‘ఆత్మ’లకు రేషన్‌

ABN , First Publish Date - 2022-01-24T03:54:06+05:30 IST

పేదల ఆకలి తీర్చడం కోసం రేషన్‌ దుకాణాల ద్వారా ప్రభుత్వం ప్రతీ నెల బియ్యం సరఫరా చేస్తుంది. రెండేండ్లుగా జిల్లాలో పలువురు రేషన్‌ లబ్ధిదారులు వివిధ కారణాలతో మృతి చెందారు. అయినప్పటికీ మృతుల పేరిట క్రమం తప్పకుండా రేషన్‌ బియ్యం సరఫరా అవుతోంది. రెండేండ్లు గడిచినా రేషన్‌కార్డుల్లో నుంచి మృతుల పేర్లను అధికారులు తొలగించడం లేదు.

‘ఆత్మ’లకు రేషన్‌

మృతిచెందిన వారి పేర్లను తొలగించని అధికారులు 

వారి పేరుమీద రేషన్‌ బియ్యం పంపిణీ 

వివాహమైన ఆడపిల్లల పేర్లు అలాగే..

రేషన్‌ కోటాలో చోటు చేసుకుంటున్న అక్రమాలు 

బెల్లంపల్లి, జనవరి 23: పేదల ఆకలి తీర్చడం కోసం రేషన్‌ దుకాణాల ద్వారా ప్రభుత్వం ప్రతీ నెల బియ్యం సరఫరా చేస్తుంది. రెండేండ్లుగా జిల్లాలో పలువురు రేషన్‌ లబ్ధిదారులు వివిధ కారణాలతో మృతి చెందారు. అయినప్పటికీ మృతుల పేరిట క్రమం తప్పకుండా రేషన్‌ బియ్యం సరఫరా అవుతోంది. రెండేండ్లు గడిచినా రేషన్‌కార్డుల్లో నుంచి మృతుల పేర్లను అధికారులు తొలగించడం లేదు. మృతుల కోటా బియ్యాన్ని కొందరు రేషన్‌ డీలర్లు కాజేస్తున్నారు. మరికొన్ని చోట్ల మృతుల కుటుంబీకులే రేషన్‌ బియ్యం తీసుకుంటున్నారు. దీంతో  ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది. 

మృతి చెందిన వారి పేర్ల మీద రేషన్‌ బియ్యం పంపిణీ 

జిల్లా వ్యాప్తంగా 423 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ఇందులో 2,50,068 ఆహార భద్రత కార్డులు, 15,502 అంత్యోదయ కార్డులు, 169 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. రెండేండ్లుగా జిల్లా వ్యాప్తంగా రేషన్‌ కార్డుల్లో మృతిచెందిన వారి పేర్లను   తొలగించడం లేదు. కొవిడ్‌తో పాటు వివిధ కారణాలతో వేలాది మంది చనిపోయారు. అయినప్పటికీ వారి పేరు మీద  ప్రతీ నెల కోటా విడుదలవుతుంది. కొందరు రేషన్‌ డీలర్లు చనిపోయిన వారికి కాకుండా మిగితా కుటుంబీకులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరికొందరు డీలర్లు  లబ్ధిదారులతో కుమ్మక్కై ఒక నెల బియ్యం లబ్ధిదారులకు, ఒక నెల డీలర్‌కు అని ఒప్పందాలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వివాహం చేసుకుని వెళ్లిపోయిన మహిళల పేర్ల పై వచ్చే బియ్యాన్ని రేషన్‌ డీలర్లు, లబ్ధిదారులు వదలడం లేదు. వాస్తవానికి వారి పేర్లను తొలగించి అత్తగారి ఇంటి కార్డులో చేర్చాలి. జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండేండ్లలో దాదాపు వెయ్యి మందికి పైగా రేషన్‌ లబ్ధిదారులు మృతిచెందినట్లు తెలుస్తోంది. బోగస్‌ కార్డులు, మృతుల పేర్ల తొలగింపునకు గతంలో అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించే వారు. మృతుల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించేవారు. మొదట పంచాయతీ అధికారులు ధ్రువీకరించి సరి చూసిన అనంతరం తహసీల్దార్‌ ఆమోదించడంతో వారి పేర్లను రేషన్‌ కార్డుల నుంచి తొలగించేవారు. రెండేండ్లుగా జిల్లాలో ఈ ప్రక్రియ చేపట్టడం లేదు. దీంతో బియ్యం సరఫరా కావడంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది. 

అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం

డీఎస్‌వో ప్రేమ్‌కుమార్‌ 

రేషన్‌ బియ్యం పంపిణీలో, మృతుల పేరిట డీలర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడినా , బియ్యం, కాజేసినా చర్యలు తీసుకుంటాం. మృతిచెందిన రేషన్‌ లబ్ధిదారుల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం. ఎవరైనా మృతులకు సంబంధించి బియ్యం తీసుకుంటే ఫిర్యాదు చేయాలి. రేషన్‌ డీలర్లు సైతం మృతిచెందిన వారి సమాచారం  అందించాలి. కుటుంబంలో ఎవరైనా మృతిచెందితే  రేషన్‌ కార్డులో పేరును తొలగించేందుకు డెత్‌ సర్టిఫికెట్‌ను అందించాలి.  రేషన్‌ బియ్యం పంపిణీలో , ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-01-24T03:54:06+05:30 IST