మళ్లీ పరేషన్‌!

ABN , First Publish Date - 2021-05-08T06:55:48+05:30 IST

ప్రభుత్వం అర్భాటంగా ప్రారంభించిన రేషన్‌ డోర్‌ డెలివరీ విధానం ఆచరణలో అధ్వానంగా అఘోరిస్తోంది.

మళ్లీ పరేషన్‌!

 డోర్‌ డెలివరీ విధానంపై ఎండీయూల విముఖత

 ఏడు రోజుల్లో 26 శాతమే పూర్తి

 తమ సంఘం నేతకు  మొరపెట్టుకున్న రెవెన్యూ ఉద్యోగులు

ఎండీయూలకు బదులు వీఆర్‌వో లాగిన్‌లో పంపిణీ

 ఇది నిబంధనలకు విరుద్ధం : డీలర్లు

 ఆందోళనకు డీలర్లు సమాయత్తం

ప్రభుత్వం అర్భాటంగా ప్రారంభించిన రేషన్‌ డోర్‌ డెలివరీ విధానం ఆచరణలో అధ్వానంగా అఘోరిస్తోంది. కొందరు ఎండీయూలు రాజీనామా చేయడం, ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రభుత్వం నుంచి  మార్గనిర్ధేశం లేకపోవడం లాంటి సమస్యలతో రేషన్‌ పంపిణీ మళ్లీ గందరగోళంగా మారింది. నెలలో 15 నుంచి 18 రోజుల్లో పూర్తవ్వాల్సిన పంపిణీ ఇప్పటికి 7 రోజలు గడిచినా జిల్లాలో 26.6 శాతం మాత్రమే రేషన్‌ పంపిణీ అయింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వీఆర్‌వోలు రేషన్‌ దుకాణాల్లో డీలర్లతో పంపిణీ చేయిస్తున్నారు. దీనికి నిరసనగా డీలర్లు నిరసనలకు సిద్ధమవున్నారు. ఇలా ఒకదానికొకటి ముడిపడి సమస్య తీవ్రమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.

మొగల్రాజపురం, మే 7

  గతేడాది ఎప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు జిల్లాలో దాదాపు 12 లక్షల 98 వేల పైచిలుకు కార్డులకు నెలకు రెండుసార్లు డీలర్లు రేషన్‌ పంపిణీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీలో డీలర్‌కు ఇవ్వాల్సిన తమ వంతు కమీషన్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒకటీ రెండు నెలల జాప్యంతో ఇస్తూ వచ్చింది. కేంద్రం మాత్రం తమ వంతు ఇవ్వాల్సిన కమీషన్‌ సంవత్సరం తరువాత అంటే 2021 మార్చిలో డీలర్‌కు ఇచ్చింది. ఈసారి రాష్ట్రంలో డోర్‌ డెలివరీ విధానం రావడంతో రేషన్‌ పంపిణీ బాధ్యత ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లకు అప్పగించింది. ఫిబ్రవరి నుంచి వీరు విధుల్లోకి వచ్చారు. ఇక్కడి నుంచి అధికారులకు కష్టాలు మొదలయ్యాయి. ఎదో ఒక సమస్యతో డోర్‌ డెలివరీకి బ్రేక్‌ పడుతోంది. పనిభారం, వేతన సమస్యతో మండలాల్లో, ఆర్బన్‌ ప్రాంతాల్లో చాలా మంది అధికారికంగా ఎండీయూలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటున్నా వారు కూడా స్థిరంగా ఉండటం లేదు. ఇలాంటి ఘటనలతో మూడు నెలలుగా రూరల్‌, అర్బన్‌ తహసీల్దార్లు ఈ సమస్యను రెవెన్యూ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. ఎండీయూలు మానేసిన చోట తాత్కాలికంగా డ్రైవర్లను, కూలీలను పెట్టి వారికి సొంత డబ్బులు ఇచ్చి పథకాన్ని విజయవంతం చేశామని ఆ ఖర్చులు ఇప్పించాలని, మానేసిన ఎండీయూలు ఉద్యోగంలో చేరే ముందు ప్రభుత్వానికి చెల్లించిన డిపాజిట్‌ల కోసం వారు తమ వద్దకు వస్తున్నారని ఆ డబ్బులు వారికి రిఫండ్‌ చేయాలని తమ తరుపున ప్రభుత్వాన్ని కోరాలని బొప్పరాజుకు తహసీల్దార్లు విన్నవించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 

డిపోల్లో వీఆర్‌వో లాగిన్‌లో పంపిణీ

కరోనా వేళ తాము రెట్టింపు కోటా పంపిణీ చేయాల్సి వస్తుండటంతో కొంతమంది ఎండీయూలు అనారోగ్యం పేరుతో విధులకు గైర్హాజరవుతున్నారు. మరికొందరు కేవలం ఉదయం వచ్చి లాగిన్‌ చేసి వెళ్లిపోతున్నారు. ఇటువంటి చోట్ల రేషన్‌ దుకాణంలో వీఆర్‌వోలు డీలర్‌ చేత బియ్యం పంపిణీ చేయిస్తున్నారు. ఎండీయూల చేత డోర్‌ డెలివరీ చేయించాల్సిన అధికారులు వివిధ కారణాలతో మళ్లీ రేషన్‌ డిపోల్లో వేరే వారి లాగిన్‌లో పంపిణీ చేయిస్తుండటంతో దీనికి నిరసనగా సోమవారం నుంచి సమ్మెకు  వెళ్లేందుకు డీలర్‌ సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు.. ఎండీయూలకు, డీలర్లకు, పై అధికారుల మధ్య నలిగిపోతున్నారు.

 డోర్‌ డెలివరీపై చిత్తశుద్ధి ఇదేనా..

  ఎండీయూ విధానాన్ని పెట్టి మా నుంచి పంపిణీ బాధ్యతలు తప్పించింది. ఇపుడు ఎదో కారణాలు చెబుతూ మళ్లీ రేషన్‌ షాపులో డీలర్‌తో పంపిణీ చేయిస్తోంది. ఎండీయూలు లేకపోతే కొత్త వారిని నియమించాలి. ఎండీయూ రాజీనామా చేస్తే ఇంకొకరిని ఇన్‌చార్జి వేయాలి. డీలర్లకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. 

-ముత్యాల శేషగిరిరావు, అధ్యక్షుడు, జిల్లా డీలర్ల సంఘం

 భారమంతా మాపైనే..

 రేషన్‌ పంపిణీ అనేది పౌరసరఫరాల శాఖది. వారి ఉద్యోగులు డీఎ్‌సవో, ఏఎ్‌సవో, డీటీ వరకు మాత్రమే ఉన్నారు. దిగువ స్థాయిలో సిబ్బంది లేరు. దిగువ స్థాయిలో రెవెన్యూ వారికి అప్పగించడంతో పని భారం, ఆర్థిక భారం పెరిగిపోతోంది. మా వాళ్ల ఇబ్బందులను పౌర సరఫరాల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాను. మరోసారి తీసుకువెళతాను. స్పందన బట్టి చూస్తాం

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌  


Updated Date - 2021-05-08T06:55:48+05:30 IST