లోక్‌ అదాలత్‌లో రంగారెడ్డి టాప్‌

ABN , First Publish Date - 2022-03-13T16:34:49+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో

లోక్‌ అదాలత్‌లో రంగారెడ్డి టాప్‌

  • 94,275 కేసుల పరిష్కారం
  • సిటీ సివిల్‌ కోర్టులో 713  

హైదరాబాద్‌ సిటీ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో 94,275 కేసులను పరిష్కారించారు. మొత్తం 48 బెంచీలను ఏర్పాటు చేశారు.  శనివారం  రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుపతి ప్రారంభించారు. లోక్‌ అదాలత్‌లో వెలువడిన తీర్పు అప్పీల్‌ లేని అంతిమ తీర్పు అని ఆయన అన్నారు. లోక్‌ అదాలత్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచిందన్నారు.



సిటీ సివిల్‌ కోర్టులో..

హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు పరిధిలో నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో 713 కేసులు పరిష్కారం అయినట్లు ప్రధాన న్యాయమూర్తి రేణుక యారా తెలిపారు. కేసుల పరిష్కారం ద్వారా వివిధ కేసుల్లో బాధితులకు సుమారు రూ.28 కోట్ల పరిహారం అందినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితులకు రూ.26కోట్ల 46 లక్షల 89వేలు బాధితులకు పరిహారంగా అందేలా వివాదాలను పరిష్కరించామన్నారు. 222 ఫ్రీ లిటిగేషన్‌ కేసుల ద్వారా బ్యాంకులకు, ఇతర వ్యక్తులకు రూ.2కోట్ల 9లక్షల 18వేల 716లు పరిహారంగా అందేలా పరిష్కరించినట్లు తెలిపారు. న్యాయ కళాశాల విద్యార్థులతో జాతీయ లోక్‌ అదాలత్‌ సర్వే నిర్వహించినట్లు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఈకె మురళీమోహన్‌ తెలిపారు. సర్వేలో పెండేకంటి, కేశవ మెమోరియల్‌ లా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 


కేసుల సత్వర పరిష్కారానికి చక్కటి వేదిక..

కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లు చక్కటి వేదిక అని హైదరాబాద్‌ వాణిజ్య వివాద పరిష్కార ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి డాక్టర్‌ పట్టాభి రామారావు అన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా పురానా హవేలిలోని సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో డాక్టర్‌ పట్టాభి రామారావు ప్రసంగించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇ.కె. మురళీమోహన్‌, రెండో అదనపు చీఫ్‌ జడ్జి సి.కె.ప్రభాకర్‌ రావు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-13T16:34:49+05:30 IST