రేషన్‌ పంపిణీ ఆపరేటర్ల సమ్మె సైరన్‌

ABN , First Publish Date - 2022-05-15T08:30:47+05:30 IST

లబ్ధిదారులకు పంపిణీ చేసే రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల ఆపరేటర్లు సమ్మె బాట పడుతున్నారు. రాయితీ నగదు వసూలు చేయడం, ప్రభుత్వమే కడతామన్న బీమా ప్రీమియం..

రేషన్‌ పంపిణీ ఆపరేటర్ల సమ్మె సైరన్‌

1 నుంచి పంపిణీ నిలిపివేతకు నిర్ణయం


అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులకు పంపిణీ చేసే రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల ఆపరేటర్లు సమ్మె బాట పడుతున్నారు. రాయితీ నగదు వసూలు చేయడం, ప్రభుత్వమే కడతామన్న బీమా ప్రీమియం భారాన్ని తమపై మోపడం, కరోనా సమయంలో చనిపోయిన ఆపరేటర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడం వంటి సమస్యలపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎండీయూ ఆపరేటర్ల యూనియన్‌ తరఫున అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, తహసీల్దార్లకు సమ్మె నోటీసులు అందజేస్తున్నారు. ఈ నెల 25లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి జూన్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో సమ్మెకు దిగాలని నిర్ణయించారు. రేషన్‌ పంపిణీలో డోర్‌ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9,260 వాహనాలను రాయితీపై లబ్ధిదారులకు అప్పగించింది. తొలుత అందరి నుంచి 10% నగదు రూ.63 వేలు కట్టించుకుని వాహనాలు ఇచ్చింది.


మిగిలిన 90% నగదును రాయితీగా ప్రకటిస్తూ జీవోలు జారీచేసింది. ఆ మొత్తం నగదును ఆయా కార్పొరేషన్లు చెల్లిస్తాయని స్పష్టం చేసింది. దీని ప్రకారం వాహనాల ఆపరేటర్ల నుంచి ఎలాంటి నగదు వసూలు చేయకూడదు. కానీ, ప్రతినెలా వారికిచ్చే వేతనంలో రూ.3 వేలు ఈఎంఐ కింద మినహాయించుకుంటున్నారు. ప్రభుత్వం 90% రాయితీ ఇస్తాననప్పుడు, 10% తాము ముందుగానే చెల్లించినప్పుడు  వేతనంలో కోత ఎందుకు పెడుతున్నారనేది వాహనదారుల ప్రశ్న. దీనిపై అధికారులను అడిగినా సమాధానం చెప్పడం లేదని ఆపరేటర్లు అంటున్నారు. మరోవైపు ఆరేళ్ల పాటు బీమా నగదు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే, గత జనవరిలో ఒక్కో ఆపరేటర్‌ నుంచి బీమా నగదు కింద రూ.11 వేలు వసూలు చేశారు. దీనిపైనా ఆపరేటర్లు అధికారులను ప్రశ్నించినా స్పందన కరువైంది. అదేవిధంగా కరోనా కారణంగా మృతి చెందిన 42 మందికి చెందిన కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు దిగాలని ఆపరేటర్లు నిర్ణయించారు.


జీతాలు సరిగా ఇవ్వడం లేదు

రేషన్‌ వాహనదారులకు ఒకటో తేదీన జీతం కూడా ఇవ్వడం లేదని ఎండీయూ ఆపరేటర్ల యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ, అధ్యక్షుడు కె. కిశోర్‌కుమార్‌ తెలిపారు. మొదట్లో 31వ తేదీ వేతనాలు వేసేవారని, ఇప్పుడు 12వ తేదీ తర్వాత ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు.  

Updated Date - 2022-05-15T08:30:47+05:30 IST