రేషన్‌ గ్యాస్‌!

ABN , First Publish Date - 2022-07-22T05:39:08+05:30 IST

ఇప్పటికే నామమాత్రంగా వస్తున్న వంటగ్యాసు సబ్సిడీ ఇకపై సామాన్యులకు దూరమవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

రేషన్‌ గ్యాస్‌!

రేషన్‌ డిపోల ద్వారా మినీ సిలిండర్లు

డీలర్ల ద్వారా 5, 3 కిలోల సిలిండర్ల అమ్మకం

వ్యాపారులతోపాటు ప్రజలకూ పంపిణీ

సబ్సిడీ ఎత్తివేత దిశగా అడుగులు

డొమెస్టిక్‌ నుంచి కమర్షియల్‌ వైపు మళ్లించే యత్నం


గుంటూరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే నామమాత్రంగా వస్తున్న వంటగ్యాసు సబ్సిడీ ఇకపై సామాన్యులకు దూరమవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గ్యాసు సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే చర్యల్లో భాగంగా వినియోగదారులను డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి కమర్షియల్‌ సిలిండర్ల వైపు మళ్లించే చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. అందులో భాగంగా గృహ వినియోగదారుల సిలిండర్ల స్థానే 5, 3 కిలోల కమర్షియల్‌ సిలిండర్లను రేషన్‌ షాపుల ద్వారా విక్రయించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమయింది. దీనికి సంబంధించి మూడు జిల్లాల రేషన్‌ డీలర్లతో ఆయిల్‌ కంపెనీలను అనుసంధానించే ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానుంది. 


ఒక్కో డీలర్‌ పరిధిలో 20 చిన్న సిలిండర్లు

కొత్తగా అమలులోకి రానున్న రేషన్‌ గ్యాస్‌ విధానం ద్వారా చిన్న గ్యాస్‌ సిలిండర్లు రేషన్‌ షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం ఒక్కో డీలర్‌కు 20 చొప్పున ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్లను కేటాయిస్తారు. ఇవన్నీ పూర్తిగా కమర్షియల్‌ సిలిండర్లే. ఈ సిలిండర్లను విక్రయించినందుకుగానూ రేషన్‌ డీలర్లకు మార్జిన్‌ కమీషన్‌ ఇస్తారు.


 ప్రభుత్వాధికారులు ఏం చెబుతున్నారు?

వంట గ్యాసు దుర్వినియోగాన్ని, అక్రమాలను నివారించడానికే రేషన్‌ డిపోల ద్వారా మినీ గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘జిల్లాలోని స్వర్ణకారులు, వీధి వ్యాపారులు, గ్యాస్‌ కనెక్షన్‌ లేని పేద, బలహీన వర్గాల ప్రజలు మార్కెట్‌లో ప్రైవేటుగా లభించే 5,3 కిలోల సిలిండర్లపై ఆధారపడుతున్నారు. ప్రైవేటు వ్యాపారుల దగ్గరే సిలిండర్‌కు అనుసంధానమై ఉన్న పొయ్యిలను కొంటున్నారు. వారి దగ్గరే మినీ సిలిండర్లను నింపుకుంటున్నారు. దీనిని నివారించడం కోసం ఈ మినీ సిలిండర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు’ అధికారులు చెబుతున్నారు. కాగా దీని వెనుక ఉన్న అసలు కారణాలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. 


 గ్యాస్‌ ఏజెన్సీలు సరిపోవా?

