వడ్లు కొనాలని రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-12-04T07:56:04+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటాలు వేయడం లేదని మండిపడ్డారు.

వడ్లు కొనాలని రైతుల రాస్తారోకో

  • కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యంపై నిరసన
  • భూపాలపల్లి, సిరిసిల్ల, జగిత్యాల..
  • జిల్లాల్లో అన్నదాతల ఆందోళనలు


కాటారం: ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటాలు వేయడం లేదని మండిపడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని రేగులగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కాటారం-మంథని ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పుపెట్టారు. ‘వడ్లు కొనుగోలు చేస్తారా.. చావమంటారా..?’ అని పురుగుల మందు డబ్బాలను పట్టుకుని ఆందోళన చేశారు. వడ్లను తెచ్చి 18 రోజులవుతున్నా కాంటాలు పెట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు ఆగకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్‌ వద్ద రైతులు బైఠాయించారు. మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని బీర్‌పూర్‌ మండలం తుంగూరులోని ప్రధాన రహదారిపై అన్నదాతలు రాస్తారోకో చేశారు.


విషయం తెలుసుకున్న ఆయా మండలాల రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనలను విరమించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సమాఖ్య ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన సుమారు 1,000 మంది రైతులు ప్లకార్డులతో భారీ ప్రదర్శన చేపట్టారు. యాసంగి ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ బైఠాయించారు. 

Updated Date - 2021-12-04T07:56:04+05:30 IST