రేషన్‌ పంపిణీకి సర్వర్‌ బ్రేకులు

ABN , First Publish Date - 2020-11-28T06:18:11+05:30 IST

సర్వర్‌ సమస్య కారణంగా జిల్లాలో ఈ విడత నాలుగోవంతు మంది కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందలేదు.

రేషన్‌ పంపిణీకి సర్వర్‌ బ్రేకులు
రేషన్‌ పంపిణీ గడువు పెంచాలంటూ శుక్రవారం జీకేవీధి తహసీల్దార్‌ కార్యాలయం ఆందోళన చేస్తున్న గిరిజనులు.


27వతేదీ వరకు 74.67 శాతం కార్డుదారులకే అందిన సరుకులు

రేషన్‌ గడువు మరో మూడు రోజులు పొడిగింపు

వచ్చేనెల నుంచి ఉచిత బియ్యానికి స్వస్తి

కందిపప్పు కిలో రూ.67కు పెంపు


విశాఖపట్నం/ నర్సీపట్నం, నవంబరు 27: సర్వర్‌ సమస్య కారణంగా జిల్లాలో ఈ విడత నాలుగోవంతు మంది కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందలేదు. ముందుగా ప్రకటించినట్టు రేషన్‌ పంపిణీ 27వ తేదీతో ముగియగా, సర్వర్‌ సరిగా పనిచేయకపోవడంతో ఇంకా 25 శాతం మందికి రేషన్‌ పంపిణీ కాలేదు. దీంతో ఆయా కార్డుదారులు ఈ నెలాఖరు వరకు సరకులు తీసుకునేలా వెసులుబాటు  కల్పించారు. జిల్లాలో  13,20,321 బియ్యం కార్డులు వుండగా, శుక్రవారంనాటికి 9,86,000 కార్డులకు (74.67 శాతం) మాత్రమే సరకులు అందించగలిగారు. 3,34,321 కుటుంబాలకు రేషన్‌ అందలేదు. 


వచ్చే నెల నుంచి ఉచిత బియ్యానికి స్వస్తి

కరోనా ప్రభావంతో మార్చి నుంచి ఇప్పటి వరకు 16 విడతలుగా ఉచిత బియ్యం అందజేసిన ప్రభుత్వం, వచ్చే నెల నుంచి ఉచితానికి స్వస్తి పలకనున్నది. డిసెంబరు నుంచి నెలకు ఒక్కసారి మాత్రమే రేషన్‌ ఇస్తారు. బియ్యానికి కిలో రూపాయి చొప్పున చెల్లించాలి. కాగా  కందిపప్పు కిలోకు రూ.27 పెంచారు. ఇప్పటి వరకు కిలో రూ.40లకు అందజేయగా, వచ్చే నెల నుంచి కార్డుదారులు రూ.67 చెల్లించాలి. 


Updated Date - 2020-11-28T06:18:11+05:30 IST