 గృహ వినియోగదారులు గానీ, వ్యాపార అవసరాల కోసం గ్యాస్‌ వినియోగించుకునేవారుగానీ ఇప్పటి వరకూ గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా బుకింగ్‌ చేసుకుంటారు. అక్కడ నుంచి వినియోగదారులకు గ్యాస్‌ పంపిణీ జరుగుతుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్‌ ఏజెన్సీలే డోర్‌ డెలివరీ చేస్తాయి. గ్రామాల్లో పంపిణీ కోసం మండల స్థాయిలో  ఒక డెలివరీ పాయింట్‌ పెట్టుకుని రెండు, మూడు రోజులకు ఒకసారి డెలివరీ చేస్తుంటాయి. మినీ సిలిండర్లను కూడా ఏజెన్సీల ద్వారా పంపిణీ చేసే వీలున్నప్పటికీ  రేషన్‌ డీలర్ల అంశాన్ని ఎందుకు తెరమీదకు తేవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాత ఏజెన్సీల ద్వారా పెరిగే అమ్మకాల కంటే, కమీషన్‌ కోసం పనిచేసే రేషన్‌ డీలర్ల ద్వారా విక్రయాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని వెనకు భారీ కుట్ర దాగుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


 డొమెస్టిక్‌ నుంచి కమర్షియల్‌ దిశగా అడుగులు? 

సబ్సిడీ గ్యాసు వినియోగాన్ని తగ్గించి కమర్షియల్‌ సిలిండర్ల విక్రయాలను ప్రోత్సహించడానికే కేంద్రం ప్రయత్నిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రేషన్‌ షాపుల ద్వారా చిన్న సిలిండర్ల అమ్మకాలను భారీగా పెంచడంతోపాటు, వినియోగదారులను కమర్షియల్‌ గ్యాసు సిలిండర్ల వైపు మళ్లించడం సులువని భావించిన ప్రభుత్వం రేషన్‌ డీలర్లను ప్రోత్సహిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 14 కిలోల సిలిండరు ధర రూ. 1050కి చేరింది. ఽగడిచిన రెండు నెలల్లో మూడుసార్లుగా ధర రూ. 150 వరకూ పెరిదింది. ఈ ధర పెరగడమే తప్ప తగ్గే సూచనలే కనిపించడం లేదు. ఇంతలా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి వేలకు వేలు పెట్టి గ్యాసు కొనడం భారంగా మారుతుంది కాబట్టి వినియోగదారులు చిన్న సిలిండర్లవైపు మళ్లుతారని ప్రభుత్వం ఆశ!


 సబ్సిడీ రద్దుకే వాణిజ్య చిన్న సిలిండర్ల ఎర

రకరకాల పద్ధతుల్లో గ్యాసు సబ్సిడీని తొలగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ నామమాత్రపు సబ్సిడీని కూడా ఎత్తేయాలన్న యోచనకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో రూ. 350 రూపాయల వరకూ వచ్చే సబ్సిడీని ఇప్పుడు రూ.15కి తగ్గించింది. అయినప్పటికీ సిలిండర్‌ ధర రూ. 1050గా ఉంది. దీనికంటే రెండు కిలోల ఎక్కువ గ్యాసు ఉండే కమర్షియల్‌ సిలిండరు ధర మార్కెట్‌లో రూ. 2 వేలు ఉంది. ఇప్పుడు ఇదే ధరకు గ్యాసును విక్రయించాలని భావిస్తున్న ప్రభుత్వం డొమెస్టిక్‌ వినియోగదారులకు చిన్న సిలిండర్ల ఎర వేస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మెల్లగా చిన్న సిలిండర్లను అలవాటు చేసి డొమెస్టిక్‌ సిలిండర్లకు వినియోగదారులను దూరం చేసే కుట్ర దీని వెనక దాగుందని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఈ విధానం కారణంగా సగటు వినియోగదారుడిపై నెలకు రూ. 1000 నుంచి 1500 వందల వరకూ భారం పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


 త్వరలో డీలర్లతో సమావేశం: ఎస్‌. పద్మశ్రీ, డీఎస్‌ఓ, గుంటూరు

త్వరలో రేషన్‌ డీలర్లతో సమావేశం నిర్వహించి ఈ స్కీమును అమలులోకి తీసుకువస్తాం. ఇక నుంచి జిల్లాలోని అన్ని రేషన్‌ షాపుల్లో మినీ గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. రేషన్‌ డీలర్లకు విక్రయ కమీషన్‌ రూపంలో ప్రోత్సాహకం ఉంటుంది. 


Updated Date - 2022-07-22T05:39:08+05:30 IST