అత్యాచారం కేసులో జీవిత ఖైదు.. న్యాయమూర్తి పైకి చెప్పులు!

ABN , First Publish Date - 2021-12-30T22:36:22+05:30 IST

అత్యాచారం కేసులో ఓ యువకుడిని దోషిగా తేల్చిన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పుతో హతాశుడైన..

అత్యాచారం కేసులో జీవిత ఖైదు.. న్యాయమూర్తి పైకి చెప్పులు!

సూరత్: అత్యాచారం కేసులో ఓ యువకుడిని దోషిగా తేల్చిన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పుతో హతాశుడైన అతడు న్యాయమూర్తి పైకి చెప్పులు విసిరాడు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సుజీత్ సాకేత్ (27) గతేడాది ఏప్రిల్‌లో ఐదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ల పేరుతో బాలికకు ఆశచూపి అత్యాచారానికి పాల్పడి ఆపై గొంతునులిమి చంపేశాడు. 


ఈ కేసును విచారించిన ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పీఎస్ కాలా సుజీత్‌ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అలాగే, బాధిత బాలిక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆ తీర్పును ఊహించని సుజీత్ తట్టుకోలేకపోయాడు. ఆగ్రహంతో తన చెప్పులను తీసి న్యాయమూర్తిపైకి విసిరాడు.


అయితే, ఆ చెప్పు గురితప్పి న్యాయమూర్తి సమీపంలోని విట్‌నెస్ బాక్స్‌లో పడింది. ఘటన జరిగిన సమయంలో కోర్టులోనే ఉన్న న్యాయవాది వినయ్ శర్మ మాట్లాడుతూ.. కోర్టు తీర్పు విని సుజీత్ షాకయ్యాడని, తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపిస్తూ న్యాయమూర్తిపైకి చెప్పులు విసిరాడని తెలిపారు.

Updated Date - 2021-12-30T22:36:22+05:30 IST