Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 10:42:42 IST

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర రాశిఫలాలు (జన్మనక్షత్రం ఆధారంగా)

twitter-iconwatsapp-iconfb-icon
శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర  రాశిఫలాలు (జన్మనక్షత్రం ఆధారంగా)

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)

ఆదాయం : 14, వ్యయం : 14;  రాజపూజ్యం : 3, అవమానం : 6

మేష రాశి వారు శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుబంధాలు బలపడతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయవివాదాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీగమన యత్నాలు ఫలిస్తాయి. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి. సన్నిహితులతో మాటపడాల్సి వస్తుంది.  


గురువు ఈ ఏడాది 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. శుభకార్యాలకు అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఉల్లాసంగా గడుస్తుంది. రక్షణ, సైన్స్‌, ప్రచురణలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలవారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహానుబంధాలు పెంపొందుతాయి. విద్యార్థులకు శుభప్రదం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. టెక్స్‌టైల్స్‌, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్‌, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశాలలో చదువులకై చేసే యత్నాలు ఫలిస్తాయి. జూలై 29 నుంచి నవంబర్‌ 23 వరకు ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ అఽధికం. పెద్దల ఆరోగ్యం మందగించవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అన్నదమ్ముల మధ్య అవగాహన లోపిస్తుంది.


10, 11వ స్థానాల్లో శని సంచారం కారణంగా కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఏప్రిల్‌ వరకు ఉన్నత చదువుల్లో అశ్రద్ధ కారణంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లలు - పెద్దల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మే నుంచి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఆందోళనలు అధికం అవుతాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా అన్నదమ్ములతో సఖ్యత లోపిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. శత్రుబాధ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తి విషయాల్లో చికాకులు ఎదుర్కొంటారు. శని వక్రగమనంలో ఉన్న జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. 


మీ జన్మ, అష్టమ స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా విలాసాల ఖర్చులు అధికం. రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. పన్నులు, బీమా, గ్రాట్యుటీ, రుణాల విషయాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త అనుబంధాల విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

శ్రీ ధన్వంతరి ఆరాధన శుభప్రదం.


వృషభం (కృత్తిక 2,3,4; రోహిణి; మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం : 8, వ్యయం: 8;  రాజపూజ్యం : 6, అవమానం : 6

వృషభ రాశి వారు ఈ ఏడాది ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. గృహయోగం కలుగుతుంది. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాల వారికి ప్రోత్సాహకరం. శుభకార్యాలు జరుగుతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలెదురైనా చివరికి సత్ఫలితాలు సాధిస్తారు. 


గురువు ఈ ఏడాది మీ జన్మ రాశి నుంచి 11వ స్థానంలో సంచరిస్తాడు. ఆస్తులు పెంపొందించుకుంటారు. నూతన ఉద్యోగాలకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూ పైచదువులు చదివే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి అధిక లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. రుణభారం పెరిగే అవకాశం ఉంది. జూలై 29 - నవంబర్‌ 23 తేదీల మధ్య ఖర్చులు అంచనాలు మించుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే సకాలంలో తిరిగి రాకపోవచ్చు. న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.


ఈ ఏడాది 9, 10 స్థానాల్లో శని సంచారం ఫలితంగా నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజీ చేసుకోవడం ద్వారా కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.  జూన్‌ 5 - అక్టోబర్‌ 24 తేదీల మధ్య శని వక్రించిన కారణంగా వృత్తి, వ్యాపారాల్లో ఓరిమితో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. షేర్ల లావాదేవీలు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. 


12 - 6 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైఫల్యాల కారణంగా మనసు నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ప్రమాదాలకు అవకాశం ఉంది కాబట్టి దూరప్రయాణాలు తగ్గించాలి. విద్యార్థులు చదువులపై మరింత శ్రద్ధ చూపాలి. 

శ్రీ ఉమామహేశ్వరస్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం : 11, వ్యయం: 5, రాజపూజ్యం : 2, అవమానం : 2

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో మిథున రాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. వృత్తిపరంగా గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. న్యాయపోరాటాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య ఆందోళనలు అధికం. వృత్తిలో ఒత్తిడులకు లోనవుతారు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 


గురుగ్రహం ఈ ఏడాది మీ జన్మ రాశి నుంచి 10వ స్థానంలో సంచరించడం వల్ల స్నేహ బాంధవ్యాలు బలపడతాయి. పేరుప్రఖ్యాతులు గడిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రచయితలకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్‌, ఉన్నత విద్య, విదేశీ రంగాల వారికి ప్రోత్సాహకరం. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. జూలై 29 - నవంబర్‌ 23 మధ్య గురువు వక్రించిన కారణంగా మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. మోసపోయే అవకాశం ఉంది. బదిలీల్లో అసౌకర్యం తప్పకపోవచ్చు.


