అత్యాచారం చేసి.. చంపేశారు

ABN , First Publish Date - 2021-04-01T17:05:32+05:30 IST

బాలికది అత్యాచారం, హత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది...

అత్యాచారం చేసి.. చంపేశారు

  • హెచ్చార్సీని ఆశ్రయించిన చిన్నారి తల్లిదండ్రులు 


హైదరాబాద్/సైదాబాద్‌ : సైదాబాద్‌ ఖాజాబాగ్‌ గుడిసెల్లో ఈ నెల 23న గిరిజన చిన్నారి (10)పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బాధిత కుటుంబ సభ్యులు గిరిజన సంఘం ప్రతినిధులతో కలిసి మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. సైదాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు తూతూ మంత్రంగా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా నిందితుడిని అరెస్ట్‌ చేయలేదన్నారు. తమకు న్యాయం జరిగేలా పోలీసులను ఆదేశించాలని బాధితులు వేడుకున్నారు.


తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు

బాలికది అత్యాచారం, హత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారి మృతదేహంపై దుస్తులు లేకపోవడం, ముఖంపై గాయాలుండటం గమనించిన కుటుంబసభ్యు లు అత్యాచారం, హత్యగా అనుమానించారు. మంగళవారం తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, హత్య, ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 


పోలీసుల అదుపులో నిందితుడు...?

బాలిక గుడిసె పక్కనే ఉండే ఓ యువకుడు(20) అత్యాచారం  చేసి హత్య చేసి ఉండవచ్చని సైదాబాద్‌ పోలీసులు అనుమానిస్తున్నా రు. బాధిత కుటుంబ సభ్యులుసైతం అతడిపై ఫిర్యాదు చేశారు. బాలిక ఉరి వేసుకుందని ఆ యువకుడే ముందుగా చెప్పడం మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. గుడిసెలో ఉన్న బాలిక ఉరేసుకుంద న్న విషయం ఎలా తెలుసన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ యువకు డే అత్యాచారం జరిపి, హత్య చేసి డ్రామా ఆడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు చూస్తున్నారు. 


విచారణాధికారిగా మలక్‌పేట ఏసీపీ

బాలిక మృతి కేసు దర్యాప్తునకు మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ ను విచారణాధికారిగా నియమించారు. ఏసీపీ పర్యవేక్షణలో కేసు పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఖాజాబాగ్‌ గుడిసెల ప్రాంతం సున్నితమైనందున ముందు జాగ్రత్తగా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-04-01T17:05:32+05:30 IST