ఒక్కరోజులో రేషన్‌కార్డు.. రాష్ట్రంలో మొదటి కార్డుగా గుర్తింపు

ABN , First Publish Date - 2020-09-17T16:01:29+05:30 IST

రేషన్‌కార్డు కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీతో..

ఒక్కరోజులో రేషన్‌కార్డు.. రాష్ట్రంలో మొదటి కార్డుగా గుర్తింపు

ఆలమూరులో లబ్ధిదారునికి కార్డు అందజేత 


ఆలమూరు(తూర్పు గోదావరి): రేషన్‌కార్డు కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది.  ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీతో ఒక్క రోజులోనే రేషన్‌కార్డును మంజూరు చేయవచ్చని ఆలమూరు మండలంలో చేసి చూపించారు. ఈ సంఘటన రాష్ట్రంలో మొదటిగా చెబుతున్నారు. ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన కుడిపూడి వరలక్ష్మి రేషన్‌కార్డు కోసం మంగళవారం దరఖాస్తు చేసుకోగా గ్రామ వలంటీర్‌ శివరామకృష్ణ అదే రోజు అప్‌లోడ్‌ చేసి తహశీల్దార్‌కు పంపించారు. లబ్ధిదారుల వివరాలను సేకరించి తహశీల్దార్‌ జి.లక్ష్మీపతి అదేరోజు కొత్త రేషన్‌కార్డును మంజూరు చేశారు. దీంతో ఒక్కరోజులో రేషన్‌కార్డు అందించిన ఘనత ఆలమూరు మండలానికి దక్కినట్టు భావిస్తున్నారు. కొత్తగా మంజూరైన రేషన్‌కార్డును బుధవారం ఉదయం లబ్ధిదారురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులకు నాయకులు అందించారు. 


మండపేటలో రెండు గంటల్లోనే...

మండపేట : మండపేటలో కూడా దరఖాస్తు చేసుకున్న రెండు గంటల వ్యవధిలోనే రేషన్‌కార్డును అందించినట్టు మండపేట తహశీల్దార్‌ రాజేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని 12వ వార్డు సచివాలయంలో రేషన్‌కార్డు కోసం సైదిల్‌పేటకు చెందిన వెలగల మంజు రేషన్‌కార్డుకు బుధవారం వార్డు వలంటీర్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు దరఖాస్తు చేసుకోగా మధ్యాహ్నం 1.30 గంటలకు కార్డును అందించారు. గంటన్నర వ్యవధిలో రేషన్‌కార్డు అందించినట్టు తహశీల్దార్‌ తెలిపారు.


Updated Date - 2020-09-17T16:01:29+05:30 IST