రాస్‌ మునిరత్నం ఇకలేదు..!

ABN , First Publish Date - 2021-05-07T07:56:51+05:30 IST

చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసిన రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపకుడు, పద్మశ్రీ గుత్తా మునిరత్నం రాస్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

రాస్‌ మునిరత్నం ఇకలేదు..!

కరోనా కాటుకు జిల్లా మరో ప్రముఖుడిని కోల్పోయింది.  



చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసిన రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపకుడు, పద్మశ్రీ గుత్తా మునిరత్నం రాస్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరువళ్ళూరు జిల్లా సీతాపురం అనే మారుమూల గ్రామంలో మంగమ్మ, రంగయ్యనాయుడు దంపతులకు 1936 జనవరి 6న గుత్తా మునిరత్నం జన్మించారు.సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన పదోతరగతి వరకు తిరుత్తణిలో విద్యాబ్యాసం చేశారు. పదిహేనేళ్ళ వయసు నుంచే బాలానంద సంఘం పేరిట పిల్లల క్లబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మునిరత్నం సమాజ సేవకు శ్రీకారం చుట్టారు. తర్వాత భారత్‌ సేవక్‌ సమాజ్‌లో చేరిక ఆయన్ను సేవారంగం దిశగా స్థిరమైన అడుగులు వేసేలా చేసింది. ఆపై 1960-66 నడుమ యువజన సంక్షేమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు.తిరుత్తణిలో రైతాంగానికి శిక్షణా తరగతులు నిర్వహించిన ఆయన 1970లో చెన్నైలో కళా ప్రింటర్స్‌ను స్థాపించారు. తెలుగు భాషాసమితి తరపున విజ్ఞాన వ్యాసాలు, తెలుగు సినీ పత్రికలను ప్రచురించేవారు.అదే ఏడాది తిరుపతికి నివాసం మార్చడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.  రేణిగుంట రోడ్డులో నేషనల్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ ప్రారంభించి మహిళా మాస పత్రికను ప్రారంభించారు.అనంతరం ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌ను 1985లో ఉదయం ప్రతిక కోసం  దాసరి నారాయణరావుకు విక్రయించారు. రైతులకు విశేష సేవలందిస్తున్న ఆచార్య ఎన్జీ రంగా, మాజీ ఎంపీ పాటూరి రాజగోపాల నాయుడితో పరిచయం ఏర్పడింది.మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి అయిన రాజగోపాల్‌ నాయుడితో కలసి 1981లో రాయలసీమ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.రాయలసీమలోని పలు ప్రాంతాల్లో బాల్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ సంస్థ రాష్ర్టీయ సేవా సమితిగా పేరు మార్చుకుని రాస్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు సాధించింది. తిరుపతి కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 2500గ్రామాలలో బాల్వాడీ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, మహిళా ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు  పెద్దఎత్తున అమలు చేస్తోంది. రాస్‌ అంటే మునిరత్నం పేరు గుర్తొచ్చేలా ఆయన సంస్థతో మమేకం అయ్యారు. విశేష సామాజిక సేవలతో లెక్కలేనన్ని అవార్డులు, ప్రశంసలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. 

అసంఖ్యాకంగా అవార్డులు

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్‌తో మొదలు పెట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రతిష్టాత్మక సంస్థల నుంచీ గుత్తా మునిరత్నం అసంఖ్యాకంగా అవార్డులు అందుకున్నారు. 1987లో ఇందిరా గాంధీ నేషనల్‌ యూనిటీ అవార్డు, 1989లో కేంద్ర ప్రభుత్వం నుంచీ బాలల సంక్షేమానికి గానూ జాతీయ అవార్డు, 1994లో కేంద్ర ప్రభుత్వం నుంచీ వికలాంగుల సంక్షేమానికి గానూ జాతీయ అవార్డు, 1995లో జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డు అందుకున్నారు. 1995లోనే ఎస్వీయూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. 1996లో ఫిక్కీ అవార్డు, 2004లో ఇండియా రోటరీ అవార్డు, 2006లో కేంద్ర ప్రభుత్వం నుంచీ రాజీవ్‌ గాంధీ మానవ సేవా అవార్డు, 2012లో సీతారామ్‌ జిందాల్‌ ఫౌండేషన్‌ అవార్డు, 2016లో జెరియాట్రిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అవార్డు, అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ యూఎ్‌సఏ నుంచీ జీవన సాఫల్య పురస్కారం వంటి పలు ముఖ్యమైన అవార్డులు ఆయనను వరించాయి. 2012లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారంతో మునిరత్నంను గౌరవించింది. జ్ఞానీ జైల్‌సింగ్‌, ఆర్‌.వెంకట్రామన్‌, శంకర్‌ దయాల్‌ శర్మ తదితర రాష్ట్రపతులు, ఐకే గుజ్రాల్‌, వి.పి.సింగ్‌ తదితర ప్రధానులు, దలైలామా వంటి ప్రముఖుల నుంచీ అవార్డులు అందుకున్నారు. మునిరత్నం వ్యక్తిగతంగానే కాకుండా రాస్‌ సంస్థకు సైతం పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. మునిరత్నం పలు దేశాల్లో పర్యటించి తమ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన రంగాలను అధ్యయనం చేసి విలువైన పరిశోధక పత్రాలను, పుస్తకాలను రాశారు. బాలప్రభ తెలుగు మాస పత్రికకు ఎడిటర్‌గా, మహిళ తెలుగు మాసపత్రికకు అసోసియేట్‌ ఎడిటర్‌గా, సమాజ్‌ వికాస్‌ తెలుగు మాసపత్రికకు ఎడిటర్‌గా ఆయా పత్రికలను సమర్ధవంతంగా నడిపారు. మరోవైపు ముంబై భారతీయ విద్యా భవన్‌, ఏపీ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఢిల్లీలోని యూత్‌ హాస్టల్స్‌ ఆఫ్‌ ఇండియా, ఢిల్లీకే చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితర ప్రఖ్యాత సంస్థల్లో జీవితకాలపు సభ్యుడిగా కొనసాగారు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థల్లో వివిధ హోదాల్లో గౌరవ సభ్యత్వాలు, పదవులూ నిర్వహించారు. కేంద్ర ప్రణాళికా సంఘంలో నిపుణుల విభాగం సభ్యుడిగా కీలక పాత్ర వహించారు. కాగా వివాహం చేసుకోని గుత్తా మునిరత్నం తన జీవితం మొత్తాన్నీ రాస్‌ సంస్థ నిర్వహణకు, సామాజిక సేవకే అంకితం చేశారు. తిరుపతిలోని రాస్‌ ప్రధాన కార్యాలయ భవనంలోనే ఆయన నివసించేవారు. గురువారం ఆయన మృతి చెందడంతో రాస్‌ సంస్థలో విషాదం నెలకొంది. 

నేడు గోవిందధామంలో అంత్యక్రియలు 

రాస్‌ మునిరత్నం మృతదేహం చెన్నై నుంచీ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. ఆయన మృతదేహాన్ని తిరుపతిలో ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని రాస్‌ ప్రధాన కార్యాలయ భవనంలో సందర్శకుల కోసం ఉదయం 7.30 గంటల నుంచీ 10 గంటల వరకూ వుంచుతారు.అనంతరం ఊరేగింపుగా కరకంబాడి రోడ్డులోని గోవింద ధామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated Date - 2021-05-07T07:56:51+05:30 IST