సాయం వాటా.. ఎగవేత

ABN , First Publish Date - 2022-07-27T05:26:51+05:30 IST

రెండేళ్లుగా పేదల ఆకలి తీరుస్తున్న కరోనా సాయానికి కత్తెర పడింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల పేద ప్రజలకు అందాల్సిన ఉచిత బియ్యం పంపిణీ మూడో వంతుకు పడిపోయింది.

సాయం వాటా..  ఎగవేత

కరోనా సాయానికి రాష్ట్రం కత్తెర

తమ వాటా ఇవ్వకుండానే కేంద్రం ఇచ్చినవే పంపిణీ

ఆహార భద్రత చట్టం పరిధిలోని వారికే బియ్యం

అందేది మూడో వంతే..

ప్రశ్నార్థకంగా ఆగిన నాలుగు నెలల సాయం


కేంద్రం పంపిణీ చేసే ఉచిత బియ్యం సాయానికి రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. నాలుగు నెలలుగా పంపిణీ చేయకపోవడంతో కేంద్రం మొట్టికాయలు వేసింది. ఎట్టకేలకు దిగివచ్చి వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రం తన వాటా ఇవ్వకుండా.. కేవలం ఆహార భద్రత చట్టం పరిధిలోని వారికే బియ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ కారణంగా మూడో వంతు వారికి మాత్రమే సాయం అందనుంది. ఉమ్మడి జిల్లాలో 50 లక్షల కార్డులు ఉండగా అందులో 15లక్షల మందికే ఈ సాయాన్ని అందజేయనున్నారు. 


గుంటూరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా పేదల ఆకలి తీరుస్తున్న కరోనా సాయానికి కత్తెర పడింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల పేద ప్రజలకు అందాల్సిన ఉచిత బియ్యం పంపిణీ మూడో వంతుకు పడిపోయింది. ఇప్పటికే నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన బియ్యాన్ని ఆపడంతో ఇటీవల కేంద్రం అక్షింతలు వేసింది. దీంతో విధిలేని పరిస్థితిలో పంపిణీ చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తన వాటా పంపిణీకి కత్తెర వేసి కేంద్రం సాయాన్ని మాత్రమే పంపిణీ చేయనుంది. ఫలితంగా నూటికి 70మందికి ఉచిత బియ్యం దక్కకుండా పోతున్నాయి.


15 లక్షల మందితో సరి.. 

మూడుజిల్లాల్లో సుమారు 17 లక్షల తెల్లరేషన్‌ కార్డులు ఉండగా, వాటిద్వారా సుమారు 50 లక్షలమందికి ప్రతినెలా రేషన్‌ అందుతోంది. కరోనా కారణంగా నష్టపోయిన పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో కేంద్రం 2020లో తెల్లరేషన్‌ కార్డులు ఉన్నవారికి అందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేపట్టింది.  ఇప్పుడు రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో పథకానికి కోతలు పడ్డాయి. కేంద్రం వాటాగా వచ్చిన బియ్యాన్నే ఇప్పుడు పంపిణీ చేయనున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 15 లక్షలకు పడిపోయింది. 


 ఆహార భద్రత చట్టం పరిధిలోని వారికే సాయం

కేంద్రం రెండేళ్ల నుంచి నిరంతరాయంగా ఉచితబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీనికిగానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటా వేసుకోవాలి. రాష్ట్రం తన వాటాను ఎగవేయడం కోసం ఏప్రిల్‌ నుంచి బియ్యం పంపిణీని ఆపేసింది. దీంతో కేంద్రం సీరియస్‌ అయింది. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనబోమని హెచ్చరించడంతో తన వాటాను పక్కకు పెట్టి కేంద్రం వాటా కింద వచ్చే బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేసేందుకు పూనుకుంది. దీంతో ఆగస్టు నెల నుంచి వచ్చే ఉచిత బియ్యం ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే అందనున్నాయి. 


కార్డుకు బదులు టోకెన్లు

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీకి టోకెన్‌ విధానాన్ని ముందుకు తెచ్చింది. ఇప్పటి వరకూ తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉచిత బియ్యం పొందడానికి అర్హులు కాగా, ఇక నుంచి ఆహార భద్రత చట్టంలోని వారికి మాత్రమే బియ్యం రానున్నాయి. వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది ప్రత్యేకంగా టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లు తీసుకుని రేషన్‌ డీలర్ల వద్దకు వెళ్లి ఉచిత బియ్యం తెచ్చుకోవాల్సి ఉంటుంది. రోజు మధ్యాహ్నం మూడు నుంచి 8 గంటల వరకూ ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. 


నాలుగు నెలల బియ్యం మాటేంటి?

కాగా రాష్ట్రప్రభుత్వం ఇప్పటికి నాలుగు నెలల నుంచి ఉచిత బియ్యం పంపిణీని ఆపేసింది. ప్రభుత్వ నిర్వాకం కారణంగా నాలుగు నెలల్లో వీరు లక్ష టన్నుల బియ్యం కొనాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ బియ్యం వస్తాయా లేదా అనే విషయంపై అధికారులు కూడా ఎటూ తేల్చి చెప్పడం లేదు.  


రోజూ సాయంత్రం ఉచిత బియ్యం పంపిణీ

ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ఉంటుంది. ఉదయం పూట ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి రేషన్‌ షాపుల వద్ద ఉచిత బియ్యం పంపిణీ చేస్తాం. లబ్ధిదారులు వలంటీర్ల వద్ద టోకెన్లు తీసుకుని వెళ్లి రేషన్‌ డీలర్ల వద్ద బియ్యం తెచ్చుకోవాలి. 

- ఎస్‌.పద్మశ్రీ, డీఎస్‌ఓ, గుంటూరు

Updated Date - 2022-07-27T05:26:51+05:30 IST