రేషన్‌ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి

ABN , First Publish Date - 2021-06-19T05:49:14+05:30 IST

అర్హులైన పేదలకు నూతన రేషన్‌కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అందుకు దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి విచారణ చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా కర్‌ అన్నారు.

రేషన్‌ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్న మంత్రి గంగుల

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 18: అర్హులైన పేదలకు నూతన రేషన్‌కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అందుకు దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి విచారణ చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలా కర్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులతో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, ధాన్యం సేకరణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నాటికి నాలుగు లక్షల 15వేల 901 మంది దరఖాస్తులు చేసుకున్నారని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నామని తెలిపారు. మున్సిపల్‌, రెవెన్యూ శాఖల సహాకారంతో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను విచారణ చేపట్టాలని సూచించారు. కాగా రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ ఆదిలా బాద్‌ జిల్లాలో ఈ నెల 8వ తేదీ నాటికి రేషన్‌కార్డు కోసం 6,385 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు 3,064 దరఖాస్తులను పరిశీలించి జిల్లా పౌర సరఫరాల అధికారి లాగిన్‌లో ఉన్నాయని, మిగతా దరఖాస్తులను సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు. త్వరలో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. 2020-21 యాసంగి పంట కాలంలో 207 మంది రైతుల నుంచి 520 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధర కల్పించి రూ.98.24లక్షలు రైతులకు అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఛౌకధరల దుకాణాల డీలర్ల నుంచి 2లక్షల 46వేల 292 గోనె సంచులను సేకరించి నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలకు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ నటరాజన్‌, డీఎస్‌వో సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:49:14+05:30 IST