ఈ ఏడాది శని 8, 9 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మధ్యవర్తిత్వం సమయంలో మాటపడాల్సి వస్తుంది. ఇతరుల ఆర్థిక విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్థిరాస్తుల విక్రయం సమయంలో ఆశించినంత డబ్బు రాకపోవచ్చు. వైద్యం, ఆహార రంగాల వారు నిదానంగా మంచి ఫలితాలు సాధిస్తారు. పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. ఓరిమితో వ్యవహరించడం వల్ల లక్ష్యాలు సాధించగలుగుతారు. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసే ప్రయత్నాలు చేస్తారు. అయితే భారీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. పొదుపు పథకాలు, మ్యూచ్యువల్‌ ఫండ్‌ వ్యవహారాలు లాభిస్తాయి. జూన్‌ 5 - ఆక్టోబర్‌ 24 తేదీల మధ్య లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పేరు సంపాదిస్తారు. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. 


11 - 5 స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా ఈ ఏడాది ప్రయాణాల్లో తిప్పట అధికం. ఖర్చులు అంచనాలు మించుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో జాగ్రత్త. ఆహార నియమాలు పాటించడం అవసరం.

శ్రీ విష్ణుపంజరస్తోత్ర పారాయణ, విష్ణు ఆరాధన శుభప్రదం.


కర్కాటకం (పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం : 5, వ్యయం : 5; రాజపూజ్యం : 5, అవమానం : 2

కర్కాటక రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగం చేస్తూ  ఏదైనా వ్యాపారం చేసేందుకు అనుకూలం. కోర్టుల్లో విజయం సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. విద్యార్థులకు శుభప్రదం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉన్నత చదువులు, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. జూన్‌-అక్టోబర్‌ మాసాల మధ్య రాజకీయాలు, కళలు, సినీ, రక్షణ, విద్య, ఐ.టి రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.


9వ స్థానంలో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయరంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. సైన్స్‌, పరిశోధన, డిఫెన్స్‌, పోలీస్‌, వైద్యరంగాల వారు పురోగతి సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. స్నేహానుబంధాలు బలపడతాయి. పెద్దల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశ ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జూలై 29 నుంచి నవంబర్‌ 23 వరకు గురువు వక్రగమనంలో ఉన్నందున కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాగ్దానాలు నిలుపుకోవడం కష్టం. ఉన్నత విద్యాయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి.  దూరప్రయాణాలు తగ్గించాలి.


ఈ ఏడాది 7, 8 స్థానాల్లో శని సంచారం ఫలితంగా భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. అయితే స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య మనస్పర్థలకు అవకాశం ఉంది. శత్రుబాధ అధికం. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ బాఽధలు అధికంగా ఉంటాయి. పన్నులు, పెన్షన్‌,  లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. దూరప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. జూన్‌ 5 - అక్టోబర్‌ 24 తేదీల మధ్య ఆర్థిక విషయంలో కొంత పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలకిది సమయం కాదు. పై చదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. విదేశీ గమన ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి.


10 - 4 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ఆటంకాలు ఎదురైనా ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన నిర్ణయాల్లో తొందరపాటు తగదు. సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. మనసు చంచలంగా ఉంటుంది. ఫలితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. స్నేహానుబంధాల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల వారు నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు.

శ్రీ దుర్గాదేవి ఆరాధన శుభప్రదం


సింహం  (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)

ఆదాయం : 8, వ్యయం : 14; రాజపూజ్యం : 1, అవమానం : 5

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కంపెనీ వాటాల విలువ పెరుగుతుంది. రుణయత్నాలు ఫలిస్తాయి. ఫార్మా, వైద్యం, ఆహార రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్య సాధనకు ఎక్కువ శ్రద్ధ చూపాలి. ప్రత్యర్థులతో సఖ్యత కుదురుతుంది. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో నిదానం పాటించాలి. ఖర్చులు అంచనాలను మించిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.


8వ స్థానంలో గురుగ్రహ సంచారం ఫలితంగా వివాహయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఉమ్మడి వ్యాపారాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయం, కళలు, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో వున్న జూలై 29- నవంబర్‌ 23 మధ్య వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత చదువుల్లో మొదట ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక విషయాల్లో మోసానికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. షేర్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో నిదానం అవసరం. 


