SriLanka New President: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే

ABN , First Publish Date - 2022-07-20T18:28:40+05:30 IST

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఆయనపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమయినప్పటికీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

SriLanka New President: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే

కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) ఎన్నికయ్యారు. ఆయనపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమయినప్పటికీ దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఎన్నుకున్నారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 225 సీట్లకుగానూ 223 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు గైర్హాజరవ్వగా.. 4 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో చెల్లుబాటు అయిన 219 ఓట్లలో రణిల్ విక్రమసింఘేకి మెజారిటీ దక్కింది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగుమమైంది. గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయాక తాత్కాలిక ప్రెసిడెంట్‌గా  విక్రమసింఘే కొనసాగుతున్న విషయం తెలిసిందే.


6 సార్లు ప్రధానమంత్రిగా అనుభవం

6 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన విశేష అనుభవం రణిల్ విక్రమసింఘేకి ఉంది. అయితే ఇటివల చోటుచేసుకున్న పరిణామాలతో రాజపక్సల భాగస్వామిగా ఆయనపై ముద్రపడింది. రాజపక్స కుటుంబ పార్టీ ఎస్ఎల్‌పీపీ మద్దతిస్తుండడంతో వారి ప్రయోజనాలను విక్రమసింఘే కాపాడుతున్నారని ఆందోళనకారులు విశ్వసిస్తున్నారు. ప్రధాని పదవికి ఆయన కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాజపక్స కుటుంబ ప్రయోజనాలకు అనుగుణంగానే విక్రమసింఘే వ్యవహరిస్తున్నారని జనాలు నమ్ముతున్నారని, ఈ పరిణామం అధ్యక్ష ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుందని పరిశీలకులు అంచనా వేశారు. కానీ అలా జరగలేదు.

Updated Date - 2022-07-20T18:28:40+05:30 IST