6 రోజులు.. 10 లక్షల మంది

ABN , First Publish Date - 2021-01-25T07:45:03+05:30 IST

నిదానంగా ప్రారంభమైనా.. దేశంలో కరోనా టీకా పంపిణీ క్రమంగా వేగం పుంజుకుంటోంది. ఈ నెల 16న ప్రక్రియ మొదలవగా.. కేవలం ఆరు రోజుల్లోనే పది లక్షలమందికి వ్యాక్సిన్‌

6 రోజులు.. 10 లక్షల మంది

భారత్‌లో వేగంగా టీకాలు

అమెరికాలో పది, బ్రిటన్‌లో 18 రోజులు

ఇప్పటివరకు 16 లక్షల మందికి వ్యాక్సిన్‌


న్యూఢిల్లీ, జనవరి 24: నిదానంగా ప్రారంభమైనా.. దేశంలో కరోనా టీకా పంపిణీ క్రమంగా వేగం పుంజుకుంటోంది. ఈ నెల 16న ప్రక్రియ మొదలవగా.. కేవలం ఆరు రోజుల్లోనే పది లక్షలమందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. అమెరికాలో పది లక్షల టీకాల పంపిణీకి పది రోజులు పట్టిందని, యూకే 18 రోజుల సమయం తీసుకుందని వివరించింది. మరోవైపు దేశంలో వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 16 లక్షలకు చేరువైంది. ఆదివారం ఉదయం 8 గంటల వరకు 15,82,201 మందికి పంపిణీ జరిగింది. శనివారం 1,91,609 మందికి టీకా వేసినట్లు కేంద్రం పేర్కొంది. టీకా తీసుకున్నవారిలో ఇప్పటివరకు 1,238 మంది జ్వరం, ఇంజెక్షన్‌ చేసినచోట నొప్పితో ఇబ్బందిని ఎదుర్కొనగా.. 11 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరినట్లు తెలిపింది. ఏడుగురు మృతిచెందారని.. ఆరుగురి మరణాలకు టీకా కారణం కాదని స్పష్టం చేసింది.  కాగా, దేశంలో శనివారం 14,849 మందికి కరోనా నిర్ధారణ అయింది. 155మంది మృతిచెందారు. 15,948 మంది కోలుకున్నారు. కేరళలో కొత్తగా 6,960 మందికి పాజిటివ్‌ వచ్చింది. 1.84 లక్షల యాక్టివ్‌ కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, బెంగాల్‌వే 75 శాతం ఉన్నాయి.


‘డ్రాగన్‌’ టీకాకు నై.. ఇండియా వ్యాక్సిన్‌కు సై

నిన్నమొన్నటి వరకు చైనా కొవిడ్‌ టీకా ‘కరోనా వ్యాక్‌’ కొనుగోలుపై దృష్టిపెట్టిన ప్రపంచదేశాల చూపు.. ఇప్పుడు భారత్‌ వైపు మళ్లింది. చైనాకు అత్యంత సన్నిహిత దేశంగా ముద్రపడ్డ కాంబోడియా, జనాభాపరంగా నాలుగో అతిపెద్ద దేశం ఇండోనేషియా, ఆరో అతిపెద్ద దేశం బ్రెజిల్‌ సహా అనేక దేశాలు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ వ్యాక్సిన్ల క్యూ కడుతున్నాయి. చైనా అభివృద్ధిచేసిన ‘కరోనా వ్యాక్‌’ ప్రభావశీలతపై ప్రశ్నలు రేకెత్తుతుండటంతో.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ (కొవిషీల్డ్‌) టీకాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని అల్ప ఆదాయ దేశాలు తమ సహాయార్ధం ఉచితంగా టీకాలను అందించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. మైత్రీ భావనతో ఇప్పటికే ఏడు పొరుగుదేశాలకు దాదాపు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసులను భారత్‌ పంపించింది. అక్కడ  దుష్ప్రభావాలు బయటపడకపోవడంతో.. కొవిషీల్డ్‌ పనితీరుపై విశ్వాసం పెరుగుతోంది. ఇప్పటికే 20 లక్షల కొవిషీల్డ్‌ డోసులను ‘సీరం’ నుంచి బ్రెజిల్‌ కొనుగోలు చేసింది. ఇండోనేషియా కూడా ‘సీరం’తో చర్చలు జరుపుతోంది.


అమెరికన్‌ ఖాతాలో మరో 1400 డాలర్లు

అమెరికా పగ్గాలు చేపట్టిన అధ్యక్షుడు జోబైడెన్‌.. తనదైన ముద్ర వేసే విధంగా కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. కరోనాతో దెబ్బతిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ఓ భారీ ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ‘ది అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ పేరుతో 1.9 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.138లక్షల కోట్లు) ప్యాకేజీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ఒక్కో అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో మరో 1400 డాలర్లు (దాదాపు రూ.లక్షా 2వేలు) జమ కానున్నాయి.


ఇప్పటికే 600 డాలర్లు ఇచ్చినా.. కరోనా విపత్తు వల్ల తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలకు ఇవి చాలవని, అందుకే నెలకు 2వేల డాలర్ల చొప్పున ఇస్తున్నామని బైడెన్‌ తెలిపారు. అలాగే, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారిని యజమానులు ఖాళీ చేయిస్తుండడంపై ఆంక్షలు విధించాలని బైడెన్‌ ఆదేశించారు. నిరుద్యోగ భృతి, అధిక సమయం పని చేసే వారి కనీస వేతనాల పెంపు, చిరు వ్యాపారులకు సహాయం, కరోనా టీకా నిర్వహణ వంటివి కూడా ఈ భారీ ఉద్దీపనలో ఉన్నాయి. 


త్వరలో కరోనా నాజల్‌ స్ర్పే

భౌతిక దూరాన్ని ‘దూరం’ చేసే నాజల్‌ స్ర్పేను కొద్ది నెలల్లో అందుబాటులోకి తెస్తున్నామని యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హాం శాస్త్రవేత్తలు ప్రకటించారు. రెండు రోజులపాటు కరోనా వైరస్‌ నుంచి ఈ స్ర్పే రక్షణ కల్పిస్తుంది. కొద్ది నెలల్లో స్ర్పేను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయనున్నారు. మెడికల్‌ షాపుల్లోనూ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఆమోదం పొందిన వైద్యపరమైన పదార్థాలతో తయారు చేస్తుండడం వల్ల స్ర్పే వాడకానికి కొత్తగా అనుమతులు అక్కర్లేదు. ఈ స్ర్పేలో వినియోగించే పదార్థ కణాలు ముక్కులోని కరోనా వైరస్‌ కణాలను గుర్తిస్తాయి. అవి బయటకు తప్పించుకోలేని విధంగా ఒక రకమైన పూతతో కప్పేయడంతోపాటు వాటిని నిర్వీర్యం చేస్తాయి. దీంతో సదరు వ్యక్తి వదిలిన గాలిని ఇతరులు పీల్చుకొన్నా ప్రమాదం ఉండదని పరిశోధనలకు సారధ్యం వహించిన రిచర్డ్‌ మోక్స్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-25T07:45:03+05:30 IST