ఆదిభాట్ల మున్సిపాలిటీలో అవినీతి జలగలు

ABN , First Publish Date - 2020-09-25T16:23:22+05:30 IST

జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది.

ఆదిభాట్ల మున్సిపాలిటీలో అవినీతి జలగలు

రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభాట్ల మున్సిపాల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. బిల్ కలెక్టర్‌లు దొరికినంత దోచుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నారు.  స్థలం కొనకముందే ఇంటికి అనుమతులు ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఆదిభాట్ల మున్సిపాలిటీలో జరుగుతున్న అవితినీతి‌పై కౌన్సిలర్‌లు జిల్లా కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. కాగా ఎలాంటి అవినీతి జరగలేదని మున్సిపల్ కమిషనర్ సరస్వతి నివేదిక ఇచ్చారు. అయితే మరోసారి కౌన్సిలర్‌లు పిర్యాదు చేయటంతో జిల్లా అదనపు కలెక్టర్ ఆదిబాట్ల మున్సిపల్  కార్యాలయాన్ని సందర్శించారు. 


ఈ సందర్బంగా మంగల్‌పల్లి పటేల్‌గూడ గ్రామానికి చెందిన నీరజ అనే మహిళ గత ఏడాది డిసెంబర్  7న ప్లాట్ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ 3600/2019 కాగా ఈ ప్లాట్‌లో ఇల్లు నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ ఇంటి యజమాని ప్లాట్ కొనుగోలు చేయక మునుపే 6 నెలల ముందు 2019 జూలై 30న ఇంటి నిర్మాణానికి పటేల్ గూడా మాజీ కార్యదర్శి అంజిరెడ్డి అనుమతులు ఇచ్చారు. దీనిపై జిల్లా అదనపు కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్‌ను ప్రశ్నించగా.. తనకు తెలియదని కమిషనర్ చెప్పారు. అయితే మున్సిపల్‌లో ఇంత అవినీతి జరుగుతుంటే తమరేం చేస్తున్నారంటూ కమిషనర్‌పై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగల్ పల్లి పటేల్ గూడ, ఆదిభాట్ల గ్రామాల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై పూర్తి వివరాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. మేనేజర్లు, బిల్ కలెక్టర్‌లు చాలా అవినీతి‌కి పాల్పడ్డారని తేలటంతో ఇందులో పాత్ర దారులైన బిల్ కలెక్టర్‌లు మల్లారెడ్డి, రాజశేఖర్‌లను సస్పెండ్ చేశారు. మేనేజర్ పాత్రపై విచారణ చేపడుతున్నామని అవినీతికి పాల్పడ్డట్టు తేలితే తగు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అంజిరెడ్డి మేనేజర్‌గా యెల్లారెడ్డిగూడలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆదిభాట్ల మున్సిపల్ కమిషనర్‌పై జిల్లా అదనపు కలెక్టర్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అధికారులు లంచాలు పాల్పడుతుంటే తమరేం చేస్తున్నారు అంటూ కమిషనర్‌ను ప్రశ్నించారు. 


ఆదిభాట్ల మున్సలిపాలిటీలో అవినీతిపై కమిషనర్ సరస్వతి మాట్లాడుతూ....ఆదిభాట్ల మున్సిపాలిటీలోని పటేల్ గూడలో బిల్ కలెక్టర్లు మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తర్వాత గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వడంపై వారి దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేయడంపై అదనపు కలెక్టర్ సస్పెండ్ చేశారని తెలిపారు. అలాగే మేనేజర్ అంజిరెడ్డిపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. 


బాధితుడు సత్యనారాయణ మాట్లాడుతూ... బిల్ కలెక్టర్లు మల్లారెడ్డి, రాజ్ శేఖర్ మేనేజర్ అంజిరెడ్డి తమ దగ్గరకు వచ్చారని.. రూ.17500 కడితే పర్మిషన్ లెటర్ ఇచ్చారని తెలిపారు.  మొత్తం లక్ష రూపాయలు దాకా ఖర్చు అయ్యాయని బాధితుడు వాపోయాడు.

Updated Date - 2020-09-25T16:23:22+05:30 IST