతో ఉన్న బస్తాలు లాటుగా పెట్టించి 1,211 బస్తాలు ఉన్నట్టు లెక్కతేల్చారు. మిల్లు బియ్యం స్టాకుతో నిండిపోవడంతో రెండు ట్రాక్టర్లలో బస్తాలను ద్రాక్షారామ మార్కెట్‌ యార్డు గొడౌన్‌కు తరలించారు. 

ఆరు ఆటోలు రెండు లారీలు సీజ్‌

వివిధ ప్రాంతాల నుంచి పీడీఎస్‌ బియ్యంతో వచ్చి దిగుమతి చేసేందుకు మిల్లు వద్ద ఉన్న 5 ఆటోలు, ఒక టాటాఏస్‌ వాహనం గుర్తించి వాటిని సైతం సీజ్‌ చేశారు. అదేవిధంగా పాలిష్‌ చేసిన పీడీఎస్‌ బియ్యంతో రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన రెండు లారీలు అధికారులు గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. వాహనాలు ద్రాక్షారామ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

ఎనిమిది మందిపై కేసు

పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వ, రవాణాకు సంబంఽధించి రామచంద్రపురం మండలం హసన్‌బాదకు చెందిన మిల్లు యజమానులు యర్రా సుబ్రహ్మణ్యం, చక్కా రామకృష్ణలతోపాటు ఆరుగురు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు. బియ్యం రవాణాపై విచారించేందుకు వీరిపై ద్రాక్షారామ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని, పట్టుబడ్డ బియ్యం సివిల్‌ సప్లయిస్‌ అధికారులకు అందజేస్తామని తెలిపారు. దాడు ల్లో విజిలెన్స్‌ సీఐలు ఎన్‌.రమేష్‌, సత్యకిషోర్‌, హెచ్‌సీ ప్రసాద్‌, పీసీలు ఈశ్వరరావు, వీరబాబులతోపాటు సివిల్‌ సప్లయిస్‌ డీఎస్‌వో ప్రసాదరావు, ఏఎస్‌వో కెఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌, ఆర్‌ఐ మహాలక్ష్మీనాయుడు, ఎంఎస్‌వోలు సీహెచ్‌వీ ప్రసాద్‌, సీహెచ్‌ సూర్యరాయణ, టి.పద్మ, టి. తోజోమణి, ఇస్మాయిల్‌, దివాకర్‌; రామారావు, వీఆర్‌వోలు గోపీనాద్‌, శ్రీనివాస్‌, సూర్యకుమారి, రామకృష్ణ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పీడీఎస్‌ బియ్యం సివిల్‌ సప్లయిస్‌ బ్యాగుల్లో పెద్దఎత్తున గుర్తించడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. ఈ బియ్యం స్టాకు పాయింట్ల ద్వారా వచ్చిందా లేదా డీలర్లు నుంచి రవాణా అయ్యిందా అన్న విషయం తేలాల్సి ఉంది. 

అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవు : జేసీ

భానుగుడి(కాకినాడ), నవంబరు 28: జిల్లాలోని ప్రైవేటు గోదాములు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎం ఆర్‌) మిల్లులపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి సారించి, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నివేది కలు పంపాలని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వ్యవసాయ, పౌరసరఫరా, మిల్లులు, తూనికలు-కొలతలు, డీఆర్‌డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ పౌరసరఫరాల కింద ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తున్న మిల్లులు, అక్రమంగా నిల్వ ఉంచుతున్న గోదాముల యజమానులపై కఠిన చర్యలు తప్పవన్నారు. గత రెండేళ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, అదేవిధం గా మిల్లర్లు ముందుకు వెళ్లాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలు పాల్పడే యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. గ్రామ వ్యవసాయ, సహాయకుల సహకారంతో పేర్ల ను రిజిస్టర్‌ చేసుకుని, ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాల ద్వారా సరైన మద్దతు ధర పొం దాలన్నారు. రైతు భరోసా కేంద్రాల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పంట నష్టాల నివేదిక రూపకల్పన సత్వరం పూర్తిచేయాలని కోరారు.

Updated Date - 2020-11-29T07:05:23+05:30 IST