రేషన్‌ గందరగోళం

ABN , First Publish Date - 2021-03-05T06:14:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ’ పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైంది.

రేషన్‌ గందరగోళం
చోడవరం బోళ్ల వీధి రేషన్‌ డిపోలో సరకులు పంపిణీ చేస్తున్న దృశ్యం

గాడిన పడని ‘ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ’

గ్రామీణ ప్రాంతంలో సగం మందికి అందని ఫిబ్రవరి నెల రేషన్‌

ప్రభుత్వ తీరుపై కార్డుదారుల తీవ్ర అసంతృప్తి

తాత్కాలికంగా రేషన్‌ డిపోల్లో పంపిణీకి అధికారుల ఏర్పాట్లు


చోడవరం, మార్చి 4: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ’ పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైంది. రేషన్‌ తీసుకోవడానికి కార్డుదారులు పడరానిపాట్లు పడుతున్నారు. ప్రతి ఇంటికీ వచ్చి రేషన్‌ ఇవ్వడం సాధ్యంకాదని, వీధి చివరన వాహనాన్ని వుంచుతామని, అక్కడకు వచ్చి సరకులు తీసుకోవాలని వ్యాన్‌ డ్రైవర్లు స్పష్టంచేస్తున్నారు. దీంతో  కార్డుదారులంతా మండుటెండలో చాలాసేపు క్యూలో నిల్చోవాల్సి వస్తున్నది. గ్రామీణ ప్రాంతంలో ఫిబ్రవరి నెలకు సంబంధించి సగం మందికి రేషన్‌ అందలేదని అంటున్నారు.   

సంచార వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్‌ పంపిణీ కార్యక్రమం ప్రహసనంగా మారింది. చాలా రేషన్‌ డిపోల పరిధిలో సగం కార్డుదారులకు కూడా ఫిబ్రవరి నెల సరకులు అందలేదు. కొన్ని రేషన్‌ డిపోల పరిధిలో సరకుల పంపిణీ ప్రారంభం కాలేదు. దీంతో క్షేత్రస్థాయిలో కార్డుదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో పౌర సరఫరాల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ ప్రాంతంలో...ఏ రోజు రేషన్‌ ఇస్తారో ముందుగా ప్రకటించకపోవడంతో కార్డుదారులు సంచార వాహనం కోసం రోజూ ఎదురుచూడాల్సి వస్తున్నది. కూలిపనులకు వెళ్లే వారిలో చాలామందికి ఫిబ్రవరి నెల రేషన్‌ అందలేదు. ఇటువంటి వారంతా స్థానిక సర్పంచ్‌, అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లి...రేషన్‌ పంపిణీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆందోళన చెందిన వైసీపీ నాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫిబ్రవరి నెల రేషన్‌ను ఇంతవరకు అందుకోలేని వారికి వెంటనే ఏదో విధంగా సరకులు పంపిణీ చేయాలని కోరారు. దీంతో స్పందించిన అధికారులు...సంబంధిత వీఆర్వోలంతా రేషన్‌ డిపోలకు వెళ్లి, ఈ-పోస్‌ యంత్రంలో లాగిన్‌ కావాలని ఆదేశించారు. ఫిబ్రవరి రేషన్‌ను తీసుకోని వారందరికీ రేషన్‌ డిపోల్లో పంపిణీ చేయాలని చెప్పారు. దీంతో చోడవరం మండలంలోని రేషన్‌ డిపోల్లో బుధవారం సరకులు పంపిణీ చేపట్టారు. 


మూడు రోజులు పొడిగించినా....

గ్రామీణ ప్రాంతంలో ఫిబ్రవరి నెల రేషన్‌ పంపిణీ రెండు వారాలు ఆలస్యంగా మొదలైంది. మొత్తం మీద 13 రోజులు మాత్రమే రేషన్‌ ఇవ్వడం, ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తంగా మారడంతో చాలామందికి సరకులు అందలేదు. దీంతో ఫిబ్రవరి కోటాను మార్చి నెల 3వ తేదీ వరకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో రేషన్‌ పంపిణీ కాలేదు. కార్డుదారుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో స్థానిక నేతలు, అధికారులు మాట్లాడుకుని, రేషన్‌ డిపోల్లో సరకుల పంపిణీకి ఏర్పాట్లు చేయించారు. వీఆర్వోలు రంగంలోకి రేషన్‌ డిపోల్లో దగ్గరుండి కార్డుదారులకు సరకులు అందేలా చూస్తున్నారు.

Updated Date - 2021-03-05T06:14:40+05:30 IST