రేప్‌ నిందితుడు.. 22 ఏళ్లకు దొరికాడు!

ABN , First Publish Date - 2021-02-25T07:04:37+05:30 IST

అదో సామూహిక అత్యాచార కేసు. రాష్ట్ర ప్రభుత్వాన్నే గడగడలాడించిన కేసు. ఒడిసా ముఖ్యమంత్రిగా ఉన్న జేబీ పట్నాయక్‌ ప్రమేయంతోనే ఘటన

రేప్‌ నిందితుడు.. 22 ఏళ్లకు దొరికాడు!

1999లో ఒడిసాలో ఐఎ్‌ఫఎస్‌ అధికారి  భార్యపై ముగ్గురి అత్యాచారం

 ఉరితీయండి: బాధితురాలు


భువనేశ్వర్‌, ఫిబ్రవరి 24: అదో సామూహిక అత్యాచార కేసు. రాష్ట్ర ప్రభుత్వాన్నే గడగడలాడించిన కేసు. ఒడిసా ముఖ్యమంత్రిగా ఉన్న జేబీ పట్నాయక్‌ ప్రమేయంతోనే ఘటన జరిగిందని బాధితురాలు సంచలన ఆరోపణలు చేయడం, అవి మరింత తీవ్రమయ్యేలా అత్యాచార ఘటనను జేబీ తేలిక చేసి మాట్లాడటం.. చివరికి తన పదవికి రాజీనామా చేసేదాకా దారితీసిన సంచలనాత్మకమైన కేసు! గ్యాంగ్‌ రేప్‌ ఘటన చోటుచేసుకొని రెండు దశాబ్దాలు గడిచిపోయాయి.


ముగ్గురు వ్యక్తులు ఓ నిర్మానుష్య ప్రదేశంలో దారికాచి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎ్‌ఫఎస్‌) అధికారి మాజీ భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు రోజుల వ్యవధిలోనే పట్టుపడ్డారు. మూడో వ్యక్తి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కేసులో అతడే ప్రధాన నిందితుడు. 22 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. స్వస్థలం నుంచి పరారై.. రాష్ట్రాలూ దాటేసి.. ముంబైకి దగ్గర్లోని ఆంబే లోయ ప్రాంతంలో పేరు మార్చుకొని బతుకుతున్నా కూడా నిందితుడు చేసిన ఒకే ఒక పొరపాటు అతడిని పట్టించింది. అక్కడ ప్లంబర్‌గా పనిచేస్తున్న అతడు తన కుటుంబసభ్యులకు ఆన్‌లైన్‌లో డబ్బు పంపి దొరికిపోయాడు.  



ఆపరేషన్‌ వైపర్‌ 

ఇటీవల పెండింగ్‌లో ఉన్న కేసులను ఒడిసా పోలీసులు దుమ్ముదులపడంతో ఈ గ్యాంగ్‌రేప్‌ కేసు, తప్పించుకు తిరుగుతున్న వివేకానంద బిశ్వాల్‌  కేసు వారి దృష్టికి వచ్చింది. వివేకానందను పట్టుకునేందుకు ‘ఆపరేషన్‌ వైపర్‌’ పేరుతో ముగ్గురు సిబ్బందితో కూడిన బృందం రంగంలోకి దిగింది. నిందితుడి స్వగ్రామం నరన్‌పూర్‌కు వెళ్లింది. అక్కడ నిందితుడి కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలను సేకరించింది. ఈ క్రమంలో ఆ కుటుంబసభ్యుల ఖాతాలోకి జలంధర్‌ స్వెయిన్‌ అనే వ్యక్తి నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు వస్తున్నట్లు తెలుసుకుంది.


నిందితుడి ఖాతా వివరాల ఆధారంగా ముంబై ఆంబీలోయ ప్రాంతానికి వెళ్లి వివేకానంద అలియాస్‌ జలంధర్‌ స్వెయిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ పరిణామంపై బాధితురాలు స్పందించారు. ఏళ్లుగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకొని న్యాయస్థానం ఎదుట నిలబెట్టడం ఇక సాధ్యపడకపోవచ్చునని అనుకున్నానని చెప్పారు. నిందితుడిని ఉరితీయాలని, కనీసం యావజ్జీవకారాగారశిక్ష అయినా విధించాలని కోరారు.



ఎందుకంత సంచలనాత్మకం? 

ఈ రేప్‌ ఘటనకు రెండేళ్ల ముందు అంటే 1997 జూలై 12న అప్పటి రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఇంద్రజీత్‌ రేపై ‘అత్యాచార బాధితురాలు’ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త గృహ వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలంటూ అప్పట్లో ఇంద్రజిత్‌ను తాను కలిశానని, తనపై ఆయన అత్యాచారానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. సీఎం జేబీ పట్నాయక్‌కు ఇంద్రజీత్‌ సన్నిహితులని, అందుకే ముఖ్యమంత్రి ఆయన్ను కాపాడుతున్నారనీ ఆరోపించారు. 


Updated Date - 2021-02-25T07:04:37+05:30 IST