శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా Ranil Wickremesinghe ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-07-15T19:37:40+05:30 IST

శ్రీలంక (Sri Lanka) తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే (Ranil

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా Ranil Wickremesinghe ప్రమాణ స్వీకారం

కొలంబో : శ్రీలంక (Sri Lanka) తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో నిరసనలు పెల్లుబకడంతో గొటబయ రెండు రోజుల క్రితం దేశం విడిచి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. 


గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన శుక్రవారం ప్రకటించారు. అనంతరం రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు స్పీకర్ తెలిపారు. 


గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోయే ముందు విక్రమసింఘేను తాత్కాలిక దేశాధ్యక్షునిగా నియమించారు. ఇదిలావుండగా, నిరసనకారులు ఆక్రమించుకున్న ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌ను ఖాళీ చేసి, తిరిగి అధికారులకు అప్పగించడంపై చర్చలు జరుగుతున్నాయి. దేశాధ్యక్షుడు, ప్రధాన మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు ప్రెసిడెంట్ హౌస్, ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి అధికారిక నివాసాలను ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. గొటబయ రాజీనామాతో  ప్రెసిడెంట్ హౌస్, పీఎం నివాసాలను నిరసనకారులు ఖాళీ చేశారు. 


నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎంపీలకు అవకాశం కల్పించాలని ప్రజలను పార్లమెంటు స్పీకర్ కోరారు. ఈ ప్రక్రియ ఏడు రోజుల్లోగా పూర్తవుతుందని తెలిపారు. ఎంపీలు తమ ఆత్మప్రబోధం ప్రకారం స్వేచ్ఛగా వ్యవహరించేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. 


శ్రీలంక పార్లమెంటు సమావేశాలు శనివారం ప్రారంభమవుతాయి. 


Updated Date - 2022-07-15T19:37:40+05:30 IST