అత్యాచారం అనివార్యమైతే ఆస్వాదించాలి!

ABN , First Publish Date - 2021-12-18T07:31:09+05:30 IST

కర్ణాటక శాసనసభలో కాంగ్రె్‌సకు చెందిన మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు అట్టుడికించాయి....

అత్యాచారం అనివార్యమైతే ఆస్వాదించాలి!

మాజీ స్పీకర్‌ వాచాలతతో అట్టుడికిన కర్ణాటక అసెంబ్లీ

రమేశ్‌కుమార్‌ క్షమాపణతో ముగిసిన వివాదం

లోక్‌సభలోనూ దుమారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై మండిపడిన బీజేపీ 

ఆ వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్న ప్రియాంక


బెంగళూరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటక శాసనసభలో కాంగ్రె్‌సకు చెందిన మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు అట్టుడికించాయి. శాసనసభలో అతివృష్టి, వరద నష్టంపై 69వ నిబంధన కింద చర్చలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కాంగ్రెస్‌ సభ్యులు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో.. అతివృష్టి పరిహారం పంపిణీ జాప్యంపైౖ గురువారం రమేశ్‌ మాట్లాడుతూ... ‘‘ఒకవేళ అత్యాచారం అనివార్యమైతే ఆనందంగా ఆస్వాదించాలి. ఇప్పుడు మీ పరిస్థితి అలాగే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు దుమారానికి దారి తీశాయి. అంతలోనే సభ వాయిదా పడింది. శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభం కాగానే రమేశ్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. ఇంగ్లీషులోని ఓ సామెతను ప్రస్తావించాను తప్ప మహిళలను అవమానించాలని, సభా గౌరవాన్ని తగ్గించాలని కానీ తనకు లేదంటూ వివరించారు. తన వ్యాఖ్యలతో బాధపడిన వారికి, ముఖ్యంగా మహిళలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.సభ్యుడు విచారం వ్యక్తం చేసినందున ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని స్పీకర్‌ తేల్చారు. కాగా.. రమేశ్‌ మహిళల్ని అవమానించేలా వ్యాఖ్యానించారంటూ మాజీ సీఎం యడియూరప్ప మండిపడ్డారు. దేవదాయ మంత్రి శశికళాజొల్లెతో పాటు కాంగ్రె్‌సకు చెందిన ఎమ్మెల్యే అంజలీ నింబాళ్కర్‌ సైతం ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 


లోక్‌సభలోనూ దుమారం

రమేశ్‌కుమార్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలోనూ దుమారం రేగింది. శాసనసభలో ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని, రమేశ్‌కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డిమాండ్‌ చేశారు. ఒక ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా మౌనంగా ఉన్నారెందుకని బీజేపీ నిలదీసింది. ఇదిలాఉండగా, ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌ వ్యాఖ్యలను ప్రియాంక వాద్రా తీవ్రంగా ఖండించారు. అవి సమర్థనీయం కావని ట్వీట్‌ చేశారు.


కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ క్షమాపణలు

రమేశ్‌ అనుచిత వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ క్షమాపణలు చెప్పారు. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పార్టీ అంగీకరించబోదని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సర్జేవాలా స్పష్టం చేశారు. రమేశ్‌ కుమార్‌ ప్రతి భారతీయ మహిళకు క్షమాపణలు చెప్పాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్భయ తల్లి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-18T07:31:09+05:30 IST