క్రీడాకారులకు ఖేల్ రత్న పురస్కారాల ప్రదానం

ABN , First Publish Date - 2021-11-13T22:55:11+05:30 IST

రాష్ట్రపతి భవన్‌లో శనివారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్

క్రీడాకారులకు ఖేల్ రత్న పురస్కారాల ప్రదానం

న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో శనివారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరచినవారికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. రెజ్లర్ రవి కుమార్, బాక్సర్ లొవ్లీనా బోర్గోహాయిన్, హాకీ ప్లేయర్ శ్రీజేష్ పీఆర్, పారా షూటర్ అవని లేఖరా, పారా అథ్లెట్ సుమిత్ అంతిల్, ఒలింపియన్ నీరజ్ చోప్రా, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఈ పురస్కారాలను పొందారు. 


మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారాలు, 2021కి 12 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఇండియన్ జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు రవి కుమార్ (రెజ్లింగ్), లొవ్లీనా బోర్గోహాయిన్ (బాక్సింగ్), పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, శ్రీజేష్ పీఆర్ (హాకీ), టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు అవని లేఖరా (షూటింగ్), సుమిత్ అంతిల్ (జావెలిన్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నగర్ (బ్యాడ్మింటన్), మనీష్ నర్వాల్ (షూటింగ్), మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, పురుషుల ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రిలను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. 


హాకీ ప్లేయర్లు మోనిక, వందన కటారియా; కబడ్డీ ప్లేయర్ సందీప్ నర్వాల్, షూటర్ అభిషేక్ వర్మలకు అర్జున పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.


ప్రభుత్వం అందజేసే అత్యున్నత స్థాయి క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం. క్రీడా రంగంలో నాలుగేళ్ళకుపైగా మంచి పనితీరు కనబరచినవారి నుంచి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. విజేతలకు ట్రోఫీ, సైటేషన్, నగదు బహుమతులను అందజేస్తారు. 


Updated Date - 2021-11-13T22:55:11+05:30 IST