ఎయిరిండియా పునర్నిర్మాణానికి గట్టి కృషి : రతన్ టాటా

ABN , First Publish Date - 2021-10-09T01:04:29+05:30 IST

ఎయిరిండియా టేకోవర్‌ కోసం టాటా సన్స్ వేసిన బిడ్‌ను

ఎయిరిండియా పునర్నిర్మాణానికి గట్టి కృషి : రతన్ టాటా

న్యూఢిల్లీ : ఎయిరిండియా టేకోవర్‌ కోసం టాటా సన్స్ వేసిన బిడ్‌ను ప్రభుత్వం ఆమోదించడాన్ని రతన్ టాటా శుక్రవారం ఓ ప్రకటనలో స్వాగతించారు. టాటా గ్రూప్‌నకు అత్యంత విస్తృత మార్కెట్ అవకాశాలను ఎయిరిండియా కల్పిస్తుందని పేర్కొన్నారు. అయితే రుణ భారంతో ఉన్న ఈ సంస్థ పునర్నిర్మాణానికి గట్టి కృషి అవసరమని తెలిపారు. 


‘‘పునః స్వాగతం, ఎయిరిండియా. ఎయిరిండియా కోసం బిడ్‌ను టాటా గ్రూప్ గెలుచుకోవడం చాలా గొప్ప వార్త’’ అని రతన్ టాటా తెలిపారు. ఎయిరిండియాను పునర్నిర్మించడానికి గట్టి కృషి అవసరమైనప్పటికీ, విమానయాన రంగంలో టాటా గ్రూప్ అస్థిత్వానికి చాలా విస్తృతమైన మార్కెట్ అవకాశాలను కల్పించగలదనే  ఆశాభావం వ్యక్తం చేశారు. 


జేఆర్‌డీ టాటా నేతృత్వంలో ఎయిరిండియా ఒకానొకప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఎయిర్‌లైన్స్‌గా కీర్తి, ప్రతిష్ఠలను సాధించిందని, ఇది భావోద్వేగానికి సంబంధించిన విషయమని తెలిపారు. ప్రారంభంలో ఈ సంస్థకుగల పేరు, ప్రతిష్ఠలను తిరిగి సాధించే అవకాశం టాటాలకు దక్కిందన్నారు. జేఆర్‌డీ టాటా నేడు మన మధ్య ఉండి ఉంటే చాలా ఆనందించేవారని పేర్కొన్నారు. ఎంపిక చేసిన పరిశ్రమలను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు నిర్ణయించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 


స్పేస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ నేతృత్వంలోని కన్సార్షియం ఎయిరిండియాను స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రూ.18,000 కోట్లతో టాటా సన్స్ వేసిన బిడ్‌ను ప్రభుత్వం ఆమోదించింది.


Updated Date - 2021-10-09T01:04:29+05:30 IST