ఆర్టీసీలో మరో దారుణం

ABN , First Publish Date - 2022-05-15T06:17:49+05:30 IST

ఆర్టీసీలో మరో దారుణం

ఆర్టీసీలో మరో దారుణం

పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారయత్నం

విజిలెన్స్‌ సెక్యూరిటీ కానిస్టేబుల్‌ నాగరాజు నిర్వాకం 

ప్రతిఘటించిన కార్మికురాలు

పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు

స్వీపింగ్‌ కాంట్రాక్టర్‌ కూడా ఫిర్యాదు 

మరో ఇద్దరిని వేధించాడని వెల్లడి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/బస్‌స్టేషన్‌) : ఆర్టీసీలో మరో కీచకపర్వం చోటుచేసుకుంది. గవర్నర్‌పేట-2 డిపో వాషింగ్‌ విభాగంలో పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికురాలిపై ఆర్టీసీ విజిలెన్స్‌ సెక్యూరిటీ కానిస్టేబుల్‌ నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడటం చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బస్సులో బలాత్కారం చేయటంతో కార్మికురాలు ప్రతిఘటించింది. దీనిపై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. వ్యవహారం సాగు..తుండటంతో పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన మహిళా పారిశుధ్య కార్మికురాలు ఓ సంస్థలో కాంట్రాక్టు కార్మికురాలుగా పనిచేస్తోంది. ఈ సంస్థ గవర్నర్‌పేట-2 డిపోలో స్వీపింగ్‌ అండ్‌ వాషింగ్‌ కాంట్రాక్టును నిర్వహిస్తోంది. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకు ఆమె బస్సులను శుభ్రం చేస్తోంది. విజిలెన్స్‌ సెక్యూరిటీ కానిస్టేబుల్‌ నాగరాజు తన దగ్గరకు వచ్చి అగ్గిపెట్టె తీసుకురమ్మని చెప్పాడని, ఆ తరువాత బస్సులోకి వెళ్లి కూర్చున్నాడని, పెద్దవాడు కావడంతో తీసుకెళ్లి ఇచ్చానని, అనంతరం దోమల ఒత్తి వెలిగించమని చెప్పి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను భయపడిపోయి బయటకు వచ్చేస్తుండగా, బలవంతం చేయబోయాడని తెలిపింది. ఆ సమయంలో కాంట్రాక్టర్‌, పార్కింగ్‌ డ్రైవర్‌ అటుగా రావటంతో వారికి విషయం చెబుతానని బెదిరించడంతో ఒట్టు వేయించుకున్నాడని  పేర్కొంది. అయితే, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం జరుగుతుందో లేదోనని గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి కామంతో కొట్టుమిట్టాడుతున్న విజిలెన్స్‌ సెక్యూరిటీ కానిస్టేబుల్‌ నాగరాజుపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. కాగా, పారిశుధ్య కార్మికురాలికి మద్దతుగా స్వీపింగ్‌ కాంట్రాక్టర్‌ సైతం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ దగ్గర కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే మహిళలపై నాగరాజు అకృత్యాలు తీవ్రమవుతున్నాయని, గతంలోనూ ఇద్దరి మహిళల విషయంలో ఇలాగే వ్యవహరించాడని ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-05-15T06:17:49+05:30 IST