సింఘేకు ‘సెగ’ల స్వాగతం!

ABN , First Publish Date - 2022-05-14T08:11:34+05:30 IST

ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో అల్లాడుతున్న శ్రీలంక 26వ ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది ఆరోసారి. అయితే, ఆయనకు తొలిరోజే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత స్వాగతం పలికింది!

సింఘేకు ‘సెగ’ల స్వాగతం!

సహకరించేది లేదన్న విపక్షాలు

ప్రభుత్వంలో భాగం కాబోమని వెల్లడి

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విక్రమ


కొలంబో, మే 13: ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో అల్లాడుతున్న శ్రీలంక 26వ ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది ఆరోసారి. అయితే, ఆయనకు తొలిరోజే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత స్వాగతం పలికింది! ప్రజాగళానికి ఏమాత్రం ప్రాధాన్యం లేని ఈ నియామకాన్ని తాము గుర్తించేది లేదని.. సహకరించేది అంతకన్నా లేదని ఎస్‌జేబీ, జేవీపీ వంటి ప్రతిపక్షాలు బహిరంగ ప్రకటనలు చేశాయి. సింఘే తాత్కాలిక ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కాబోమని తేల్చిచెప్పాయి. అయితే.. దేశాన్ని ఆర్థికంగా ఒడ్డున పడేసేందుకు తీసుకునే చర్యల్లో బయట నుంచి మద్దతిస్తామని ప్రకటించాయి. 73 ఏళ్ల విక్రమసింఘే యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ) నాయకుడు. సోమవారం ప్రధాని పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత అధ్యక్షుడు గొటబయ.. విక్రమసింఘేను నియమించిన విషయం తెలిసిందే. రాజపక్సే కుటుంబంతో విక్రమసింఘేకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు, ప్రతిపక్షాల మనసు దోచేలా ఆయన పాలన సాగాల్సిన అవసరం ఉంది. అదేసమయంలో అవసరమైతే.. 225 మంది సభ్యులున్న పార్లమెంటులో విక్రమసింఘే తన మెజారిటీని సైతం నిరూపించుకోవాల్సి రావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, ఇది సాధ్యమయ్యేనా అనేది ప్రశ్న.


విపక్షాలతో ఉక్కిరిబిక్కిరి?

ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ(ఎ్‌సజేబీ) పార్టీ ప్రధాన కార్యదర్శి రంజిత్‌ మద్దుమ బండార మాట్లాడుతూ.. విక్రమసింఘేకు తమ మద్దతు ఎట్టి పరిస్థితిలోనూ ఉండదని తేల్చి చెప్పారు. 2020 ఎన్నికల్లో సింఘే ఎన్నిక కానందున ఆయన నియామకానికి అసలు చట్టబద్ధతే లేదన్నారు. సింఘే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార పక్షం ఎస్‌ఎల్‌పీపీలోని అసమ్మతి నేత విమల్‌ వీరవంశ మాట్లాడుతూ.. రాజపక్స-విక్రమసింఘే ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కాబోమని తెలిపారు. మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని ఎస్‌ఎల్‌ఎ్‌ఫపీ కేంద్ర నాయకత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. మరో ప్రతిపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున(జీవీపీ) కూడా ప్రభుత్వంలో భాగం కాబోమంది. 


భారత్‌తో బంధం బలోపేతం: ప్రధాని

భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని శ్రీలంక నూతన ప్రధాని విక్రమసింఘే చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో భారత్‌ అందిస్తున్న ఆపన్న హస్తానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, దేశంలో నిరసనలు ఎక్కడా చల్లబడలేదు. మాజీ మంత్రికి చెందిన ఒక కారును నిరసనకారులు చెరువులో తోసేసిన ఘటన సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున వైరల్‌ అయింది. కాగా, శ్రీలంక వీసాల జారీని నిలిపివేసినట్టు వచ్చిన వార్తలను లంకలోని భారత హైకమిషన్‌ తోసిపుచ్చింది. 

Read more