పరేషన్‌

ABN , First Publish Date - 2020-10-23T10:58:54+05:30 IST

రేషన్‌ షాపుల వద్ద కార్డుదారులకు కష్టాలు తొలగడం లేదు.

పరేషన్‌

ఒక్కో వస్తువుకు ఒక్కో సారి వేలిముద్ర

కార్డుదారులకు కష్టాలు

3 రోజుల్లో కేవలం 19.30 శాతం మందికి మాత్రమే  సరుకులు 


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 22 : రేషన్‌ షాపుల వద్ద కార్డుదారులకు కష్టాలు తొలగడం లేదు. ఒక్కో వస్తువులకు ఒక్కో సారి వేలిముద్ర వేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పుతున్నారు. దీనికి తోడు సర్వర్‌ స్లోగా ఉండటంతో సకాలంలో సరుకులు ఇవ్వలేక పోతున్నారు. మూడు రోజుల నుంచి రేషన్‌షాపుల వద్ద ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. సాధారణంగా రోజూ 15నుంచి 20 శాతం మంది కార్డుదారులకు రేషన్‌సరుకులు ఇవ్వాల్సి ఉంది. మూడు రోజులకు కలిపి కేవలం 19.30 శాతం మంది కార్డుదారులకు మాత్రమే సరుకులు అందాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఆర్థం చేసుకోవచ్చు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నెలకు రెండు పర్యాయాలు కార్డుదారులకు ఉచితంగా రేషన్‌ పంపిణీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి 14వ విడత బియ్యం,శనగల పం పిణీ ప్రారంభమైంది. సర్వర్‌డౌన్‌ కావడంతో కార్డుదారులు గంటల తరబడి రేషన్‌షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. 


ఇస్టానుసారంగా మార్పులు

ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించకుండా ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులు చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు రేషన్‌షాపుల వద్ద కార్డుదారుడు ఒక సారి వేలిముద్ర వేస్తే బియ్యం, కందిపప్పు, చక్కెర, ఇతర వస్తువులు ఇచ్చేవారు. ప్రస్తుతం పంపిణీలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఒక్కో వస్తువుకు ఒక్కో సారి కార్డుదారుడు వేలిముద్ర వేయాల్సి రావడంతో మరింత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఆ విధంగా కార్డుదారుడు రెండు సార్లువేలిముద్రలు వేయాల్సి రావడం, సర్వర్‌ స్లోగా ఉండటం వల్ల సరుకులు ఇవ్వడం డీలర్లకూ కష్టతరంగా మారింది. 

Updated Date - 2020-10-23T10:58:54+05:30 IST