పుష్పలాగే పుష్కర్‌ కూడా తగ్గేదే లేదు...

ABN , First Publish Date - 2022-02-09T01:28:07+05:30 IST

టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ''పుష్ప'' చిత్రం ఇటు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఓ కుదుపు కుదిపేస్తుంటే..

పుష్పలాగే పుష్కర్‌ కూడా తగ్గేదే లేదు...

న్యూఢిల్లీ: టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ''పుష్ప'' చిత్రం ఇటు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఓ కుదుపు కుదిపేస్తుంటే, తాజాగా ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ నేతల నోట 'పుష్ప' మాట వినిపిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారంనాడు ఉత్తరాఖండ్ ‌ఎన్నికల ప్రచారంలో ఈ సినిమా ప్రస్తావన చేస్తూ, సీఎం పేరు కూడా పుష్కర్ సింగ్ అంటూ పోలిక తెచ్చారు. గంగోలిహట్‌ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ.. ''ఇవాళ ఒక సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు పుష్ప. ఇక్కడ (ఉత్తరాఖండ్) కూడా ఒక పుష్కర్ (సీఎం పుష్కర్ థామి) ఉన్నారు. ఆయన చాలా సింపుల్‌గా, సౌమ్యంగా ఉంటారు. ఆయనలో పువ్వూ (ఫ్లవర్) ఉంది, నిప్పూ (ఫైర్) ఉంది. ఆయనను ఎవరూ ఆపలేరు, ఆయన తగ్గేదే లేదు'' అంటూ చమత్కరించారు.


నాయకుడూ లేడు..నినాదమూ లేదు..

కాంగ్రెస్ పార్టీలో నాయకుడు కానీ, కనీసం ఒక నినాదం కానీ లేవని రాజ్‌నాథ్ విమర్శించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ లూటీ చేసిందని, ఇంకెంతమాత్రం వాళ్ల లూటీని సాగనీయరాదని, వాళ్లు మాట్లాడేవి, చేసే వాగ్దానాలు బూటకాలని అన్నారు. ప్రధాని మోదీ 2014లో ప్రధాని కాగానే ఉత్తరాఖండ్‌ను స్పెషల్ కేటగిరి స్టేట్‌గా ప్రకటించారని అన్నారు. అటల్‌జీ (వాజ్‌పేయి) ఉత్తరాఖండ్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించారని, కాంగ్రెస్ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ స్పెషల్ హిల్ స్టేట్స్ హోదాను ఉపసంహరించుకుందని చెప్పారు.

Updated Date - 2022-02-09T01:28:07+05:30 IST