Abn logo
Jul 30 2020 @ 01:09AM

రాఫెల్‌ రాక!

తొలివిడతగా ఐదు రాఫెల్‌ యుద్ధవిమానాలు బుధవారం హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో దిగాయి. విమానాలు ఫ్రాన్స్‌లో బయలుదేరింది మొదలు, ఏడువేల కిలోమీటర్ల ప్రయాణంలో అవి మార్గమధ్యంలో అరబ్‌ ఎమిరేట్స్‌లో ఆగడం, ఆ తరువాత ముప్పైవేల అడుగుల ఎత్తున గాల్లోనే ఇంథనాన్ని నింపుకోవడం వంటి ప్రతీ ఘట్టాన్నీ పత్రికలూ, చానెళ్ళు ప్రజలకు చేరవేస్తూ వచ్చాయి. అంబాలాలో వాలగానే ఘనంగా వాటర్‌ సెల్యూట్‌ అందుకున్నాయి. రాఫెల్‌ రాక కొద్దినెలల ముందే జరిగివుంటే ఇంత హడావుడి ఉండేదో లేదో తెలియదు కానీ, చైనాతో కయ్యం పతాకస్థాయిలో ఉన్న స్థితిలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో పాకిస్థాన్‌ యుద్ధవిమానాలతో దీనిని పోల్చిన మీడియా ఇప్పుడు చైనా యుద్ధ విమానాలతో దీని బలాన్ని బేరీజువేస్తున్నది. 


పక్షులు వచ్చేశాయ్‌ అంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎంతో ఉద్వేగంగా ట్వీట్‌ చేశారు. భారతసైనిక చరిత్రలో నవశకం అన్నారు. సరైన సమయం, ఎంతటి బలమైన శత్రువైనా ఇత్యాది మాటలు పరోక్షంగా చైనాను ఉద్దేశించినవే. భారత భూభాగంమీద కన్నేసినవారు వీటిరాకతో వొణికిపోతున్నారని కూడా అన్నారు. దేశరక్షణను మించిన ఘనమైన కర్తవ్యం వేరొకటి లేదని ప్రధాని కూడా సంస్కృతంలో ట్వీట్‌ చేశారు. అమ్ముల పొదిలోకి ఒక బలమైన ఆయుధం వచ్చిచేరినప్పుడు గర్వించాల్సిందే. తన యుద్ధ విమానాలకు భారత్‌లో ఇంత విస్తృతప్రచారం, ఘనస్వాగతం చూసి ఫ్రాన్స్‌ సైతం ఆశ్చర్యపోయిందట. ఇప్పటికే రాఫెల్‌ చాలా దేశాల దగ్గర ఉంది. అనేక యుద్ధాల్లో అది తన సమర్థతను రుజువుచేసుకుంది. రాఫెల్‌ను ఆలస్యంగా సమకూర్చుకున్నది మనమే. అందుకే కాబోలు, భారత రాజకీయ నాయకులు, మీడియా రాఫెల్‌కు ఇస్తున్న ఈ ప్రాధాన్యానికి చైనాతో తలెత్తిన ఉద్రిక్తతలే అసలు కారణమని అక్కడి పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ముప్పయ్‌ ఐదేళ్ళక్రితం ఇదే డసాల్ట్‌ సంస్థ నుంచి కొనుగోలు చేసిన మిరాజ్‌–2000యుద్ధ విమానాలు ఏమాత్రం హడావుడి లేకుండా వైమానికదళం అమ్ములపొదిలో చేరిన ఘట్టాన్ని అలనాటి అధికారులు గుర్తుచేసుకుంటున్నారు. ఆర్నెల్ల పాటు శిక్షణ తీసుకొని, యుద్ధవిమానాలతో తిరిగి స్వదేశానికి చేరుకున్నప్పుడు కొందరు వైమానికదళ అధికారులు, ఒకరిద్దరు ఎంపీలు పాల్గొనడం తప్ప ఇంతటి వేడుక జరగలేదని అంటున్నారు. 


