మనీలాండరింగ్ కేసు: జర్నలిస్ట్ రాణా అయూబ్‌ స్పందన

ABN , First Publish Date - 2022-02-12T01:09:37+05:30 IST

నాపై వస్తున్న ఆరోపణలు ఉద్దేశపూర్వకమైనవి, నాపై తప్పుడు ప్రచారం చేయడానికి ముందస్తుగా రూపొందించినవి. నా బ్యాంకు రికార్డులను తప్పుగా చదివారు. దుర్మార్గంగా నాపై కేసులు ప్రయోగించాలని చూస్తున్నారు..

మనీలాండరింగ్ కేసు: జర్నలిస్ట్ రాణా అయూబ్‌ స్పందన

న్యూఢిల్లీ: 1.77 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, పెద్ద మొత్తంలో డబ్బును సొంత అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రాణా అయూబ్ స్పందించారు. తాను ఎవరినీ మోసం చేయలేదని, కొంత మంది కుట్రపూరితంగా తనపై తప్పుడు కేసులు పెట్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. కొవిడ్-19 అనంతర పరిస్థితుల్లో నిరుపేదలకు సాయం చేయడానికి కెట్టో వేదికగా నిధులు సేకరించిన మాట వాస్తవమే అయినప్పటికీ, దాంట్లో డబ్బులేమీ దుర్వినియోగం చేయలేదని, ప్రతి రూపాయికి సంబంధించిన లెక్కలు రాసి ఉన్నాయని రాణా అయూబ్ అన్నారు.


శుక్రవారం ఈ విషయమై ఆమె ఒక లేఖను విడుదల చేశారు. ‘‘నాపై వస్తున్న ఆరోపణలు ఉద్దేశపూర్వకమైనవి, నాపై తప్పుడు ప్రచారం చేయడానికి ముందస్తుగా రూపొందించినవి. నా బ్యాంకు రికార్డులను తప్పుగా చదివారు. దుర్మార్గంగా నాపై కేసులు ప్రయోగించాలని చూస్తున్నారు. కొవిడ్-19 ప్రభావం వల్ల నష్టపోయిన వారికి, చితికిపోయిన వారికి ఏప్రిల్ 2020, జూన్ 2020, మే 2021 ల్లో సహాయం అందించాలనే ఉద్దేశంతో కెట్టో వేదిక ద్వారా నిధులు సమీకరించాం. మేం చేసిన పనికి సంబంధించిన అన్ని వివరాలు రికార్డు చేయబడి ఉన్నాయి’’ అని రాణా తెలిపారు. కెట్టో వారు వెంటనే తన పాన్ కార్డు నంబర్ అడిగిన సమయంలో తన బ్యాంకు సరిగా పని చేయడం లేదని, అందుకే తన తండ్రి, సోదరి బ్యాంకు పత్రాలు ఇవ్వాల్సి వచ్చిందని రాణా వెల్లడించారు.


2021 ఏడాదిలో రాణా అయూబ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా 1.77 కోట్ల రూపాయలను అటాచ్ చేసింది. దాతల నిధులను వ్యక్తిగతంగా వినియోగించుకున్నారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రాణా అయూబ్, ఆమె కుటుంబం పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లను అటాచ్‌మెంట్ చేయడానికి ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-02-12T01:09:37+05:30 IST