ఆలస్యంగా ‘కోటా’యింపు..

ABN , First Publish Date - 2022-01-12T06:11:21+05:30 IST

పండుగ పూట పేదలు పస్తులుండే పరిస్థితి నెలకొంది. చౌకధరల దుకాణాలకు పూర్తిస్థాయిలో జనవరి బియ్యం కోటా చేర లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో లబ్ధిదారులు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఆలస్యంగా ‘కోటా’యింపు..
నర్సంపేటలో రేషన్‌ దుకాణం ఎదుట వేచి ఉన్న లబ్ధిదారులు

రేషన్‌షాపులకు పూర్తిస్థాయిలో చేరని బియ్యం

రాష్ట్ర ప్రభుత్వం కోటా కేటాయింపులో జాప్యం

డీలర్లకు చేరింది 40 శాతమే.. 

దుకాణాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు 

త్వరితగతిన పూర్తి చేస్తామంటున్న అధికారులు

  • పండుగ పూట పేదలు పస్తులుండే పరిస్థితి నెలకొంది. చౌకధరల దుకాణాలకు పూర్తిస్థాయిలో జనవరి బియ్యం కోటా చేర లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో లబ్ధిదారులు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పండుగలోపే బియ్యం పంపిణీ పూర్తిచేస్తామని చెప్పిన అధికారులు.. పండుగ దాటినా పూర్తి స్థాయిలో సరఫరా చేసేలా లేదు. సాంకేతిక కారణాలతో మండల్‌ లెవల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్‌ నుంచి దుకాణాలకు తరలింపులో జాప్యం జరుగుతోంది. దీంతో పంపిణీ ఆలస్యమవుతోంది.

పర్వతగిరి, జనవరి 11: కరోనా నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా అందించే బియ్యం కోటాను గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు పొడిగించింది. రాష్ట్రప్రభుత్వం మాత్రం తాను ఇవ్వాల్సిన కోటాపై స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో గతేడాది డిసెంబరులో రాష్ట్రం తన కోటాను విడుదల చేయలేక చేతులెత్తేసింది. దీంతో కేవలం కేంద్రం ఇచ్చిన కోటాను మాత్రమే డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ రాష్ట్రప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదు. ఈనెల కోటాపై సైతం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో రేషన్‌ కోటా విడుదల కాక పంపిణీ ఆలస్యమైంది. ప్రతీనెలా 25వ తేదీ నుంచే బియ్యం కోటాను ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌షాపులకు తరలిస్తారు. ఇలా తరలిస్తేనే వచ్చే నెలలో బియ్యం సకాలంలో పంపిణీ చేయవచ్చు. కానీ, ప్రస్తుత జనవరి నెలకు సంబంధించి సాంకేతిక కారణాల సాకుతో ఈనెల 5వ తారీఖు తరువాత బియ్యం దుకాణాలకు తరలించడం ప్రారంభించారు. దీంతో దుకాణాలకు చేరడం అలస్యమవుతోంది. మరోవైపు లారీల కొరత తీవ్రంగా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి  అధి కశాతం లారీలను వినియోగిస్తుండడంతో లారీలు సకాలంలో అందుబాటులోకి రాలేదు. లారీలు తక్కువగా ఉండడం, డబుల్‌ కోటా కావడంతో బియ్యం తరలింపులో జాప్యం నెలకొంది. ప్రతీరోజూ ఒక్కో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి కేవలం పదిలోపు లారీలు మాత్రమే తరలివెళ్తున్నాయి.


30 నుంచి 40 శాతం వర కే తరలింపు..

జిల్లాలో 509 రేషన్‌ దుకాణాలు ఉండగా,  2,54,281 ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు, 13,483 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు  కలిసి ఒక్కొక్క లబ్ధిదారుడికి 5+5 చొప్పున 10కిలోల బియ్యాన్ని అందిస్తుండగా జనవరికి సంబంధించి జిల్లాకు 8,276.550 మెట్రిక్‌ టన్నుల కోటా మంజూరైంది. ఈకోటాలో ఇప్పటివరకు కేవలం 30 నుంచి 40 శాతం  మాత్రమే దుకాణాలకు తరలించారు. మండలకేంద్రాల్లోని రేషన్‌షాపులకు 30 శాతం మేర తరలించగా, గ్రామాల్లోని షాపులకు ఇంతవరకు కోటా వెళ్లలేదు. గత నెలలో మిగిలిన కోటాను కొం దరు డీలర్లు లబ్ధిదారులకు అందిస్తున్నారు. 

ఎగబడుతున్న జనం..

సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలకు ప్రాధాన్యతనిస్తారు. పిండి వంటలకు బియ్యం అవసరం ఎక్కువ ఉండడంతో రేషన్‌షాపులకు పరుగులు తీస్తున్నారు. రేషన్‌ పోర్టబులిటీ సౌకర్యంతో రాష్ట్రంలోని ఏ రేషన్‌షాపులోనైనా సరుకులు తీసుకునే వెసులుబాటు ఉండడంతో బియ్యం వచ్చిన షాపులకు పరుగులు పెడుతున్నారు. అక్కడకు కూడా అరకొర కోటానే రావడంతో గంటల వ్యవధిలోనే కోటా ఖాళీ అయిపోతోంది. దీంతో ఉసూరుమంటూ ఇంటికి వెనుదిరుగుతున్నారు. మరికొందరు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. 


జిల్లాలో రేషన్‌ వివరాలు

రేషన్‌ షాపులు 509

ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు 2,54,281

అంత్యోదయ కార్డులు 13,483

అన్నపూర్ణ కార్డులు 08

మొత్తం 2,67,772

జనవరి కోటా 8,276.550 

మెట్రిక్‌టన్నులు 

Updated Date - 2022-01-12T06:11:21+05:30 IST