కార్డుదారులపై ధరాభారం

ABN , First Publish Date - 2020-12-06T05:39:51+05:30 IST

డిసెంబరు నెల కోటాకు సంబంధించి రేషన్‌ పంపిణీలో తొలి రోజు శనివారం సర్వర్‌ సమస్య వెంటాడింది.

కార్డుదారులపై ధరాభారం

  కందిపప్పు, పంచదార ధరల పెంపు

 సర్వర్‌ సమస్యలతో తప్పని ఇక్కట్లు

ఏలూరుసిటీ, డిసెంబరు 5: డిసెంబరు నెల కోటాకు సంబంధించి రేషన్‌ పంపిణీలో తొలి రోజు శనివారం సర్వర్‌ సమస్య వెంటాడింది. ఈసారి నగదు చెల్లించి రేషన్‌ సరుకులు తీసుకోవాల్సి రావడంతో చాలామంది రేషన్‌ షాపులకు వచ్చి నగదు తెచ్చుకోవడానికి తిరిగి ఇంటికి వెనుదిరగాల్సి వచ్చింది. చాలా ప్రాంతాల్లోని చౌకడిపోలలో ఉదయం 11 గంటలకు కూడా రేషన్‌ పంపిణీ ప్రారంభం కాలేదు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రేషన్‌ ఎంత పంపిణీ జరిగిందో జిల్లా పౌరసరఫరాల శాఖాధి కారులకు కూడా తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. సర్వర్‌ సమస్య కారణంగా జిల్లాలో  రేషన్‌ ఎంత పంపిణీ చేశారో వివరాలు తెలియకుండా పోయింది. ఈసారి సాధారణ పద్ధతిలో కందిపప్పు, పంచదార, బియ్యం తీసుకెళ్లాల్సి రావడం, మరో పక్క కందిపప్పు, పంచదార ధరలు పెరగడంతో జనం బేజా రెత్తుతున్నారు. గతంలో కందిపప్పు కిలో రూ.40కి ఇచ్చేవారు. ఇప్పుడు అమాంతం రూ.67లకు పెంచే శారు. గతంలో కన్నా కిలోకు రూ.27 పెంచ డంతో ఈ కందిపప్పును తీసుకునేకంటే బహిరంగ మార్కె ట్‌లో నాణ్యత కలిగిన కందిపప్పు కొనుగోలు చేయడం మేలన్న భావన కార్డుదారుల్లో నెలకొన్నది. ఇక పంచదార గతంలో అరకిలో రూ.10 ఉండగా ఇప్పుడు రూ.17లకు చేశారు. బహిరంగ మార్కెట్‌లో అరకిలో రూ.19గా ఉంది. అంటే బహిరంగ మార్కెట్‌కు చౌక డిపోలకు కేవలం రెండు రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉండటంతో చాలామంది పంచ దార తీసుకోవడం  లేదు.


Updated Date - 2020-12-06T05:39:51+05:30 IST