ఇంకెన్నాళ్లీ ప‘రేషన్‌’?

ABN , First Publish Date - 2021-03-04T06:53:32+05:30 IST

రేషన్‌ డోర్‌ డెలివరీ సంగతేమో గానీ, మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్ల తీరుతో.. జిల్లాలో కార్డుదారులకు కష్టాలు తప్పటం లేదు.

ఇంకెన్నాళ్లీ ప‘రేషన్‌’?

వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు అందని రేషన్‌

పనులు మానుకుని కార్డుదారుల నిరీక్షణ

రేషన్‌ డిపోల్లోనూ పంపిణీ చేస్తేనే మేలు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

రేషన్‌ డోర్‌ డెలివరీ సంగతేమో గానీ, మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్ల తీరుతో.. జిల్లాలో కార్డుదారులకు కష్టాలు తప్పటం లేదు. జిల్లాలో వందకు పైగా ఎండీయూ ఆపరేటర్లు విఽధుల నుంచి తప్పుకుని వాహనాలను తిరిగి అప్పగించేయటంతో.. వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోపక్క ఆపరేటర్ల తీరుతో అనేక మంది కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్వో, వలంటీర్లతో ఆపరేటర్లకు సమన్వయం లేకపోవడంతో ఏ రోజు ఎక్కడ రేషన్‌ పంపిణీ చేస్తారో కార్డుదారులకు ముందుగా తెలియటం లేదు. దీంతో కార్డుదారులు తమ పనులను పక్కన పెట్టుకుని నిత్యావసరాల పంపిణీ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. సెంటర్లలో వాహనాలను ఉంచి నిత్యావసరాలను పంపిణీ చేయటం వల్ల చాలాచోట్ల వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడే వారికి సమాచారం తెలియటం లేదు. వ్యాన్‌ వెళ్లిపోతే తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లు కూడా రేషన్‌ తీసుకోని వారు ఇంట్లో లేరని పేర్కొనడంతో, మిగిలిపోయిన వారికి బియ్యం ఇచ్చే విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కో ఎండీయూ ఆపరేటర్‌ రెండుకుపైగా డిపోల పరిధిలో నిత్యావసరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వారికి కూడా మిగిలిపోయిన వారి కోసం ప్రత్యేకంగా వచ్చి నిత్యావసరాలు ఇచ్చే విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులను సరిచేయటానికి కార్డుదారులు తాము కోరుకున్న సమయంలో, తమ వెసులుబాటు ప్రకారం రేషన్‌ డిపోల్లో కూడా నిత్యావసరాలను తీసుకునే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. కార్డుదారులకు ఇలా రెండు రకాల ఆప్షన్‌ ఇవ్వటం వల్ల.. రేషన్‌ పంపిణీ విషయంలో సగం ఇబ్బందులు తొలగుతాయి. ఈ ఆప్షన్స్‌ వల్ల ఒకవేళ ఆ రోజు ఏదైనా కారణాల వల్ల రేషన్‌ అందుకోలేని వారు, మరో రోజు డి పోకు వెళ్లి నిత్యావసరాలు తీసుకుంటారు. ఎక్కువ భాగం డోర్‌ డెలివరీ జరుగుతుంది కాబట్టి రేషన్‌ డిపోల్లో కూడా రద్దీ ఉండదు. కార్డుదారులు తమ వీలును బట్టి నిత్యావసరాలను తీసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్‌ డిపో డీలర్లకు చెందిన ఈ పోస్‌ను ఉపయోగిస్తుంటాడు. ఇదే డిపో ఎండీయూ ఆపరేటర్‌ వేరే డిపో పరిధిలో రేషన్‌ డెలివరీ చేసే సందర్భంలో ఆ డీలర్‌ ఈ-పోస్‌ వినియోగిస్తాడు కాబట్టి డిపో దగ్గర కార్డుదారులు నిత్యావసరాలను తీసుకోవటానికి ఎలాంటి సమస్యా ఉండదు. జిల్లాలో వంద మందికి పైగా ఎండీయూ ఆపరేటర్లు వాహనాలను సరెండ్‌ చేయటంతో.. కొత్త వారిని ఎంపిక చేసే వరకు నిత్యావసరాలను ఇవ్వాలని రేషన్‌ డీలర్లనే ఆదేశిస్తున్నారు. డీలర్లు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారు. కానీ, వీఆర్వో లాగిన్‌లో ఇవ్వమనటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. రేషన్‌ డీలర్లు తమ లాగిన్‌ లోనే నిత్యావసరాలు ఇస్తామని, వీఆర్వో లాగిన్‌ లో ఇవ్వాల్సిన ఖర్మ మాకేమిటని అంటున్నారు. వీఆర్వో లాగిన్‌లో ఇవ్వటం వల్ల నిత్యావసరాల పంపిణీ ఎండీయూ ఆపరేటర్ల ఖాతాలోకి వస్తుంది. అదే డీలర్‌ లాగిన్‌లో ఇస్తే డీలర్‌ ఇచ్చినట్టు వస్తుంది. తమ బాధలను కప్పిపుచ్చుకునేందుకు జిల్లా అధికారులు డీలర్ల మెడ మీద కత్తి పెడుతున్నారు. అధికారులు రేషన్‌ పంపిణీ సాఫీగా నడిపించటానికి కార్డుదారులకు తమకు వీలైన సమయంలో డిపోలకు కూడా వెళ్లి నిత్యావసరాలను తీసుకునే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2021-03-04T06:53:32+05:30 IST