ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-07-09T12:02:57+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌’ ద్వారా కరోనా పరీక్షలు బుధవారం ప్రారంభించారు.

ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు ప్రారంభం

 అరగంటలో ఫలితం వచ్చినా  ప్రకటించని అధికారులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌’ ద్వారా కరోనా పరీక్షలు బుధవారం ప్రారంభించారు. 20 సెంటర్లలో సుమారు 500 మందికి పైగా టెస్టులు నిర్వహించారు. అరంగంటలోనే ఫలితాలు వచ్చినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించలేదు. మొదటి రోజు నిర్వహించిన పరీక్షలో 10 శాతం మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఉచితంగా కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోంది. అయితే కేవలం 15 నిమిషాల్లో ఫలితాలు తెలుసుకునేందుకు ‘ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌’ ద్వారా పరీక్షలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌ పరీక్షలు నిర్వహించారు.


జిల్లా వైద్యాధికారి డాక్టర్‌  స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు మంచి స్పందన లభించింది. మొదట జిల్లాలో 20 సెంటర్లలో ఈ పరీక్షలు చేశారు. ఇందులో అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సరూర్‌నగర్‌, బాలాపూర్‌, ఆబ్దుల్లాపూర్‌మెట్‌, రంగనాయకులకుంట, మన్సూరాబాద్‌, శివరాంపల్లి, హస్సన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, హఫీజ్‌పేట్‌, ఉప్పర్‌పల్లి, రాయదుర్గ, నందనవనం, శేరిలింగంపల్లి, నార్సింగి, కందుకూరు, మొయినాబాద్‌, కొందుర్గు, ఆమనగల్లు, యాచారం, కొత్తూరు కేంద్రాలున్నాయి. 65 ఏళ్ల పైబడిన వారికి ప్రా ధాన్యత ఇచ్చారు. జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు న్న వారికి పరీక్షలు చేశారు. కానీ.. ఫలితాలు వెల్లడించడంలో మాత్రం అధికారులు జాప్యం వహించారు. 


షాద్‌నగర్‌లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కొత్తూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం వైద్య సిబ్బంది ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులకు శ్రీకారం చుట్టారు. షాద్‌నగర్‌లో 34 మందికి, కొత్తూర్‌లో 25 మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో 11 మందికి పాజిటివ్‌, 48 మందికి నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో షాద్‌నగర్‌కు చెందిన ఆరుగురు 26 నుంచి 39 వయస్సు కలిగిన వారు ఉండగా... ఐదుగురు కొత్తూర్‌ మండలానికి చెందిన వారున్నారని తెలిపారు. 

Updated Date - 2020-07-09T12:02:57+05:30 IST