వైరస్‌ ఉధృతి

ABN , First Publish Date - 2021-04-08T04:51:49+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉంది. గత నెలాఖరు నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది.

వైరస్‌ ఉధృతి
ఈఎన్‌టీ ఆసుపత్రి వద్ద కొవిడ్‌ పరీక్షల కోసం వేచివున్న జనం

శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

గత నెల మొదటి ఆరు రోజుల్లో 85 మందికి సోకిన వైరస్‌

ఈ నెల 1,253

అప్రమ్తతంగా ఉండాలని సూచిస్తున్న వైద్య నిపుణులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉంది. గత నెలాఖరు నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జిల్లాలో 85 కేసులు రాగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు 1,253 వచ్చాయి. అంటే గడచిన నెలతో పోల్చితే కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగింది. మొదటిసారి కంటే రెండో దశలో పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మార్చి ఒకటో తేదీన ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాగా, ఈ నెల ఒకటో తేదీన 189 కేసులు నమోదయ్యాయి. గత నెల ఆరో తేదీన 18 మందికి వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఈ నెల ఆరో తేదీన 258 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ గణాంకాలు చూస్తే కేసుల పెరుగుదల ఏ స్థాయిలో వుందన్న విషయం అర్థమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.  

మరో మూడు వారాలు కీలకం

కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మరో మూడు వారాలపాటు అత్యంత జాగ్రత్తగా వుండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సెకండ్‌ వేవ్‌లో పాజిటివ్‌ కేసులు తారస్థాయికి చేరేందుకు మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశముందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మరింత జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో కేసుల పెరుగుదలకు అనుగుణంగా అధికారులు ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతున్నారు. క్వారంటైన్‌ సెంటర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.   ఇదిలావుండగా ప్రస్తుతం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమో దవుతున్నా..మాస్క్‌ వినియోగించేందుకు చాలామంది ఆసక్తి చూపించడం లేదు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత కొంత తక్కువగా ఉన్నప్పటికీ... ఊపిరి తిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, మరణాలు సంభవిస్తున్నాయని ...ఈ విషయాన్ని గుర్తించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


కొత్తగా 298 పాజిటివ్‌ కేసులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 63,849కు చేరాయి. వీరిలో  61,394 మంది కోలుకోగా, మరో 1,902మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ బుధవారం ఒకరు మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 553కు చేరింది. 

9342 మందికి వ్యాక్సిన్‌: జిల్లాలో బుధవారం 9,342 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. వీరిలో 5,577 మంది మొదటి డోసు తీసుకోగా, 4,775 మంది రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

Updated Date - 2021-04-08T04:51:49+05:30 IST