డోర్‌ డెలివర్రీ!

ABN , First Publish Date - 2022-04-29T06:11:15+05:30 IST

తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్టుంది రేషన్‌ పంపిణీలో ప్రభుత్వ తీరు.

డోర్‌ డెలివర్రీ!

 రేషన్‌ పంపిణీలో డీ లర్లు వ ర్సెస్‌ ఎండీయూలు 

  పనుల విభజన అమలు క్షేత్రస్థాయిలో శూన్యం

  అధికారుల అత్యుత్సాహం, అవగాహన లేమిలో గందరగోళం 

  ఎండీయూలకు అనుగుణంగా అధికారుల చర్యలు 

  చెప్పినట్టు చేయకపోతే డీలర్‌షిప్‌ వదులుకోండని  బెదిరింపు


- ఎన్టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో డీలర్లే రేషన్‌ను ఎండీయూ ఆపరేటర్లకు లోడ్‌ చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయి. లోడ్‌ చేయకపోతే డీలర్‌షిప్‌ వదులుకోండని బెదిరింపులు వచ్చాయి. ఇదే పద్ధతిలో పెనుగంచిప్రోలు, కంచికచర్ల, నందిగామ, జి.కొండూరు, తిరువూరు, రెడ్డిగూడెంలలో తహసీల్దార్లు ఆదేశాలిచ్చారు.

- రేషన్‌ డీలర్లు ఎండీయూలకు బియ్యం బస్తాలు లోడ్‌ చేస్తే చేయండి లేకపోతే రాజీనామాలు చేసి తప్పుకోండి అని కృష్ణా జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం, పామర్రులలో..  తహసీల్దార్లు హుకుం జారీ చేశారు. ఏం చేయాలో అర్థంకాక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. 

తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్టుంది రేషన్‌ పంపిణీలో ప్రభుత్వ తీరు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి, అధికారుల అత్యుత్సాహం, అవగాహన లేమి కారణంగా రేషన్‌ డోర్‌ డెలివరీలో డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రేషన్‌ పంపిణీలో ఎవరి పని ఎంతవరకు? ఎవరి పాత్ర ఏమిటి? అనే మార్గదర్శకాల అమలు గాడి తప్పడంతో  ప్రతినెలా డోర్‌ డెలివరీలో డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల మధ్య తీవ్ర వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ సమస్యపై ఇటు ఎన్టీఆర్‌, అటు కృష్ణా జిల్లాల కలెక్టర్లు ఇద్దరూ దృష్టి సారించాల్సి ఉంది.  

 - విజయవాడ

నిత్యావసరాలను నేరుగా ఇంటికే చేర్చాలని 2019లో ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి ఆ తర్వాత అమల్లోకి తీసుకు వ చ్చింది. పైలట్‌ ప్రాజెక్టులోనే ఎండీయూల వ్యవస్థను తీసుకువచ్చి ఉంటే ఈ లోపాలన్నీ ముందుగానే సరిదిద్దుకోవటానికి అవకాశముండేది. పైలట్‌ ప్రాజెక్టు తర్వాత ఎండీయూ వ్యవస్థను తీసుకు వచ్చింది. ఎండీయూ వ్యవస్థను తీసుకువచ్చే విషయంలో డీలర్ల కంటే ఎండీయూ ఆపరేటర్లకే ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం వల్ల డీలర్లను తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. డీలర్లకు కమీషన్‌ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఎండీయూ ఆపరేటర్లకు జీతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ విధానం ఎండీయూ ఆపరేటర్లవైపే మొగ్గుగా ఉండటంతో.. సహజంగా అధికారులు కూడా ఎండీయూ ఆపరేటర్ల దిశగానే ఆలోచనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో డీలర్లు అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు. డీలర్లపై వేధింపులు, ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అధికారుల నుంచి తమకే మద్దతు ఉండటంతో ఎండీయూ ఆపరేటర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రతినెలా డోర్‌ డెలివరీ పంపిణీ ప్రారంభం అవుతుందంటే.. డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. డీలర్ల సంఘాలు ఇప్పటికే ఈ అంశంపై ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువచ్చారు. పట్టించుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామంటూ ఘాటుగా స్పందిస్తున్నాయి.

అమలు చేయాల్సిన  అసలు నిబంధనలు ఇవీ 

 కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చే సరుకులను ముందుగా రేషన్‌ డీలర్లు డీడీలు కట్టి దిగుమతి చేసుకోవాలి. వాటిని ఎండీయూ ఆపరేటర్లకు తూకం వేసి అప్పగించాలి.   తన వాహనంలోకి లోడింగ్‌ అంతా ఎండీయూ ఆపరేటరే చేసుకోవాలి.  వలంటీర్‌ వాహనంతో వెళ్లి తన క్లస్టర్‌ పరిధిలోని రేషన్‌ పంపిణీ అయ్యే వరకు ఉండి ఈ-పోస్‌ మిషన్‌ను ఆపరేట్‌ చేయాలి. పంపిణీ పూర్తికాగానే ఆదేరోజు సాయంత్రం మిగిలిన స్టాకును ఎండీయూ డీలర్‌కు వాపసు చేయాలి. డబ్బులను డీలర్‌కు తిరిగి ఇవ్వాలి. 

జరుగుతున్న ఉల్లంఘనలు ఇవీ 

 డీలర్‌ దగ్గర తూకం వేసే సందర్భంలో ఆ సరుకును ఎండీయూ ఆపరేటర్‌ కాటా పెట్టుకుని వాహనంలోకి లోడ్‌ చేసే పని జరగడం లేదు. ప్రతిరోజూ డీలర్‌కు మిగిలిన సరుకు ఇవ్వడం లేదు. రేషన్‌ షాపు పరిధిలో పంపిణీ పూర్తి అయ్యే వరకు తమ వద్దే ఉంచుకుంటున్నారు. డబ్బులు కూడా ఇవ్వటం లేదు. సరుకు షార్టు వచ్చిందని బియ్యం, పంచదార, కందిపప్పులను డీలర్లకు తరుగుతో అప్పగిస్తున్నారు. వలంటీర్లు డోర్‌ డెలివరీ వాహనాల వెంట వెళ్లకపోవటం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. 

  జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం 

 డీలర్లు,  ఎండీయూలతో మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ప్రతినెలా అధికారులు సమావేశాలు నిర్వహించాలి. ఇలాంటి  సమావేశాలను నిర్వహించడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తున్నాయి. ఇక మీదట ప్రతినెలా సమావేశాలు నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ను కోరాం

- ముత్యాల శేషు, ఎన్టీఆర్‌ జిల్లా రేషన్‌ డీలర్‌ సంఘం అధ్యక్షుడు

అధికారులు పట్టించుకోకపోతే ఏం చేయాలో అది చేస్తాం   

కాటా పెట్టి బండిలోకి లోడ్‌ చేసుకోవడానికే ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లకు నెలకు రూ.5 వేలు చెల్లిస్తోంది. అయినా చాలా చోట్ల ఎండీయూ ఆపరేటర్లు ఆ పని చేయటం లేదు. ఇప్పటికే పలుసార్లు ఈ విషయాలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం. సరైన స్పందన లేదు. మరొకసారి చెప్పి చూస్తాం. పరిష్కారం కాకపోతే ఏం చేయాలో అది చేస్తాం.       

 - మండాది వెంకట్రావు,  డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు



Updated Date - 2022-04-29T06:11:15+05:30 IST