రేషన్‌ డీలర్లకు కమీషన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-10-26T05:17:42+05:30 IST

రేషన్‌ డిపో డీలర్లకు ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పథకం కష్టాలు తెచ్చి పెడుతోంది. దీనికి ప్రధాన కారణం రేషన్‌ పంపిణీ సందర్భంగా ఇంటి వద్ద ఆ సమయంలో లేని వారికి రేషన్‌ పంపిణీ జరగడం లేదు.

రేషన్‌ డీలర్లకు కమీషన్‌ కష్టాలు

అమ్మిన సరుకులకే కమీషన్‌ సొమ్ము

ఎండీయూ ఆపరేటర్లు అమ్మకాలు తక్కువ చేసినా డీలర్లకే నష్టం

ఏలూరు సిటీ అక్టోబరు  : రేషన్‌ డిపో డీలర్లకు ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పథకం కష్టాలు తెచ్చి పెడుతోంది. దీనికి ప్రధాన కారణం రేషన్‌ పంపిణీ సందర్భంగా ఇంటి వద్ద ఆ సమయంలో లేని వారికి రేషన్‌ పంపిణీ జరగడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇంటి వద్ద లేని వారి కోసం ఆ సమీపంలోని సచివాలయాల వద్ద ఎండీయూ ఆపరేటర్లు రేషన్‌ ఇవ్వాలని చెబుతున్నా ఆ పద్దతి చాలా ప్రాంతాల్లో సక్రమంగా అమలు కాని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రతి నెలా రేషన్‌ పంపిణీ పూర్తిస్థాయిలో కార్డుదారులకు రేషన్‌ పంపిణీ జరగడం లేదు. దీంతో సంబంధిత డీలర్లకు ఇచ్చే కమీషన్‌ తగ్గిపోతోంది. క్వింటాల్‌ బియ్యానికి రూ.100 కమీషన్‌ డీలర్లకు అందజేస్తున్నారు. అయితే అమ్మకాలు తగ్గి నిల్వలు ఉండిపోతే అమ్మిన సరుకులకు మాత్రమే కమీషన్‌ చెల్లిస్తున్నారు. గతంలో చౌక డిపోలలో రేషన్‌ పంపిణీ చేసేటప్పుడు కార్డుదారులందరికీ రేషన్‌ అందించడానికి డీలర్లు కృషి చేసేవారు. ఒకవేళ ఎవరైనా సరుకులు తీసుకువెళ్లక పోయినా వారికి సమాచారం అందించి మరీ సరుకులు అందించేవారు. కానీ ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కారణంగా సరుకులు అందించే వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక పనులు మానుకోవాల్సి వస్తోందని కూలీలు చెబుతున్నారు. గతంలో పోర్టబులిటీ అమలులో ఉన్న సమయంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని, ఒక్కోసారి రేషన్‌ పొందలేకపోతున్నామని పలువురు కార్డుదారులు వాపోతున్నారు. 

ఇండెంట్‌ ఆధారంగా కమీషన్‌ ఇవ్వాలి : డీలర్లు 

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే వాహనాలలో జరిగే అమ్మకాలతో నిమిత్తం లేకుండా ఇండెంట్‌ పెట్టిన సరుకుల ఆధారంగా కమీషన్‌ అందిస్తే తమ కష్టాలు తీరుతాయని రేషన్‌ డీలర్లు కోరుతున్నారు. ఇంటింటికీ రేషన్‌ అందించే వాహనాల ద్వారా పూర్తిస్థాయిలో రేషన్‌ అందించక పోవడంతో చాలా ప్రాంతాల్లో సరుకులు మిగిలి పోతున్నాయని, అమ్మిన సరుకులకు మాత్రమే కమీషన్‌ ఇస్తున్నారని వాపోతున్నారు. ఎండీయూ ఆపరేటర్లు పూర్తిస్థాయిలో అమ్మకాలు చేసినా చేయకపోయినా వారికి పూర్తి వేతనం ఇస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలో 2,220 చౌక డిపోలు ఉన్నాయని, బియ్యంతో పాటు ఇతర సరుకులకు ఇచ్చే కమీషన్‌ తగ్గడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. 

నేడు రేషన్‌ డీలర్ల ధర్నా

ఏలూరులోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద మంగళవారం జిల్లాలోని రేషన్‌ డీలర్లు ధర్నా చేయ నున్నారు. గోనెసంచులు పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇచ్చే యాలన్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా చేపడుతున్నట్టు జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు తెలిపారు. దీంతో పాటు ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన కమీషన్‌ బకాయిలు ఇవ్వాలని, జీవో నెంబరు 10 అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ధర్నా చేపడుతున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-10-26T05:17:42+05:30 IST