Abn logo
Mar 2 2021 @ 22:58PM

రేషన్‌ పంపిణీ తీరు మెరుగుపడాలి

పౌరసరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌

కలెక్టరేట్‌, మార్చి 2: ఇంటింటికీ రేషన్‌ సరఫరా తీరు మరింత మెరుగుపడాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ అన్నారు. మంగళవారం డెంకాడ మండలం జోన్నాడ, విజయనగరం పట్టణంలోని లంకాపట్టణం, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో ఎండీయూల ద్వారా జరుగుతున్న రేషన్‌ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో అధికారులతో సమీక్షించారు. రేషన్‌ పంపిణీలో వలంటీర్లను మరింత భాగస్వామ్యం చేయాలన్నారు. ఈపోస్‌ వేసే పనిని వారికే అప్పగించాలని ఆదేశించారు. సరకుల పంపిణీ సమాచారాన్ని రెండు రోజుల ముందుగానే కార్డుదారులకు అందించాలన్నారు. వాహనం వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూసుకోవాలనిచెప్పారు. రేషన్‌ డిపోల రేషనలైజేషన్‌ ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లింగ్‌ చేసి, బియ్యాన్ని తిరిగి ఇవ్వడంలో రైస్‌ మిల్లర్లు చేస్తున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. రోజుకు 4 వేల టన్నులు చొప్పున... నెలాఖరునాటికి లక్షా 28 వేలు టన్నుల నిల్వలు అందించాలని ఆదేశించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల జిల్లాకు వివిధ విభాగాల్లో అవార్డులు రావడంపై ఆరాతీశారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌తో పాటు అధికారులను అభినందించారు. కార్యక్రమంలో జేసీ కిషోర్‌కుమార్‌, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ విదేఖరే, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవానీశంకర్‌, డీఎస్‌వో పాపారావు, సివిల్‌ సప్లయ్‌ డీఎం భాస్కర్‌ పాల్గొన్నారు. 
Advertisement
Advertisement
Advertisement