రెండు దశాబ్దాల తరువాత ఇలా ఓ బలమైన ఆయుధం చేరినందున భారత వైమానికదళం కచ్చితంగా బలోపేతం అవుతుంది. మొత్తం 36 విమానాల్లో తొలివిడతగా ఫ్రాన్స్‌ అందించిన పదివిమానాల్లో ఐదు శిక్షణ నిమిత్తం అక్కడే ఉండగా, ఇప్పుడు భారత్‌ చేరిన ఐదువిమానాల్లోనూ రెండు శిక్షణకు సంబంధించినవి, మూడు మాత్రమే యుద్ధంలో ఉపకరించేవి. వీటిని వినియోగంలోకి తెచ్చే ప్రక్రియకు ఎలాగూ మరికొన్ని వారాలు పట్టబోతున్న తరుణంలో, మిగతా ఐదూ కూడా వచ్చిచేరితే కొంతలో కొంత ధైర్యం. 


నరేంద్రమోదీ కారణంగానే రాఫెల్‌ సుసాధ్యమైందంటూ రక్షణమంత్రి చేసిన వ్యాఖ్య కాంగ్రెస్‌కు ఆగ్రహం కలిగించడం సహజం. విమానాల రాకను స్వాగతిస్తూనే, అంతర్జాతీయంగా పోటీపడిన పలు సంస్థలను వడగట్టి రాఫెల్‌ను ఎంపికచేసి, ఏకంగా 126 విమానాల కొనుగోలుకు సిద్ధపడిన గతాన్ని ఆ పార్టీ గుర్తుచేస్తున్నది. 36విమానాలను, అందునా ఒక్కోదానికీ 526కోట్లకు బదులు 16౭0కోట్లు చెల్లించడమేమిటనీ, హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ స్థానంలోకి దివాలాతీసిన అనిల్‌ అంబానీ ఎలా వచ్చి కూర్చున్నారని రాహుల్‌ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ చేసుకున్న ఒప్పందం 95శాతం పూర్తయిందనీ, మోదీ వచ్చి సంతకం పెట్టడమే తరువాయని ఫ్రాన్స్‌ ప్రకటించినా, మోదీ వెళ్ళి దానిని రద్దుచేసి, కొత్త ఒప్పందాన్ని కుదర్చుకోవడం, భారీ అవినీతి జరిగిందంటూ ‘చౌకీదార్‌ చోర్‌హై’ అన్న నినాదంతో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడటం తెలిసిందే. మొత్తం ఒప్పందంలో 108 విమానాలు దేశీయంగా తయారయ్యే అవకాశం ఉన్నప్పటికీ మోదీ కొత్త ఒప్పందం దానికి వీల్లేకుండా చేయడం వివాదం సృష్టించింది. అత్యాధునిక అస్త్రశస్త్రాలు పొట్టన నింపుకొని యుద్ధానికి సిద్ధంగా వాలబోతున్న విమానాలనే కొనుగోలు చేస్తున్నందున వీటి ధర పెరిగిందన్నది బీజేపీ వాదన. ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత రాఫెల్‌ గురించి రాహుల్‌ మాట్లాడలేదు. ఇప్పుడు గతాన్ని తవ్వితీయడం కంటే, రాఫెల్‌ కొనుగోలు వెనుక కాంగ్రెస్‌ కృషి ఉన్నదని దేశానికి గుర్తుచేయడం రాహుల్‌ ఉద్దేశం కావచ్చు. దేశరాజకీయాలనే కాదు, సీబీఐనీ, కాగ్‌నీ, న్యాయస్థానాలను సైతం రాఫెల్‌ కుదిపేసింది. చైనా వీరంగం వేస్తున్న ఈ కీలకతరుణంలో రాఫెల్‌ రాక కచ్చితంగా కాస్తంత ధైర్యాన్ని ఇస్తుంది.

Advertisement