6, 7 స్థానాల్లో శని సంచారం ఫలితంగా స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో సఖ్యత ఏర్పడతుంది. భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. జూన్‌ 5 - అక్టోబర్‌ 24 తేదీల మధ్య వైవాహిక జీవితంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని బాధ్యతలు భుజానికెత్తుకోవాల్సి రావచ్చు. విలాసాలకు అధికంగా ఖర్చు చేస్తారు. బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి వస్తుంది. రుణబాధలు అధికం.


9 - 3 స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా వాహనం నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం లేదా ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. ఓరిమితో వ్యవహరిస్తే ఉన్నచోటే మంచి గుర్తింపు పొందుతారు. అనుభవజ్ఞుల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. స్నేహ, బాంధవ్యాలు పెంపొందుతాయి. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. 

శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.


కన్య  (ఉత్తర 2,3,4; హస్త; చిత్త 1,2 పాదాలు)

ఆదాయం : 11, వ్యయం : 5; రాజపూజ్యం : 4, అవమానం : 5

కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఆహారం, ఫార్మా, వైద్య రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విదేశీ గమన యత్నాలకు అవాంతరాలు ఎదురవుతాయి. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఆస్తిపాస్తుల కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.


ఈ ఏడాది 7వ స్థానంలో గురు సంచారం ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలు అందుకునే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. భయాందోళనలు అధికం అవుతాయి. బంధువులు, సన్నిహితులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. జూలై 29 - నవంబర్‌ 23 మధ్య ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఉద్యోగ యత్నాలకు, కొత్త వ్యాపారాల ప్రారంభానికి అనుకూలం. స్నేహానుబంధాలు మెరుగుపడతాయి.


శని 5, 6 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటరి ప్రయాణాలు క్షేమం కాదు. విద్యార్థులు చదువులపై అశ్రద్ధ చూపడం వల్ల నష్టపోతారు. ఉన్నత చదువులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. దానధర్మాలకు వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శని వక్రించిన జూన్‌ 5 - అక్టోబర్‌ 24 తేదీల మధ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పట్టుదలతో విజయం సాధిస్తారు. వ్యాపార రంగంలోని వారికి నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ రంగంలోని వారు సహోద్యోగుల సహకారంతో విజయం సాధిస్తారు. 


8 - 2 స్థానాల్లో రాహు - కేతు గ్రహాల సంచారం ఫలితంగా ఉద్యోగంలో బదిలీలకు అవకాశం ఉంది. న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయంలో మధ్యవర్తిత్వం కారణంగా ఇబ్బందులు పడతారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. దూర ప్రయాణాలకు అనుకూలం. ఏడాది మొదట్లో కొన్ని చికాకులు ఎదురైనా తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. కళా రంగాల వారు ఆశించిన ఫలితాలు అందుకునేందుకు అధికంగా శ్రమించాలి.

పార్వతీదేవి ఆరాధన శుభాలను చేకూరుస్తుంది.


తుల (చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం : 8, వ్యయం : 8; రాజపూజ్యం : 7, అవమానం : 1

తులా రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత చదువుల యత్నాలు, వివాహ యత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. న్యాయ, విదేశీ వ్యవహారాల వారికి ప్రోత్సాహకరం. ప్రేమానుబంధాలు బలపడతాయి. క్రీడలు, ఆడిటింగ్‌, సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. జూన్‌- అక్టోబర్‌ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. చిన్నారుల వ్యవహారశైలి మనస్తాపం కలిగిస్తుంది.


6వ స్థానంలో గురువు సంచారం కారణంగా ఈ ఏడాది ధనలాభం కలుగుతుంది. సంతానం కోరుకునే వారి సంకల్పం ఫలిస్తుంది. పిల్లల విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. మంచి పనుల కోసం ఖర్చు చేస్తారు. బాంధవ్యాలు పెంపొందుతాయి. వాయిదాపడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. పొదుపు పథకాలు లాభిస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న జూలై 29 - నవంబర్‌ 23 మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది.


ఈ ఏడాది 4, 5 స్థానాల్లో శని సంచారం కారణంగా వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. కష్టంలో ఉన్న వారికి సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భారీ ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరాశకు గురవుతారు. శని వక్రగమనంలో వున్న జూన్‌ 5 - అక్టోబర్‌ 24ల మధ్య విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.


7 - 1 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఖర్చులు అంచనాలు మించుతాయి. డ్రైవింగ్‌లో నిదానం అవసరం. కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సిరావచ్చు. ఇతరులకు ఇచ్చిన డబ్బు సకాలంలో తిరిగి రాకపోవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు తగిన సమయం కాదు. వాగ్వివాదాలకు దూరంగా, మౌనంగా ఉండటం మేలు. 

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.


వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం : 14, వ్యయం : 14; రాజపూజ్యం : 3, అవమానం : 1

వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఇల్లు, లేదా స్థలం కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. రుణభారం తగ్గుతుంది. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైన కాలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగం వారు పురోగతి సాధిస్తారు. జూన్‌- అక్టోబర్‌ మాసాల మధ్య ఖర్చులు అధికం. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులెదురవుతాయి. ప్రమోషన్ల విషయంలో ఆటంకాలు ఎదురయ్యే ఆవకాశం ఉంది. 


ఈ ఏడాది 5వ స్థానంలో బృహస్పతి సంచారం ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఆస్తుల విక్రయం లాభిస్తుంది. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. లక్ష్యసాధనలో తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. గురువు వక్రగమనంలో ఉండే జూలై 29 - నవంబర్‌ 23 తేదీల మధ్య రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. 


ఈ ఏడాది 3, 4 స్థానాల్లో శని గ్రహ సంచారం ఫలితంగా ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. బదిలీల కారణంగా అసౌకర్యానికి గురవుతారు. కుటుంబ విషయాల్లో చికాకులు ఎదురవుతాయి. అన్నదమ్ముల మధ్య అపోహలకు ఆస్కారం ఉంది. ఆస్తి తగాదాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. స్నేహాల కారణంగా విద్యార్థులు చదువులపై అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. విలాసాలకు ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శని వక్రించిన జూన్‌ 5 - అక్టోబర్‌ 24 తేదీల మధ్య వైద్యం, ఆస్పత్రులు, సేవలు, స్టేషనరీ వ్యాపారాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 


6, 12 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో నెమ్మది పాటించాలి. ఆర్థిక విషయాల్లో, ఇతరులకు సాయం చేసే విషయంలో ఒకటి రెండుసార్లు అలోచించాలి. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులెదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. శత్రుబాధలు అధికం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు అధికం.

శ్రీ రామరక్షాస్తోత్ర పారాయణ, శ్రీరాముడి ఆరాధన శుభప్రదం


ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

ఆదాయం : 2, వ్యయం: 8;   రాజపూజ్యం : 6, అవమానం : 1

ధనుస్సు రాశి వారికి శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. ప్రమోషన్‌లు అందుకుంటారు. ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్సల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరం. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. జూన్‌ - అక్టోబర్‌ల మధ్య విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.


4వ స్థానంలో గురుగ్రహ సంచారం ఫలితంగా స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సోదరీసోదరులు, బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు అనుకూలం. బంధుమిత్రుల నుంచి సహకారం అందుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురువు వక్రించిన జూలై 29 - నవంబర్‌ 23 తేదీల మధ్య వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ష్యూరిటీలిచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు నిదానం పాటించడం అవసరం.


2, 3 స్థానాల్లో శని సంచారం ఫలితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ప్రమోషన్లు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో ఇబ్బందులు ఎదురవుతాయి. శని వక్ర గమనంలో ఉన్న జూన్‌ 5 - అక్టోబర్‌ 24 మధ్య కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.


5, 11 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా అనుకోని ఆర్థిక లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పై అధికారుల నుంచి ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. ఉన్నత చదువులకు ఆటంకాలెదురవుతాయి. అనవసర ఖర్చులు అధికం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్ల లావాదేవీల్లో నిదానం అవసరం.

శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభదాయకం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం : 5, వ్యయం : 2; రాజపూజ్యం : 2,  అవమానం : 4

మకర రాశి వారు ఈ సంవత్సరంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. అనుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంతానం విషయంలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. సొంత ఇల్లు, లేదా స్థలం సమకూర్చుకుంటారు. పై అధికారుల సహకారంతో ఉద్యోగులు మంచి ఫలితాలు సాధిస్తారు. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రుణయత్నాలు ఫలించకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి.


3వ స్థానంలో గురు సంచారం వల్ల వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. సృజనాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రస్తుత వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీ, ఆడిటింగ్‌, స్టేషనరీ, రవాణా రంగాల వారికి శుభప్రదం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. బాంధవ్యాలు బలపడతాయి. జూలై 29 - నవంబర్‌ 29 తేదీల మధ్య గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. పెట్టుబడులపై ఆశించిన ప్రతిఫలాలు రాకపోవచ్చు. 


1, 2 స్థానాల్లో శని సంచారం ఫలితంగా వైద్యం, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. మనసు చికాకుగా ఉంటుంది. విద్యార్థులు చదువుల పట్ల అధికంగా శ్రద్ధ చూపించాలి. ఆర్థిక సమస్యల కారణంగా చికాకులు అధికమవుతాయి. ఇతరులకు సహాయం చేసేందుకు ముందడుగు వేసి చివరకు మాటపడాల్సి రావచ్చు. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికమవుతాయి. శని వక్రగమనంలో ఉన్న జూలై 5 - అక్టోబర్‌ 24ల మధ్య ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. బదిలీ ప్రయత్నాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.


