కరోనా వేళ రేషన్‌ పరేషాన్‌

ABN , First Publish Date - 2021-05-06T03:46:36+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ లబ్ధిదారు లకు రేషన్‌ బియ్యం తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది

కరోనా వేళ రేషన్‌ పరేషాన్‌
బియ్యం పంపిణీకి ఐరిస్‌ చూస్తున్న డీలర్‌

- జిల్లాలో ఉధృతంగా మహమ్మారి
- ఆధార్‌ లింక్‌ లేక లబ్ధిదారుల ఇక్కట్లు
- ఐరిస్‌ ద్వారా బియ్యం పంపిణీకి అధికారుల ఏర్పాట్లు
- కేసులు పెరుగుతాయని ప్రజల్లో ఆందోళన

నస్పూర్‌, మే 5: జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ లబ్ధిదారు లకు రేషన్‌ బియ్యం తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా రేషన్‌ కార్డులకు ఆధార్‌ అనుసంధానం చాలా వరకు లేక పోవ డమే సమస్యగా మారింది. ఆధార్‌ అనుసంధానం లేక పోవడంతో ఓటీపీ సెల్‌ఫోన్‌కు వచ్చే పరిస్థితి  ఉండదు. ఆధార్‌ అనుసంధానం కాని విని యోగదారులకు ప్రస్తుతం ఐరిస్‌ ద్వారా బియ్యం పంపిణీ చేయాలని అధి కారులు నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఐరిస్‌ ద్వారా కేసులు పెరుగుతాయన్న భయాందోళన నెలకొంది.


జిల్లాలో 423 షాపులు..
మంచిర్యాల జిల్లాలో 423 రేషన్‌ షాపులు ఉన్నాయి. 2,14,238 తెల్ల కార్డులు కలిగిన వినియోగదారులకు 15,11,493 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. రేషన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం అయి ఉన్నట్లయితే వినియోగదారుడి సెల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా రేషన్‌ షాపు వద్ద నుంచి సరకులను తీసుకునే అవకాశం ఉంటుంది. రేషన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం లేక పోవడం వల్ల వినియోగ దారులు కనుపాపల స్కానింగ్‌ ఐరిస్‌ పద్ధతి ద్వారా రేషన్‌ షాపు నుంచి బియ్యం పొందే అవకాశం ఉంది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కొంత వరకు రేషన్‌ కార్డులకు ఆధార్‌ లింక్‌ చేయించు కున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు వివిధ కారణాలతో లింక్‌ చేయించలేకపోయారు.  దీంతో ఆధార్‌ లింక్‌లేని కార్డులకు బియ్యం పంపిణీ ఐరిస్‌ ద్వారా చేయా లని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువ ఉన్నందున చాలా మంది వినియోగదారులు, డీలర్లు ఐరిస్‌ స్కానింగ్‌ ఇబ్బందిగా మారనుందని భయపడుతున్నారు. జిల్లాలో బియ్యం పంపిణీ కార్యక్రమం భయంభయంగా  కొనసాగుతోంది. ఐరిస్‌తో బియ్యం తీసుకో వడానికి లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ పెరుగు తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యామ్నయ మార్గాల ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..
- వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బియ్యం పంపిణీ కార్యక్ర మానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని రేషన్‌ షాపుల వద్ద భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్కరూ కరో నా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాం. ఐరిస్‌ మిషన్‌ను శానిటైజ్‌  చేయాలని చెప్పాం. ఆధార్‌ అనుసంధానం లేని లబ్ధిదారులకు మాత్రమే ఐరిస్‌ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నాం.

Updated Date - 2021-05-06T03:46:36+05:30 IST