వద్దన్నా ర్యాపిడ్‌ టెస్టులే..

ABN , First Publish Date - 2021-04-16T05:13:21+05:30 IST

జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులతో ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెళుతున్న సామాన్య ప్రజలు నిలువుదోపిడీకి గురవుతున్నారు

వద్దన్నా ర్యాపిడ్‌ టెస్టులే..

దోపిడీకి తెరలేపిన ప్రైవేటు ఆస్పత్రులు, లేబొరేటరీలు

ర్యాపిడ్‌ టెస్టుకు రూ.1,500 వసూలు  

టెస్టు చేయించుకొంటేనే చికిత్స అందిస్తామని డాక్టర్ల మెలిక

  

గుంటూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):  జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులతో ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెళుతున్న సామాన్య ప్రజలు నిలువుదోపిడీకి గురవుతున్నారు. అక్కడి సిబ్బంది కరోనా ర్యాపిడ్‌ టెస్టు చేయించుకోవాలని చెబుతుండంతో చేసేది లేక రూ.1,500 చెల్లించి ప్రజలు ర్యాపిడ్‌ టెస్టు చేయించుకొంటున్నారు. కరోనా వైరస్‌ సోకిందో, లేదో నిర్ధారించేందుకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు మాత్రమే చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. అయినప్పటికీ యాంటీజెన్‌(ర్యాపిడ్‌) టెస్టులను ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు పెద్దఎత్తున చేస్తున్నాయి. ఈ విధానంలో టెస్టింగ్‌ కిట్‌ ఖర్చు రూ.500 కూడా ఉండదు. అయినప్పటికీ రూ.1,500 వసూలు చేస్తున్నాయి. ఆర్‌టీపీసీఆర్‌ విధానంలో టెస్టు చేసినందుకు ప్రభుత్వం రూ.500 వసూలు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. దీనిని ఏ ఒక్క లేబొరేటరీ పాటించడం లేదు.  

యాంటీజెన్‌ విధానంలో పాజిటివ్‌ శాతం ఎక్కువ

ఆర్‌టీపీసీఆర్‌ విధానంలో నిత్యం వేల సంఖ్యలో టెస్టులు చేస్తున్నా పాజిటివ్‌ శాతం 10 నుంచి 12 మధ్యనే ఉంటోంది. అదే యాంటిజెన్‌ విధానానికి వచ్చేసరికి దీనికి రెట్టింపు శాతం పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. దాదాపుగా 23.06 శాతం పాజిటివ్‌ రేట్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ విధానంలో కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం కరోన టెస్టు ఎవరికైనా చేయాలంటే కచ్ఛితంగా ఆధార్‌ నెంబరుని నమోదు చేయాలి. అలానే ప్రభుత్వ ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. దాని వలన ఎవరికైనా పాజిటివ్‌ వస్తే కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌ చేయడం సులభతరం అవుతుంది. అయితే కొన్ని ఆస్పత్రులు ఇవేమి లేకుండానే యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నాయి.  



Updated Date - 2021-04-16T05:13:21+05:30 IST