మేరా రేషన్‌ రెడీ!

ABN , First Publish Date - 2022-05-08T06:21:16+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీలతో నిత్యావసరాలను అందుకునే కార్డుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘మేరా రేషన్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మేరా రేషన్‌ రెడీ!

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు మొబైల్‌ యాప్‌ సిద్ధం

 తొమ్మిది రకాల సేవలు

దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకొనే వెసులుబాటు

తెలుగు భాషలోనూ అందుబాటులో యాప్‌ 

విజయవాడ ; ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీలతో నిత్యావసరాలను అందుకునే కార్డుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘మేరా రేషన్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా మొత్తం 9 రకాల సేవలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మొబైల్‌ యాప్‌ నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుదారులకు ఎక్కువగా దోహదపడుతుంది. అంటే కేంద్రం సరఫరా చేసే నిత్యావసరాలను  అందుకునే కార్డుదారులు అన్నమాట. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల వ్యాప్తంగా 12 లక్షల మంది కార్డుదారులు ఉండగా... 8 లక్షలకుపైగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులు ఉన్నారు. దీనిని బట్టి 80 శాతం మందిపైగా కార్డుదారులు ‘మేరా రేషన్‌’ యాప్‌ సేవలను పొందవచ్చు.                         

ఈ ‘మేరా రేషన్‌’ యాప్‌ విషయానికొస్తే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా కార్డుదారులకు ప్రస్తుతం తొమ్మిది రకాలైన సేవలను అందుతాయి. ఈ తొమ్మిదింటిలో లాగిన్‌ కూడా ఉంది. 

  లాగిన్‌ ద్వారా మీ రాష్ట్రం, యూజర్‌ నేమ్‌, పాస్‌ వర్డ్‌ సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్‌ ద్వారానే తర్వాత సేవలను మీరు పొందటానికి ఉపయోగం ఉంటుంది. 

  మిగిలిన ఎనిమిది సేవలలో మొదటిది రిజిస్ర్టేషన్‌. మీ కార్డు నెంబర్‌ ను అందులో రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆధార్‌ నెంబర్‌ను ఇచ్చినా సరే రిజిస్ర్టేషన్‌ జరుగుతుంది. 

  మూడవ ఆప్షన్‌గా నో యువర్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌ ఉంటుంది. ఇందులో కార్డుదారుని హక్కుల గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. కార్డుదారుల హక్కుల గురించి తెలుసుకోవటానికి ఈ ఆప్షన్‌ దోహదపడుతుంది. 

   నాల్గవది నియర్‌బై రేషన్‌ షాప్స్‌. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులు వన్‌ నేషన్‌ .. వన్‌ రేషన్‌ స్కీమ్‌లో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లా, మండల, గ్రామం, ఏ డిపోలో అయినా నిత్యావసరాలు తీసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో నియర్‌బై రేషన్‌ షాప్స్‌ సదుపాయం ఉపయోగపడుతుంది. మీరు ఉంటున్న ప్రాంతంలో ఎక్కడెక్కడ రేషన్‌ దుకాణాలు ఉన్నాయో ఇది తెలియచేస్తోంది. డీలర్‌ పేరు తెలుపుతుంది. చిరునామా తెలుసుకోవటానికి అందులో ఉన్న ట్రాకింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే నేరుగా ఆ షాప్‌కు వెళ్ళటానికి మ్యాప్‌ రూట్‌ చూపిస్తుంది. 

  ఐదవది ఓఎన్‌ఓఆర్‌సీ. దేశంలో వివిధ రాష్ర్టాల్లో రేషన్‌ పంపిణీ లావాదేవీల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 

  ఆరవది మై ట్రాన్సాక్షన్స్‌. మీరు ఎప్పుడు ఎక్కడ ఏయే నిత్యావసరాలు తీసుకున్నారో ఇందులో చూపిస్తుంది. 

 ఏడవది ఎలిజిబిలిటీ క్రిటీరియా. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డు పొందటానికి అర్హత లు ఏమిటో ఈ ఆప్షన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

  ఎనిమిదవది ఆధార్‌ సీడింగ్‌. మీ రేషన్‌ కార్డుకు ఆధార్‌ సీడింగ్‌ను ఈ ఆప్షన్‌ ద్వారా చాలా తే లిగ్గా చేసుకోవచ్చు. 

 తొమ్మిదవ ది ఫీడ్‌బ్యాక్‌ ఆప్షన్‌. దీని ద్వారా మీ కార్డు నెంబర్‌ ఎంటర్‌ చేసి, మొబైల్‌ నెంబర్‌ ఇచ్చి ప్రజా పంపిణీకి సంబంధించి మీ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలపవచ్చు. ఎఫ్‌పీ షాపులకు సంబంధించి కూడా ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వవచ్చు. ఈ యాప్‌ను దేశంలోని అన్ని భాషల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. తెలుగులో కూడా ఈ యాప్‌ పని చేస్తుంది.  


Read more