‘రేషన్‌ ఉద్యోగుల’ సమ్మె

ABN , First Publish Date - 2022-06-08T14:02:22+05:30 IST

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ... రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌షాపు ఉద్యోగులు మంగళవారం నిరవధిక

‘రేషన్‌ ఉద్యోగుల’ సమ్మె

- సమ్మెలో పాల్గొంటే జీతం కట్‌

- ప్రభుత్వం హెచ్చరిక


చెన్నై, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ... రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌షాపు ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలు మినహా తక్కిన అన్ని జిల్లాల్లో రేషన్‌షాపులు మూతపడటంతో  వినియోగదారులు నిరాశ చెందారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగానే తమకు కూడా పెండింగ్‌లో ఉన్న 31 శాతం కరవు భత్యాన్ని చెల్లించాలని, పని వేళలు తగ్గించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఫించన్లను సకాలంలో చెల్లించాలని కోరుతూ రేషన్‌షాపు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమ్మెను ఉపసంహరింపజేయడానికి ప్రజాపంపిణీ విభాగం అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మంగళవారం ఉదయం రేషన్‌షాపు ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో సమ్మెలో పాల్గొనే రేషన్‌ షాపు ఉద్యోగులకు జీతాల్లో కోత విధించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజా పంపిణీ విభాగంలో రేషన్‌షాపులు అత్యవసర సేవావిభాగాల కిందకు వస్తాయని, కనుక ఆ షాపుల్లో పనిచేసే ఉద్యోగులు దుకాణాలను మూసివేసి సమ్మెకు దిగటం భావ్యం కాదని పేర్కొంది. రాష్ట్రంలో 33 వేల రేషన్‌ దుకాణాలుండగా వాటిలో అముదం, స్వయం సహాయక సంస్థల ద్వారా నడపుతున్న రేషన్‌ షాపుల ఉద్యోగులు మాత్రం సమ్మెలో పాల్గొనలేదు. మిగిలిన 25వేలకు పైగా రేషన్‌షాపులు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా రేషన్‌షాపు ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో సహకార సంఘాల రిజిస్ట్రార్‌ షణ్ముగసుందరం అన్ని జోన్లలోని రిజిస్ట్రార్‌లకు ఓ ఉత్తర్వు జారీ చేశారు. ఉద్యోగుల సమ్మెకారణంగా కార్డుదారులకు సక్రమంగా సరకులు పంపిణీ అయ్యేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. తాత్కాలిక ప్రాతిపదికను కొందరిని పనిలోకి తీసుకుని సరకులను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక సమ్మెలో పాల్గొన్న రేషన్‌ షాపు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని కూడా ఆదేశించారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను విధులకు గైర్హాజరైనట్లు నమోదు చేసి వారి వేతనంలో మూడు రోజుల వేతనాన్ని నిలిపివేయాలని పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొంటున్న రేషన్‌షాపు ఉద్యోగుల వివరాలను ప్రతిరోజూ తమ కార్యాలయానికి సూచించారు.

Updated Date - 2022-06-08T14:02:22+05:30 IST