Sri Lanka economic crisis: శ్రీలంక ప్రధాని విక్రమసింఘే రాజీనామా

ABN , First Publish Date - 2022-07-10T02:17:14+05:30 IST

శ్రీలంక సంక్షోభం ముదిరి పాకానపడింది. అమాంతం పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు

Sri Lanka economic crisis: శ్రీలంక ప్రధాని విక్రమసింఘే రాజీనామా

కొలంబో: శ్రీలంక సంక్షోభం ముదిరి పాకానపడింది. అమాంతం పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. దీంతో పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ నేపథ్యంలో నేడు ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వేలాదిమంది అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) నివాసాన్ని ముట్టడించారు. అయితే, ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే ఉప్పందించడంతో ఆయన సురక్షితంగా అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. ఆందోళనకారులు తన ఇంటిని ముట్టడించడానికి ముందే ఆయన తన నివాసం నుంచి పరారయ్యాడు. దీంతో ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడ్డారు. 


మరోవైపు, దేశంలో పరిస్థితి అదుపుతప్పడంతో ఇటీవల ప్రధానిగా బాధ్యలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) తన పదవికి రాజీనామా చేశారు.  ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. రాజీనామా అనంతరం విక్రమసింఘే మాట్లాడుతూ.. ఆల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ప్రధానమంత్రి రాజీనామా చేసిన వెంటనే కేబినెట్ మంత్రి బండుల గుణవర్ధనె కూడా తన పదవికి రాజీనామా చేశారు.


మరోవైపు, ఆందోళనను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై విక్రమసింఘే భద్రతా సిబ్బంది దాడిచేయడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడిని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ఖండించారు. కాగా, అధ్యక్షుడి మీడియా హెడ్ సుదేవ హెట్టియారచ్చి రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభం మరింత ముదరడంతో జులై 15 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Updated Date - 2022-07-10T02:17:14+05:30 IST