రేషన్‌.. పింఛన్‌ దరఖాస్తుదారుల టెన్షన్‌

ABN , First Publish Date - 2021-02-25T06:13:24+05:30 IST

గత కొన్ని సంవత్సరాల నుంచి మంజూరుకు నోచుకొని రేషన్‌కార్డులు, ఆసరాపెన్షన్‌ల హడావిడి మళ్లీ మొదలైంది. పింఛన్‌ల కోసం వృద్దులు, వికలాంగులు, వితంతువులు దరఖాస్తులు చేసుకునేందుకు సంబంధిత కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు.

రేషన్‌.. పింఛన్‌ దరఖాస్తుదారుల టెన్షన్‌
పౌర సరఫరా అధికారి కార్యాలయం

జిల్లాలో రెండేళ్ల నుంచి నిలిచిపోయిన మంజూరులు 

వందల మంది ఎదురుచూపులు 

కొత్తగా దరఖాస్తుల కోసం క్యూ 

ఆధార్‌ కేంద్రాల వద్ద వృద్దుల అవస్థలు 

ఇప్పటికి అధికారికంగా వెలువడని దరఖాస్తుల గడువు ప్రకటన 

అంతా అయోమయం .. గందరగోళం 


నిర్మల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : గత కొన్ని సంవత్సరాల నుంచి మంజూరుకు నోచుకొని రేషన్‌కార్డులు, ఆసరాపెన్షన్‌ల హడావిడి మళ్లీ మొదలైంది. పింఛన్‌ల కోసం వృద్దులు, వికలాంగులు, వితంతువులు దరఖాస్తులు చేసుకునేందుకు సంబంధిత కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఆధార్‌కార్డుల్లో తప్పులను సవరించుకునేందుకు వీరంతా ఆ కేంద్రాల వద్ద అవస్థలు ఎదుర్కొంటున్నారు.


అలాగే కొన్ని సంవత్సరాల నుంచి నిలిచిపోయిన రేషన్‌ కార్డుల కోసం వందలాది మంది తహసీల్దార్‌ కార్యాలయా ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇటు రేషన్‌కార్డులపైనా అటు పెన్షన్‌ల మంజూరుపైన ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన గాని అలాగే దరఖాస్తుల కోసం చివరి గడువు గాని వెలువడకున్నప్పటికీ కేవలం సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఈ హడావిడి తీవ్రమైపోయింది. జిల్లాలో ప్రస్తుతం వందలాది మంది వృద్దులు పెన్షన్‌లు,రేషన్‌కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇదే అదనుగా కొంతమంది పెన్షన్‌లు, రేషన్‌కార్డులను ఇప్పిస్తామంటూ అమాయకులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


జిల్లాలో ప్రస్తుతం 2,04,276 రేషన్‌ కార్డులుండగా 8041 మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. మళ్లీ వీటితో పాటు కొత్తగా కార్డులు ఆశిస్తున్న వందల మంది దరఖాస్తులు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. మొత్తం 390 రేషన్‌ దుకాణాలుండగా 40,92.228 మెట్రిక్‌టన్నుల బియ్యం సబ్సీడీపై పంపిణీ చేస్తున్నారు. ఇందులో నుంచి అంత్యోదయ కార్డులు 1248 ఉన్నాయి. ఇదిలాఉండగా 2018 వరకు ఆడపాదడపా పెన్షన్‌లు, రేషన్‌కార్డులు మం జూరు చేసినప్పటికీ ఆ తరువాత ఎవరు కూడా వీటి ఊసెత్తడం లేదు.


ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో అటు అధికారపార్టీ నాయకులు ఇటు ప్రతిపక్ష నాయకులు తాము రేషన్‌కార్డులు, పెన్షన్‌లు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ప్రభుత్వం ద్వారా విధాన పరమైన నిర్ణయం వెలువడకపోవడంతో వీటి మంజూరు వ్యవహారం అటకెక్కింది. అయితే స్థానికంగా మాత్రం ప్రజా ప్రతినిధులు, నాయకులు అర్హులైన పేదల నుంచి పెన్షన్‌ల కోసం రేషన్‌కార్డుల కోసం అర్హులైన వారికి సమాధానం ఇవ్వలేక ఇప్పటికీ సతమతమవుతున్నారు. మంత్రుల స్థాయిలో సైతం పెన్షన్‌లు, రేషన్‌కార్డుల విషయంలో మంజూరుకు ఎలాంటి అధికారం లేని కారణంగా అర్హులైన పేదలంతా తీవ్రనిరాశకు గురవుతున్నారు.


