రేపు పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-05-07T00:31:22+05:30 IST

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్‌సీ చీఫ్ ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ...

రేపు పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్‌సీ చీఫ్ ఎన్ రంగస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు రాజ్‌నివాస్‌లో అత్యంత నిరాడంబరంగా జరగనున్న ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. కాగా శుక్రవారం రామస్వామి ఒక్కరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన సారథ్యం వహించనున్న ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో బీజేపీ సహా ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. సాధారణంగా పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి సహా మంత్రివర్గంలో ఆరుగురు మాత్రమే ఉంటారు. ఈ సారి ఇందులో ఓ ఉపముఖ్యమంత్రి కూడా ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నమశ్శివాయంకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారని చెబుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం పదవిపై ఇంకా పార్టీ అధిష్టానం నుంచి స్పష్టత లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి.


పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 16 స్థానాల్లో పోటీచేసిన ఏఐఎన్‌ఆర్‌సీ 10 స్థానాలు గెలుచుకోగా... బీజేపీ తొమ్మిది చోట్ల పోటీ చేసి ఆరు స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీలో మొత్తం బలం 30 స్థానాలు కాగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16గా ఉంది. ఏఐఎన్ఆర్‌సీ, బీజేపీ కలిపి 16 స్థానాలు ఉండగా.. ఇండిపెండెంట్ల సంఖ్య 6గా ఉండడంతో వారు కూడా ఇప్పుడు రామస్వామికి  బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. మరోవైపు ఇక్కడ 13 స్థానాల్లో పోటీచేసిన డీఎంకే 6 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 14 చోట్ల పోటీచేసి కేవలం రెండే రెండు స్థానాల్లో విజయం దక్కించుకుంది. 

Updated Date - 2021-05-07T00:31:22+05:30 IST