ఈద్‌ ముబారక్‌

ABN , First Publish Date - 2021-05-14T06:20:09+05:30 IST

ముప్పయ్‌ రోజుల పాటు ఉపవాస దీక్షలు, నిత్యం నమాజులు, దానధర్మాలు, ఆఽధ్యాత్మిక బోధనల మధ్య గడిపిన ముస్లింలు శుక్రవారం రంజాన్‌ పండుగను నిర్వహించుకోనున్నారు.

ఈద్‌ ముబారక్‌

  1. ముగిసిన ఉపవాస దీక్షలు   
  2. నేడు రంజాన్‌ పర్వదినం
  3. ఏర్పాట్లు చేసుకున్న ముస్లింలు


కర్నూలు (కల్చరల్‌), మే 13: ముప్పయ్‌ రోజుల పాటు ఉపవాస దీక్షలు, నిత్యం నమాజులు, దానధర్మాలు, ఆఽధ్యాత్మిక బోధనల మధ్య గడిపిన ముస్లింలు శుక్రవారం రంజాన్‌ పండుగను నిర్వహించుకోనున్నారు. ఉపవాస దీక్షలను గురువారం ముగించి, ఆనందోత్సాహాల మధ్య వేడుకలకు సన్నద్ధమయ్యారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో రంజాన్‌ వేడుక ఈ ఏడాది కూడా గృహాలకే పరిమితమవుతోంది. ఈద్గాలలో సామూహిక నమాజులకు అనుమతి లేదు. మసీదుల్లో మాత్రం 50 మంది వరకు నమాజు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో రెండు రోజులుగా రంజాన్‌ సందడి కనిపిస్తోంది. నూతన వస్త్రాలు, పాదరక్షలు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేశారు. వేడుక రోజున చేసుకునే షీర్‌ ఖుర్మా, పిండివంటల తయారీకి సరుకులు తెచ్చుకున్నారు. ఈ కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద జనం బారులు తీరి కనిపించారు. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆత్మకూరు తదితర పట్టణాల్లో మసీదుల వద్ద ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. 


ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాసం

ఇస్లామియా కేలండరులో తొమ్మిదో నెల రంజాన్‌ మాసం. ఈ నెలను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ముస్లింల మతగ్రంథం దివ్య ఖురాన్‌ ఈ మాసంలోనే ఆవిర్భవించింది. దైవ దూతలు పుడమికి విచ్చేసే శుభప్రదమైన రాత్రి షబ్‌ ఏ ఖద్ర్‌ ఈ మాసంలోనే విచ్చేస్తుంది. నెలవంక దర్శనంతో రంజాన్‌ దీక్షలు ఆరంభిస్తారు. నెల తర్వాత నెలవంక దర్శనంతో పండుగను నిర్వహించుకుంటారు. ఈ నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు, నిత్య నమాజులు, ఖురాన్‌ పఠనం, దానధర్మాలు వంటి దైవిక కార్యాలతో మనిషి తనను తాను పునీతం చేసుకుంటాడు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం అని చెప్పుకుంటారు. మానవులను కష్టాల నుంచి, పాపకర్మల నుంచి విముక్తి చేసేందుకే ఈ మాసాన్ని సృష్టించినట్లు మహ్మమ్మద్‌ ప్రవక్త పేర్కొంటారు. 


ఉపవాసం వెనుక..

మనిషి తనలోని ఆకలిదప్పులను జయించడమే కాదు, పొరుగువారి ఆకలి బాధలను గ్రహించడం, వారికి తనవంతు సాయం చేయడమే ఉపవాస దీక్షల్లోని సారాంశం. అందుకే ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందు (సహేరి) నుంచి సూర్యాస్తమయం (ఇఫ్తార్‌) వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాసం ఉంటారు. ఉపవాస దీక్షల ద్వారా బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మతగురువులు చెబుతారు. 


నమాజ్‌లు.. దానధర్మాలు

రంజాన్‌ మాసంలో మత పెద్దలు నమాజ్‌లు చేయిస్తారు. మసీదుకు వెళ్లలేని వారు ఉన్న స్థలంలోనే శుభ్రం చేసుకొని ప్రార్థనలు చేస్తారు. ముస్లింలు రంజాన్‌ ఆఖరు పదిరోజులు ఇళ్లు వదిలి మసీదుల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతారు. అల్లాహ్‌ గురించి ప్రార్థనలు చేస్తూ, ఆధ్యాత్మికంగా గడుపుతారు. రంజాన్‌ పండుగను ఈద్‌-ఉల్‌-ఫిత్ర్‌ అనికూడా అంటారు. ఫిత్రా అంటే దానం అని అర్థం. ఇది దానధర్మాల పండుగ కూడా. దివ్య ఖురాన్‌ సిద్ధాంతం ప్రకారం తాను సంపాదించినదానిలో పేదవారికి దానం చేయాలని ముస్లింలు భావిస్తారు. పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్‌ బోధిస్తుంది. 


నిబంధనలు పాటించాలి


  1. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో నమాజులు ఉండవు
  2. ఇన్‌చార్జి కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి


కర్నూలు(కల్చరల్‌), మే 13: కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా రంజాన్‌ పండుగను జరుపుకోవాలని, ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక నమాజులు ఉండవని ఇన్‌చార్జి కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ప్రార్థనల నిర్వహణ పై ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు.


ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక నమాజుల నిర్వహణ నిషేధించారు. 

ఎవరి ఇళ్లలో వారు నమాజ్‌ (ప్రార్థన)లు చేసుకోవాలి.

మసీదుల్లో 50 మందికి మాత్రమే నమాజ్‌కు అనుమతి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మసీదులో భౌతిక దూరం పాటిస్తూ ఒకటి, రెండు బృందాలుగా ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు. 

మాస్కు ధరించని వారిని మసీదుల్లోకి అనుమతించకూడదు.

కరచాలనం, బంధువుల ఇంటికి వెళ్లడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోకూడదు.

పిల్లలు, వృద్ధులు, దగ్గు, జలుబు, జ్వరం, డయాబెటిస్‌, బీపీ, శ్వాసకోశ, గుండె జబ్బులతో బాధపడేవారు వారి ఇళ్లలోనే నమాజు చేసుకోవాలి. 

మసీదుల నిర్వాహకులు ద్వారం వద్ద సరిపడ శానిటైజర్లు, ధర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలి.

Updated Date - 2021-05-14T06:20:09+05:30 IST