రేషన కందిపప్పు.. కల్తీ

ABN , First Publish Date - 2021-10-17T06:04:58+05:30 IST

రేషన బియ్యాన్ని కొనుగోలు చేసి కల్తీ చేసి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్మడం చూశాం.

రేషన కందిపప్పు.. కల్తీ
కందిపప్పు ప్యాకెట్‌లను తనిఖీ చేస్తున్న ఆహార నియంత్రణాధికారులు

2 వేల బస్తాల సీజ్‌, మిల్లుపై కేసు

200 బస్తాల కుంకుడు కాయల గుర్తింపు

కుంకుడు విత్తనాలతో పప్పు తయారవుతున్నట్లు అనుమానాలు

గుంటూరు(తూర్పు), అక్టోబరు 16: రేషన బియ్యాన్ని కొనుగోలు చేసి కల్తీ చేసి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్మడం చూశాం. కాని రేషన కార్డుదారులకు సరఫరా చేసే కందిపప్పును కల్తీ చేస్తున్నట్లు గుంటూరులో ఆహార నియంత్రణాధికారుల తనిఖీలో తాజాగా వెలుగుచూసింది. అక్రమంగా కందిపప్పు నిలువ ఉంచారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేయడానికి వెళ్లగా అక్కడ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. గుంటూరు సమీపంలోని  ఏటుకూరు బైపాస్‌ భారత పెట్రోల్‌ బంకు పక్కనున్న శ్రీశ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజస్‌ అనే మిల్లుపై ఆహార నియంత్రణాధికారులు శనివారం దాడులు చేశారు. ప్రజా పంపీణీ వ్యవస్థ పేరుతో ఉన్న కవర్లలో కల్తీ చేసిన కందిపప్పును ప్యాకింగ్‌ చేయడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు కల్తీ సమాచారాన్ని పౌరసరఫరాలశాఖ అధికారులకు అందించారు. రేషన సరుకుల ప్యాకింగ్‌కు అనుమతులు లేకుండానే కందిపప్పును ప్యాకింగ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ప్యాకింగ్‌పై సరైన సమాధానం రాకపోవడంతో  మిల్లుపై కేసులు నమోదు చేశారు. ఇదే మిల్లులో దాదాపు 200 బస్తాల కుంకుడు కాయలను అధికారులు గుర్తించారు. ఆహార వస్తువులు ఉన్నచోట ఆహారేతర పదార్థాలు నిల్వ ఉంచడం చట్టారీత్యానేరం. కానీ ఇక్కడి మిల్లులో కుంకుడుకాయల నిల్వలపై మిల్లు యజమానులు పొంతన లేని సమాధానాలు చెప్పారు. కుంకుడుకాయల నుంచి విత్తనాలను వేరు చేసి వాటిని ప్రాసెసింగ్‌ చేసి కందిపప్పులో కలిపి ప్యాకింగ్‌ చేసి రేషన దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. సాధారణ కందిపప్పు కంటే వీటి పరిమాణం కొంచెం లావుగా ఉండటంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరిస్తున్నాయి. అనుమతులు లేకుండానే దాదాపు రెండువేల బస్తాల కందిపప్పు ఇక్కడ ఎలా నిల్వ ఉంచారో అర్థం కావడంలేదు.  

కేసులు నమోదు చేశాం

కందిపప్పు నిల్వ ఉంచారనే సమాచారంతో దాడులు చేసినట్లు జిల్లా ఆహారనియంత్రణాధికారి గౌస్‌ మొహిద్దీన తెలిపారు. కుంకుడుకాయల బస్తాలను సీజ్‌ చేశామన్నారు. కందిపప్పులో కుంకుడు కాయల విత్తనాలను కలుపుతున్నారనే అనుమానంతో కందిపప్పు శాంపిల్స్‌ను సేకరించి నమూనాలను పరీక్షలకు పంపినట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-17T06:04:58+05:30 IST