రేట్లు పెంచినా...

ABN , First Publish Date - 2022-05-16T05:36:08+05:30 IST

బస్సు టిక్కెట్ల ధరలు పెంచిన ప్రజారవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌లో రోజువారీ ఆదాయం పెరగడంలేదు.

రేట్లు పెంచినా...

పెరగని పీటీడీ ఆదాయం 

పడిపోతున్న ఆక్యుపెన్సీ రేషియో

 

ద్వారకాబస్‌స్టేషన్‌, 15: బస్సు టిక్కెట్ల ధరలు పెంచిన ప్రజారవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌లో  రోజువారీ ఆదాయం పెరగడంలేదు. టిక్కెట్ల పెంపుదల తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రయాణికులు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ రవాణా సాధనాలను వినియోగించుకుంటున్నారు. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది. పీటీడీ బస్సు చార్జీలను గత నెల 14న అర్ధరాత్రి నుంచి పెంచేశారు. అంతకుముందు  రీజియన్‌ రోజువారీ ఆదాయం సగటున రూ.96లక్షలుగా నమోదయ్యేది. చార్జీలు పెరిగిన తరువాత సగటున రోజువారీ ఆదాయం రూ.95 లక్షలకు పడిపోయింది.  

చార్జీలు పెరిగిన తరువాత ఆక్యుపెన్సీ రేషియో భారీగా పడిపోవడమే దీనికి కారణంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. బస్సుల  కనీసచార్జీ రూ.5 నుంచి రూ.10కు పెరగడం, అదే విధంగా అన్ని స్టేజీలకు టిక్కెట్టు పెరగడం వల్ల  ప్రయాణికులు ఆలోచనలో పడ్డారు. బస్సు టిక్కెట్టు చార్జీతో ప్రత్యామ్నాయ రవాణా సాధనాల్లో ప్రయాణించే అవకాశం ఉండడం, ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆటో, క్యాబ్‌ వంటివి అందుబాటులో ఉండడం వంటి కారణాలతో ఎక్కువ మంది వాటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో జనం లేకుండానే బస్సులు తిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో సగటు  ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయింది.  బస్సు చార్జీలు పెరగక ముందు రీజియన్‌  పరిధిలో సగటు ఆక్యుపెన్సీ రేషియో 72శాతం ఉండేది. పెరిగిన తరువాత 66 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ల రేట్లు పెరిగినా ఓఆర్‌ తగ్గడంతో రోజువారీ ఆదాయాన్ని కోల్పోతున్నట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు.   

Updated Date - 2022-05-16T05:36:08+05:30 IST