4, 10 స్థానాల్లో రాహు కేతువుల సంచారం వల్ల ప్రియతములతో ఎడబాట్లు తలెత్తవచ్చు. ఇచ్చిన మాట నిలుపుకోవడం కష్టం. కుటుంబ వ్యవహారాల కారణంగా చికాకులు పెరుగుతాయి. రుణబాధలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో ఒత్తిళ్లున్నా ఓరిమితో వ్యవహరించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

శ్రీ ఇంద్రాక్షీ స్తోత్ర పారాయణం శుభప్రదం.


కుంభం (ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం : 5, వ్యయం : 2; రాజపూజ్యం : 5, అవమానం : 4

కుంభ రాశి వారు శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరంలో స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్లపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉన్నత చదువులు, విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. అనుబంధాలు విస్తరిస్తాయి. ఆడిటింగ్‌, వైద్యం, రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత అశాంతికి లోనవుతారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 


ఈ ఏడాది గురువు 2 స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. బదిలీలు జరిగే అవకాశముంది. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. సంతానం కోరుకునే వారి సంకల్పం నెరవేరుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులెదురవుతాయి. ప్రమోషన్లు ఆలస్యమవుతాయి. గురువు వక్రించిన జూలై 29 - నవంబర్‌ 23 తేదీల మధ్య ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. 


12 - 1 స్థానాల్లో శని సంచారం వల్ల వైద్యం, ఫార్మా, బీమా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మనసు అలజడిగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశాలున్నాయి. బదిలీ కోసం మీరు చేసే యత్నాలకు ఆటంకాలెదురవుతాయి. శని వక్రగమనంలో ఉన్న జూన్‌ 5 - అక్టోబర్‌ 24 తేదీల మధ్య ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా యత్నాలు కొనసాగించి లక్ష్యాలను సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా వాయిదాపడుతున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి.


3, 9 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆస్తిపత్రాల విషయంలో సమస్యలు ఎదురవుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. దంపతుల మధ్య అపోహలు, అపార్థాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. అశ్రద్ధ వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశముంది. ఓరిమితో వ్యవహరించాలి. ఏప్రిల్‌ 12 నుంచి పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. 

శ్రీ దక్షిణామూర్తిస్తోత్ర పారాయణ, ఆరాధన శుభప్రదం.


మీనం (పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం : 2, వ్యయం : 8; రాజపూజ్యం : 1,  అవమానం : 7

మీన రాశి వారు ఈ ఏడాది గృహనిర్మాణం, స్థల సేకరణ చేస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. ప్రమోషన్‌లు, కోరుకున్న చోటకు బదిలీలు సంభవం. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. శుభకార్యాలు జరుగుతాయి. క్రీడలు, పరిశోధన, విద్యా రంగాల వారికి విజయం. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌ రంగాలవారికి శుభప్రదం. జూన్‌ - అక్టోబర్‌ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది.


గురువు మీ జన్మరాశిలో సంచారం చేస్తున్న ఫలితంగా రాజకీయ నేతలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీరంగాలకుచెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. టెక్స్‌టైల్స్‌, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్య, ఆడిటింగ్‌ రంగాల వారికి అనుకూలం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. పరిశోధన, న్యాయరంగాల వారికి శుభప్రదం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జూలై 29 - నవంబర్‌ 23 మధ్య ఊహించని ఖర్చులు వస్తాయి. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రతి పనికి ఆటంకాలెదుర వడం వల్ల చికాకులకు లోనవుతారు.


11 - 12 స్థానాల్లో శని సంచారం ఫలితంగా రాబడి బాగున్నా ఖర్చులు అంతకంటే ఎక్కువగా ఉంటాయి. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. రుణబాధలు పెరుగుతాయి. వృత్తిపరంగా సంచారం పెరుగుతుంది. సహోద్యోగుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. అనుభవజ్ఞుల సలహాలు పాటించి వ్యాపార రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. దానధర్మాలు, విలాసాలకు ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సలహాలతో ముందడుగు వేయడం మంచిది. జూన్‌ 5 - అక్టోబర్‌ 24 తేదీల మధ్య ఆర్థిక పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు అధికంగా శ్రమిస్తే తప్ప లక్ష్యాలు అందుకోవడం కష్టం. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

రాహు కేతువుల స్థితి కారణంగా ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. రుణబాధలు పెరుగుతాయి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. కొత్త పరిచయాల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. 

శ్రీ శివారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.