ఇళ్లే ఈద్గాలయ్యాయి..

ABN , First Publish Date - 2021-05-15T06:18:51+05:30 IST

ఇళ్లే ఈద్గాలయ్యాయి..

ఇళ్లే ఈద్గాలయ్యాయి..


నిరాడంబరంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగ


ఉమ్మడి జిల్లాల్లో సందడి లేకుండా  జరిగిన రంజాన్‌ 

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే ప్రార్థనలు


ప్రత్యేక నమాజ్‌ కోసం మౌళి అయిన యూట్యూబ్‌


ఐనవోలు, మే 14: ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) పండుగను ముస్లింలు శుక్రవారం భక్తి, శ్రద్ధలతో నిరాడంబరంగా జరుపుకున్నారు. నెలరోజుల పాటు ఉసవాసాలు ఉన్న ముస్లింలు.. రంజాన్‌ పండుగ రోజున ఈద్గాలకు వెళ్లి సామూహికంగా ప్రత్యేక ప్రార్ధనలు చేయడం సంప్రదాయం. కానీ కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం సాముహిక ప్రార్థనలపై విధించిన అంక్షలను అనుసరిస్తూ ముస్లింలు తమ ఇళ్లనే ఈద్గాలుగా మలుచుకోని ఈద్‌-ఉల్‌-ఫితర్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ పండుగ సందడిలేకుండా జరిగింది. ఈద్గా ప్రాంగాణలు బోసిపోయి కనిపించాయి. ముఖ్యంగా వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లో పోలీసులు ముందుగానే మత పెద్దలతో మా ట్లాడారు. ఈ కరోనా సంక్షోభ పరిస్థితుల్లో మసీదులలో నలుగురి కంటే ఎక్కువ ఉండకూడదనే ప్రభుత్వం నిర్ధేశించిన విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముస్లింలు  ఇళ్లలోనే నమాజ్‌లు ఆచరించారు. అక్కడక్కడా మసీదులలో పరిమితి మించకుండా ప్రార్థనలు చేసుకున్నారు. విశ్వమానవాళిని పట్టిపిడిస్తున్న కరోనా మహమ్మారిని రూపుమాపాలని ముస్లింలు  అల్లాను వేడుకున్నారు. 

అలాయి బలాయి లేదు.. కరచాలనం కనిపించలేదు..


పండుగ నమాజ్‌ పూర్తయ్యాక ముస్లింలో ఈద్గాలలో అలాయి.. బాలయి ( ఆలింగనం) చేసుకొని కరచాలనం చేసి శుభాకాంక్షలు చెప్పుకోవడం అనవాయితీ. బలాయి (ఆపత్‌కాలం)లో అలాయి బలాయి లేకుండా పోయింది. కరచాలనంతో శుభాకాంక్షలు చెప్పుకునే ముస్లిం సొదరులు.. భౌతికదూరం పాటించి నమాజ్‌ పూర్తిచేసుకున్నారు. 

కొత్త దుస్థులు లేకుండానే..

ముస్లింలు జరుపుకునే పెద్ద పండుగ రంజాన్‌. ఇంటిళ్లిపాది కొత్త దుస్తులు ధరించి పండుగను సంతోషాల నడుమ జరుపుకోవడం ప్రత్యేకత. కొవిడ్‌ కారణంగా కొత్తబట్టలు కొనుగోలు చేయలేదు. ఉన్న దుస్తుల్లోనే మేలైన దుస్తులు ధరించి పండుగను జరుపుకున్నారు. బంధువుల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రంజాన్‌ పండుగకు ముస్లింల ప్రత్యేక వంటకాలైన షీర్‌ఖుర్మా, ఇతర వంటకాలతో ఇచ్చే విందులు ఎక్కడ కనిపించలేదు. 


యూట్యూబ్‌ ఆధారంగా ప్రత్యేక ప్రార్ధనలు

సాధారణ నమాజ్‌కు పండుగ నమాజ్‌కు వ్యత్యాసం ఉంటుంది. పండుగ నమాజ్‌ను మౌళిలు, ఇమామ్‌లు ఖుద్బా ప్రసంగాల ద్వారా ఆరు తక్బీర్‌లతో నమాజ్‌ చేయిస్తారు. కొవిడ్‌ కారణంగా ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు లేకపోవడంతో చాలామంది తమ తమ ఇళ్లలో ప్రత్యేక నమాజ్‌ విధానాన్ని యూ ట్యూబ్‌ సహాయంతో తెలుసుకోని ఆచరించారు. 


Updated Date - 2021-05-15T06:18:51+05:30 IST