‘బాహుబలి’లో భళ్లాలుడిగా భారీ ఆకారంతో ఆకట్టుకున్నాడు రానా. ఇప్పుడు జంగిల్ మాన్ బాన్‌దేవ్‌గా అవతారమెత్తాడు. త్వరలో విడుదలయ్యే ‘హాథి మేరే సాథి’ (తెలుగులో ‘అరణ్య’)లో సన్నగా కనిపించబోతున్నాడు. భళ్లాలుడి నుంచి బాన్‌దేవ్‌గా మారేందుకు 30 కిలోల బరువు తగ్గాడు రానా. అదెలాగో చెబుతున్నాడిలా ...
30 కిలోలు తగ్గాను
భళ్లాలదేవుడి పాత్ర కోసం చాలా బరువు పెరిగా. ‘హాథి మేరే సాథి’ సినిమాలో బాన్దేవ్ పాత్ర కోసం ప్రభు సాల్మన్ బరువు తగ్గమని చెప్పారు. ఆ సినిమాలో ముప్పై ఏళ్ల పాటూ అడవిలోనే జీవించిన వ్యక్తిలా కనిపించేలా బరువు తగ్గడం అంత సులువు కాదు. సినిమాల్లోకి రావడానికి ముందు ఎంత కష్టపడి బరువు తగ్గానో... ఈ సినిమా కోసం అంతే కష్టపడ్డా. చాలా మంది అభిమానులు ఇన్‌స్టాలో ‘ఇంత సన్నగా ఎలా మారారు?’; ‘భళ్లాల దేవుడికి ఏమైంది?’ అని అడుగుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలోనే 30 కిలోల బరువు తగ్గా. అందుకే అందరికీ సన్నగా కనిపిస్తున్నా. సినిమా పూర్తవ్వగానే మళ్లీ కండలు పెంచుతా.
నాకేం కొత్త కాదు
నాకు బరువు పెరగడం, తగ్గడం కొత్త కాదు. సినిమాల్లోకి రాక ముందు 125 కిలోలు ఉండేవాణ్ని. 2007లో నా వీఎఫ్ఎక్స్ సంస్థని అమ్మేసి, పూర్తిస్థాయిలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా. హీరో అవ్వాలంటే ఫిట్నెస్ చాలా అవసరం. హీరో పొట్టతో కనిపిస్తే ప్రేక్షకులు మెచ్చరు. అందుకోసం దాదాపు ఎనిమిది నెలలు కష్టపడి బరువు తగ్గా. వారంలో ఆరు రోజులు చాలా కఠినంగా డైట్ పాటించేవాణ్ని. ఒకరోజు మాత్రం నచ్చిన ఆహారాన్ని తినేవాణ్ని. అలా 20 కిలోలు తగ్గా. థియేటర్ క్లాసులకు, డ్యాన్సు క్లాసులకు హాజరయ్యా. స్టంట్స్ చేయడంలో కూడా శిక్షణకు వెళ్లా. ఆ తరువాత మీ ముందుకు ‘లీడర్’గా వచ్చా.
మాంసాహారానికి బైబై
బరువు తగ్గడానికి వర్కవుట్స్‌తో పాటూ తీసుకునే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే నేను ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోను. మాంసాహారం మానేసి కొన్ని నెలల పాటూ పూర్తి శాకాహారిగా మారిపోయాను. అంతేకాదు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, ఉప్పు కలిగిన వంటకాలు తినడం కూడా తగ్గించా. ఓట్ మీల్స్, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తిన్నా. తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులువైంది. ఇష్టమైన ఆహారం కళ్ల ముందున్నా తినకుండా కంట్రోల్ చేసుకోవడం మాత్రం చాలా కష్టంగా అనిపించేది.
అథ్లెట్‌లా కష్టపడి...
ఒక బాడీ బిల్డర్, క్రీడాకారుడు ఎంతలా ఫిట్నెస్ కోసం కష్టపడతాడో... నేనూ అలాగే జిమ్‌లో వర్కవుట్స్ చేస్తా. నా జీవితంలోనే కాదు, వృత్తిలో కూడా జిమ్ ఒక భాగమైపోయింది. జిమ్‌కి వెళ్లని రోజు ఏదో లోటుగా అనిపిస్తుంది. బాన్‌దేవ్‌గా మారేందుకు రోజూ రెండు గంటల పాటు వర్కవుట్స్ చేశా. ముఖ్యంగా రన్నింగ్, సైక్లింగ్, ఈత, స్కిప్పింగ్, మెట్లు ఎక్కి దిగడం వంటి కార్డియో సెషన్స్ అన్నమాట. బాహుబలి పూర్తయ్యాక కొన్ని నెలల పాటూ బరువు తగ్గడంపైనే దృష్టి పెట్టా.