ఇటీవల సీఎం కేసీఆర్‌ కొత్తగా పెన్షన్‌లు, రేషన్‌కార్డులను మంజూరు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజు నుంచే అర్హులైన వారంతా వీటి కోసం దరఖాస్తులు చేసుకునేందుకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దరఖాస్తు ఫారాల కోసం జిరాక్స్‌ సెంటర్‌ల వద్ద క్యూలు కడుతుండగా అర్హతలకు సంబంధించి సవరణల కోసం ఆధార్‌కార్డు సెంటర్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇటు మున్సిపల్‌ అధికారులు గాని అటు రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు గాని తమకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు అందలేదంటూనే ఆ దరఖాస్తులను తీసుకుంటున్నారు.


అయితే ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో మాత్రం నమోదు చేయకుండా వేచి చూసే ధోరణి పాటిస్తున్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలతో పాటు 19 మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రేషన్‌, పెన్షన్‌ల కోసం వచ్చే దరఖాస్తు దారులతో అక్కడి సిబ్బందికి టెన్షన్‌ పట్టుకుంటోందంటున్నారు. 



అధికారికంగా ప్రకటన వెలువడక ముందే


రేషన్‌కార్డుల కోసం, ఆసరాపెన్షన్‌ల మంజూరు కోసం ఇప్పటి వరకు నిర్దేశిత గడువులోగా అర్హులైన వారందరు దరఖాస్తులు చేసుకోవాలంటూ స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. అయితే కేవలం ముఖ్యమంత్రి ప్రకటనను ఆసరా గా చేసుకున్న అర్హులైన పేదలంతా ఇక నమూనా దరఖాస్తులను పూరించి వాటిని మున్సిపల్‌, రెవెన్యూ కార్యాలయాల్లో అందించేందుకు తంటాలు పడుతున్నారు. ఒకే సారి పెద్దసంఖ్యలో జనం వస్తుండడంతో సిబ్బంది దరఖాస్తులను స్వీకరించేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు.


దరఖాస్తులు స్వీకరించనట్లయితే అర్హులైన వారి నుంచి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న అభిప్రాయంతో సిబ్బంది వాటిని స్వీకరిస్తున్నారు. అన్‌లైన్‌లో మాత్రం నమోదు చేయడం లేదంటున్నారు. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా స్పష్టతనివ్వకుండా జారుకుంటున్నారు. అయితే తమకు స్పష్టమైన గైడ్‌లైన్స్‌ గాని గడువు తేదీకి సంబందించిన ఆదేశాలు గాని అందలేదని అయినప్పటికి దరఖాస్తులు స్వీకరించి భద్రపరుస్తామంటూ పేర్కొంటున్నారు. 


కొనసాగుతున్న గందరగోళం

అర్హులైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదయ్యే మున్సిపాలిటీ పరిధికి గాని మండల పరిధిలో గాని ఎన్ని రేషన్‌కార్డులు, ఎన్ని ఆసరాపెన్షన్‌లు మంజూరు చేస్తారోనన్న దానిపై కూడా స్పష్టత లేదు. అధికారులు ఆదరాబాదరగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారే తప్ప అవి ఎంత మందికి, ఎప్పటిలోగా మంజూరవుతాయో చెప్పలేకపోతున్నారు. దీనిపై దరఖాస్తుదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సతమతమవుతున్నారు.


అయితే వయస్సు, అడ్రస్‌ తదితర వివరాలను ఆధార్‌కార్డులో సవరించుకునేందు కోసం చాలా మంది కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆధార్‌కేంద్రాల్లో సర్వర్‌లు నిలిచిపోవడం, నెట్‌వర్క్‌పని చేయకపోవడం లాంటి సమస్యల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇలా కొత్తగా రేషన్‌కార్డుల కోసం, ఆసరాపెన్షన్‌ల కోసం దరఖాస్తులు చేసుకునే వారంతా ఇటు ఆధార్‌కేంద్రాలు, జిరాక్స్‌ సెంటర్‌లు అటు మున్సిపల్‌, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారంటున్నారు. 


దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే 

ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్‌ను సంప్రదించగా కొత్త రేషన్‌కార్డుల కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. రేషన్‌కార్డు దరఖాస్తులను విచారణ జరిపి జాబితాను సిద్ధంగా ఉంచాలని ఆయా మండలాల తహసీల్దార్‌లకు ఆదేశించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడగానే కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి కార్డులు అందజేస్తామని ఆయన వివరించారు. 

కిరణ్‌కుమార్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, నిర్మల్‌ 

Updated Date - 2021-02-25T06:13:24+05:30 IST